18 మందికి అస్వస్థత జూ అప్రమత్తమైన వైద్యాధికారులు
పట్టణంలో వైద్య శిబిరం
పామర్రు, మార్చి 27 : పామర్రు 19వ వార్డులోని బాపూజీపేటలో 18 మంది అతిసార లక్షణాలతో బాధపడుతున్నట్టు వైద్యాధికారులు గుర్తించారు. వెంటనే వార్డులో సర్వే నిర్వహించారు. మొత్తం 18 మందిలో అతిసార లక్షణాలను గుర్తించామని, బాధితులకు ఇళ్ల వద్దనే చికిత్స అందిస్తున్నామని వైద్యాధికారిణి పి.సుధారాణి తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా వార్డులో ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. పరిస్థితి అదుపులోనే ఉన్నదని చెప్పారు.
పైపుల లీకేజీయే కారణమా?
తాగునీటి పైప్‌ల లీకేజీ కారణంగానే అతిసార ప్రబలిందని స్థానికులు ఆరోపించడంతో కుళాయిల నుంచి నీటిని సేకరించి ల్యాబ్‌కు పంపామని, నివేదిక రావలసి ఉందని సుధారాణి చెప్పారు. గ్రామంలో పారిశుధ్యం కూడా అధ్వానంగా తయారయింది. పందులు, దోమలు స్వైర్య విహారం చేస్తున్నాయి. దీనిపై పంచాయతీ అధికారులు తక్షణం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.