గాయపడ్డ టీడీపీ అభ్యర్థి కుమారుడు రాజేంద్రప్రసాద్ గాయపడిన పునుగోటి రామాంజనేయులు
టీడీపీ వర్గీయులపై వైసీపీ రాళ్లదాడి.. ముగ్గురికి గాయాలు
టీడీపీ అభ్యర్థిని కుమారుడి పరిస్థితి ఆందోళనకరం, గుంటూరు తరలింపు
అద్దంకి, ఏప్రిల్ 7: మండలంలోని ధర్మవరంలో టీడీపీ వర్గీయులపై వైసీపీ వారు దాడిచేయటంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసు కుంది. బాధితుల కధనం మేరకు.. గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికను టీడీపీ, వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ వర్గీయుడు గెలుపొందటంతో ఎంపీటీసీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో వైసీపీ వర్గీయులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల వారు పోటాపోటీగా డబ్బులు కూడా ఖర్చుచేస్తున్నారు. ఎస్టీకాలనీలోని ఓట్లు మొత్తాన్ని తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ వర్గీయులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈక్రమంలో బుధవారం రాత్రి టీడీపీ వర్గీయులు ఐదుగురు ఎస్టీ కాలనీవైపు వెళ్లారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న వైసీపీ వర్గీయులు వెంటనే వారిపై రాళ్లవర్షం కురిపించారు. రాళ్లు బలంగా తగలటంతో టీడీపీ అభ్యర్థిని చాగంటి కమలమ్మ కుమారుడు, సొసైటీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, పునుగోటి రామాంజనేయులు, నెలకుర్తి అంజయ్యలకు గాయాలయ్యాయి. రాజేంద్రప్రసాద్, రామాంజనేయులను స్థానికులు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రాజేంద్ర ప్రసాద్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో గుంటూరు వైద్యశాలకు తరలించారు.