మధుమేహానికి విరుగుడు దొండకాయల కూర

Nov 27 2021 @ 00:00AM

దొండ మొక్కని మధుమేహ నివారిణిగా ఆధునిక వైద్యశాస్త్రం ఇప్పుడు గుర్తిస్తోంది. ఎలుకల పైన పరిశోధనలు విజయవంతం అయ్యాయి. దొండకాయలు, ఆకులు, పూలు, వేర్లు కూడా షుగరు వ్యాధిమీద పనిచేస్తాయని నిర్ధారణ అయ్యింది. ‘బింబీ బుద్ధినాశినీ’ అనే ప్రచారం బాగా జరగటంతో ఇది బుద్ధిమాంద్యం కూర అని దొండకాయల్ని తినటానికి చాలామంది భయపడ్తుంటారు. నిజానికి ఇది వాతాన్ని హరిస్తుంది కాబట్టి, మెదడుని శక్తిసంపన్నం చేస్తుంది. అన్ని వ్యాధుల్లోనూ తినదగిన ఔషధాహార ద్రవ్యం.


ఎర్రని పెదిమల్ని దొండపండు రంగుతో పోలుస్తారు. లాటిన్‌ భాషలో ’కొక్కీనియా‘ అంటే ఎర్రనిరంగు. ఎర్రని పండ్లు కాస్తుంది కాబట్టి దీన్ని ‘కొక్కీనియా ఇండిక’ అని పిలిచారు. భారత దేశంలో దొరికే దొండని కొక్కీనియా గ్రాండిస్‌ అంటారు. బెండకాయల్ని దొరసాని వేళ్లు (లేడీ ఫింగర్స్‌) అన్నట్టే, దొండకాయని ‘పెద్ద’మనిషి కాలివేళ్లు (జెంటిల్‌మెన్‌ టోస్‌) అంటారు. 


దొండ దక్షిణాదివారి పంట. తీగదొండ, ఆరుదొండ(ఆదొండ), లింగదొండ, కాకిదొండ, కైదొండ, బ్రహ్మదొండ, కుంకుమ దొండ, ఇలా అనేక రకాల దొండలున్నాయి. వీటిలో మనం కూరల కోసం వాడుకునేది తీగదొండ. ఈ దొండని తమిళంలో తొంతై, కోవై అనీ, కన్నడంలో తొందె, తొంది, దొంది అని పిలుస్తారు. సంస్కృతంలో తుండిక అయ్యింది. ఉత్తరాదివారు కుందురు అని పిలుస్తారు. 


మౌలికంగా ఇది ఉష్ణమండలంలో పెరిగే మొక్క. సహజంగానే ఉష్ణప్రాంతాల్లో పెరిగే మొక్కలకు వాత, పిత్త దోషాలను పోగొట్టే గుణం ఎక్కువగా ఉంటుంది. లేత దొండకాయలు షుగరువ్యాధి, స్థూలకాయం, లివర్‌ వ్యాధులు, దగ్గు, ఆయాసం, క్షయ, రక్తహీనతల పైన పనిచేస్తాయి. కడుపులో ఏలికపాముల్ని పోగొడతాయి. తల్లిపాలు పెరిగేలా చేస్తాయి. దప్పిక తీరుతుంది. జ్వరాన్ని తగ్గిస్తాయి. కడుపులోనూ, అరికాళ్లు, అరిచేతుల్లోనూ మంటగా ఉండటాన్ని తగ్గిస్తాయి. రక్తస్రావాన్ని ఆపుతాయని సుశ్రుత సంహిత పేర్కొంది. లైంగిక శక్తిని పెంపుచేసే గుణం దీనికుందని, విరేచనాన్ని బంధిస్తుందని కయ్యదేవ నిఘంటువు పేర్కొంది. కొవ్వు పేరుకోకుండా చేస్తుంది. కొద్దిగా చేదు రుచి కలిగి ఉంటుంది. కుకుర్బిటాసిన్స్‌ అనే రసాయనాలు ఈ చిరుచేదుకు కారణం. ఇవే షుగరువ్యాధి పైన పనిచేస్తాయంటున్నారు. విషదోషాల్ని కూడా పోగొడుతుంది.


దొండకాయల కూరని తయారు చేసుకునే విధానాన్ని నలుడు ఇలా వివరించాడు  

బాగా లేతగా ఉండే దొండకాయల్ని ప్రయత్నించి సంపాదించండి. రెండు నిలువు పక్షాలుగా తరిగి, ఉప్పు, పసుపు వేసిన నీళ్లలో ఉడికించండి. ఓ భాండీలో కొద్దిగా నెయ్యి, ఇంగువ వేసి ఉడికించిన వాటిని దోరగా వేయించండి. మీకు ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు చేర్చి ముద్దగా దగ్గరకొచ్చేలా  వేగనిచ్చి, పొయ్యి మీంచి దించండి. చల్లారిన తరువాత చాలా స్వల్పంగా పచ్చకర్పూరం వేసి కలియబెడితే  పరిమళ భరితంగా ఉంటుంది. లైంగికశక్తిని పెంచుతుంది. కళ్ళకు మంచిది. మూత్రం ఫ్రీగా అయ్యేలా చేస్తుంది. పురుషుల్లో జీవకణాలను పెంచుతుంది. కామెర్ల వ్యాధిలో కూడా తినదగినది. బీపీని తగ్గిస్తుంది. క్షయవ్యాధి వచ్చినవారికి ఈ దొండకాయల కూర దగ్గు, ఆయాసాలను అదుపు చేస్తుంది. జీర్ణకోశ వ్యాధుల్లో పనిచేస్తుంది. వాత పైత్యాల్ని తగ్గిస్తుందని నలుడు పేర్కొన్నాడు. మసాలాలు చింతపండు అతిగా వేస్తే వాతం, పైత్యం పెరుగుతాయి. పండిన దొండకాయలు పుల్లగా ఉండి పైత్యం చేస్తాయి. లేతవే తిన దగినవి.  


కాయలకన్నా దొండ ఆకుల్లో శక్తివంతమైన రసాయనాలున్నాయి. షుగరు వ్యాధితో బాధపడేవారు  దొండ ఆకుల్ని కూడా కూరగానో పచ్చడిగానో చేసుకుని తింటే మంచిది. నీళ్లలో ఉప్పు వేసి ఉడికించి, ఇంగువ చేర్చిన నేతితో వేయించి కూర లేదా పచ్చడి చేసుకోవచ్చు. ఏయే సుగంధ ద్రవ్యాలు ఎంతెంత చేర్చి వండుకోవాలో నలుడు మన యుక్తికి వదిలేశాడు. ఏ ప్రయోజనం కోసం వండుకుంటున్నామో ఆ ప్రయోజనాన్ని పెంచే సుగంధ ద్రవ్యాలను తగినంత చేర్చటం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. 


మనిషికి ప్రకృతి ఇచ్చిన సర్వరోగ నివారక ఔషధాహారాల్లో దొండకాయ ఒకటి. దీని మధుమేహ నివారక గుణం ఇప్పుడు శాస్త్రవేత్తల్ని ఆకర్షించింది. దొండకాయలను కూరగానూ, పచ్చడిగానూ, పప్పు లేదా కూటుగానూ వండుకోవచ్చు. ‘ఆరోగ్యానికి అండ దొండ’ అనేది కొత్త నినాదం.


 గంగరాజు అరుణాదేవి

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.