సెల్‌ కంపెనీ మహిళా ఉద్యోగులు అదృశ్యమైనట్టు వదంతులు!

ABN , First Publish Date - 2021-12-19T14:32:58+05:30 IST

నగర శివారు ప్రాంతమైన శ్రీపెరుంబుదూరులో ఒక సెల్‌ఫోన్‌ విడిభాగాల తయారు చేసే కంపెనీ క్యాంటీన్‌లో నాసిరకమైన ఆహారం తిన్న ఎనిమిదిమంది మహిళా ఉద్యోగులు అదృశ్యమైనట్టు వదంతులు

సెల్‌ కంపెనీ మహిళా ఉద్యోగులు అదృశ్యమైనట్టు వదంతులు!

- ధర్నాలతో దద్దరిల్లిన శ్రీపెరుంబుదూరు

- స్తంభించిన ట్రాఫిక్‌


అడయార్‌(చెన్నై): నగర శివారు ప్రాంతమైన శ్రీపెరుంబుదూరులో ఒక సెల్‌ఫోన్‌ విడిభాగాల తయారు చేసే కంపెనీ క్యాంటీన్‌లో నాసిరకమైన ఆహారం తిన్న ఎనిమిదిమంది మహిళా ఉద్యోగులు అదృశ్యమైనట్టు వదంతులు వ్యాపించడంతో ఆ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు ఐదుచోట్ల రాత్రంతా ధర్నాలు, రాస్లారోకోలు నిర్వహించారు. ఆ క్యాంటీన్‌లో నాణ్యమైన ఆహారం అందించాలని కోరుతూ ఆ కంపెనీలో పనిచేసే కార్మికులు రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగారు. దీంతో చెన్నై - బెంగుళూరు జాతీయ రహదారిలో వాహనరాకపోకలు కొన్ని గంటలపాటు స్తంభించిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ ఆరతి ధర్నా ప్రాంతానికి చేరుకుని, కార్మికులతో చర్చలు జరిపి ఆందోళన విరమించేలా చర్యలు తీసుకున్నారు. ఈ కంపెనీలో పనిచేసే ఐదు వేల మంది కార్మికుల్లో దాదాపు 150 మంది శుక్రవారం ఇక్కడి క్యాంటీన్‌లో తయారు చేసే ఆహారాన్ని ఆరగించి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం వివిధ ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఎనిమిదిమంది మహిళా ఉద్యోగులు ఉన్నట్టుండి మాయమయ్యారు. క్యాంటీన్‌లో నాసిరకం ఆహారం తినటం వల్ల వారు ప్రాణాలు కోల్పోయి ఉంటారని ఉద్యోగులు, కార్మికులంతా ఆందోళన చెందారు. అదృశ్యమైన ఎనిమిదిమంది విద్యార్థుల ఆచూకీ కనుగొనాలని, క్యాంటీన్‌లో నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ  కంపెనీలో పనిచేసే కార్మికులంతా ఏకమై చెన్నై - బెంగుళూరు జాతీయ రహదారిలో సుంకువర్‌సత్రం ప్రాంతంలో ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న కాంచీపురం కలెక్టర్‌ ఆర్తి అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో చర్చించి ధర్నా విరమించుకునేలా చేశారు. మాయమైనట్టు భావించిన మహిళా ఉద్యోగులు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారని ఆందోళనకారులకు జిల్లా కలెక్టర్‌ తెలుపటంతో వారు శాంతించారు. అంతేకాకుండా ఆ మహిళా ఉద్యోగులకు వీడియోకాల్‌ చేసి వారితో మాట్లాడించారు. దీనితో అందరూ ఆందోళనను విరమించారు. ఆ తర్వాత ఈ జాతీయ రహదారిపై వాహనరాకపోకలను పోలీసులు పునరుద్ధరించారు. 

Updated Date - 2021-12-19T14:32:58+05:30 IST