నిరసనల హోరు...

ABN , First Publish Date - 2020-12-03T05:52:22+05:30 IST

సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వ ఆంక్షలు దారుణంగా ఉన్నాయని సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యుడు కేవీ రమణ అన్నారు.

నిరసనల హోరు...
పథకాల అమలులో నిబంధనలపై జంగారెడ్డిగూడెంలో నిరసన

జంగారెడ్డిగూడెం, డిసెంబరు 2: సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వ ఆంక్షలు దారుణంగా ఉన్నాయని సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యుడు కేవీ రమణ అన్నారు. ఫోన్‌కు  ఓటీపీ వస్తేనే రేషన్‌ సరుకులు, ఇతర సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించడం వల్ల ఆధార్‌కి ఫోన్‌ నెంబరు అనుసంధానం చేయడానికి వృద్ధులు, వికలాంగులు ఎంతో మంది పోస్టాఫీసు వద్ద పడిగాపులు పడుతూ స్పృహ తప్పి పడిపోతున్నారని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం పోస్టాఫీసు వద్ద నిరసన తెలిపారు. ఐఎఫ్‌టీయూ పట్టణ కార్యదర్శి బుడితి కృష్ణ,  న్యూడెమోక్రసీ నాయకుడు రాఘవ తదితరులు పాల్గొన్నారు. 


ప్రజలపై భారం మోపవద్దు

జంగారెడ్డిగూడెం టౌన్‌: పట్టణ ప్రజలపై పన్నుల భారాన్ని పెంచే మున్సిపల్‌ బిల్లును వెనక్కి తీసుకోవాలని  సీపీఎం  మండల కార్యదర్శి ఎం.జీవరత్నం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ పార్టీ కార్యాలయం వద్ద  నిరసన తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం మున్సిపల్‌ చట్టాలను సవరిస్తూ జీవో జారీచేయడానికి  చూస్తోందని దీనిద్వారా పట్టణంలో ఇంటిపన్నులు  పెరుగుతాయని, తక్షణమే  మున్సిపల్‌ చట్టసవరణ బిల్లును వెనక్కి తీసుకోకుంటే పోరాటాలు చేస్తామని  హెచ్చరించారు.  


పెంచిన గ్యాస్‌ ధర తగ్గించాలి

కామవరపుకోట: గ్యాస్‌ ధర పెంపు అన్యాయమని సీపీఐ కామవరపు కోట మండల కార్యదర్శి  టీవీఎస్‌ రాజు అన్నారు.  కోవిడ్‌ –19 నేపథ్యంలో ప్రజలంతా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సిలిండర్‌కు రూ. 50 పెంచడం దారుణమన్నారు. వెంటనే పెంచిన  ధర తగ్గించక పోతే పోరాడవలసి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఢిల్లీలో రైతుల ఆందోళనలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు  ఆయన ప్రకటించారు.

గోపాలపురం: పంట నష్టం నమోదులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ చిట్యాలకు  చెందిన కొందరు రైతులు బుధవారం సచివాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో  మాట్లాడుతూ   జాబితాలో తమ పేర్లు చూపిస్తున్నప్పటికి నష్ట పరిహారం ఎందుకు రాలేదని ప్రశ్నించారు.  విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.  


కర్నూలులో అర్చకుడిపై దాడికి నిరసన

చింతలపూడి, డిసెంబరు 2: కర్నూలు జిల్లాలో ఓంకారేశ్వర ఆలయం అర్చకుడిపై ఆలయ కమిటీ చైౖర్మన్‌ దాడిచేయడంపై స్థానికంగా వున్న పలు ఆలయాల అర్చకులు బుధవారం నిరసన తెలిపారు.   ఓంకారేశ్వరాలయంలో అర్చకుడిపై కమిటీ చైౖర్మన్‌ చేయిచేసుకోవడం తగదన్నారు. స్థానికంగా ఉన్న వెంకటేశ్వరాలయం, కోదండ రామాలయం, సీతారామాంజనేయాలయానికి చెందిన అర్చకులు నిరసన తెలిపారు. నిరసనలో కేశవభట్ల శ్రీనివాస్‌, శ్రీధరాచార్యులు, పార్థసారథాచార్యులు పాల్గొన్నారు. 




Updated Date - 2020-12-03T05:52:22+05:30 IST