పక్షులకు మేతవేసి బోట్‌మెన్‌ను కష్టాల్లో పడేసిన శిఖర్ ధవన్

ABN , First Publish Date - 2021-01-25T01:55:33+05:30 IST

పక్షులకు మేతవేసిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధవన్..

పక్షులకు మేతవేసి బోట్‌మెన్‌ను కష్టాల్లో పడేసిన శిఖర్ ధవన్

వారణాసి: పక్షులకు మేతవేసిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధవన్.. బోట్‌మెన్‌ను కష్టాల్లో పడేశాడు. వారణాసిలో బోటింగుకు వెళ్లిన ధవన్ పక్షులకు మేత వేశాడు.  అక్కడితో ఆగకుండా ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఇవి కాస్తా అధికారుల కళ్లలో పడ్డాయి. దీంతో బోట్‌మెన్‌పై చర్యలకు అధికారులకు సిద్ధమయ్యారు. బర్డ్‌ ఫ్లూ నేపథ్యంలో పక్షులకు మేత వేయడంపై నిషేధం ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా పర్యాటకులను అనుమతించడంతోపాటు పక్షులకు మేత వేసేందుకు అనుమతించినందుకు బోట్‌మెన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని వారణాసి కలెక్టర్ కౌశల్ రాజ్ శర్మ హెచ్చరించారు.


పక్షులకు మేత వేస్తున్న ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన ధవన్ ‘‘పక్షులకు మేత వేయడం ఆనందంగా ఉంది’’ అని క్యాప్షన్ తగిలించాడు. ఈ ఫొటోలు వైరల్ కావడంతో స్పందించిన కలెక్టర్ శర్మ.. పర్యాటకులను అనుమతించిన బోట్‌మెన్‌పైనే చర్యలు తీసుకుంటామని, పర్యాటకులపై కాదని చెప్పడంతో ధవన్‌కు ముప్పు తప్పినట్టే.  బోట్‌మెన్ ఎవరూ ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడం లేదన్న సమాచారం తమకు అందిందని, ఇలాంటి విషయాలపై పర్యాటకులకు అంతగా అవగాహన ఉండదని కలెక్టర్ అన్నారు.  


ఈ నెల 21 నాటికి దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలకు బర్డ్‌ఫ్లూ విస్తరించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఆరు రాష్ట్రాల్లో పౌల్ట్రీ కోళ్లలోను, మిగతా పది రాష్ట్రాల్లో ఇతర పక్షల్లోనూ ఈ వ్యాధి వ్యాపించినట్టు పేర్కొంది. 

Updated Date - 2021-01-25T01:55:33+05:30 IST