పంచాయతీ ఎన్నికలకు అధికారులు సహకరిస్తారా?

ABN , First Publish Date - 2021-01-24T06:07:59+05:30 IST

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌పై నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) పంచాయతీ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పంచాయతీ ఎన్నికలకు అధికారులు సహకరిస్తారా?

  1. స్థానిక ఎన్నికలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌
  2. ఫిబ్రవరి 5న తొలి విడత ఎన్నికలు
  3. జిల్లా అధికారుల సహాయ నిరాకరణ
  4. వీడియో కాన్ఫరెన్స్‌కు డుమ్మా
  5. కలెక్టర్‌ మూడు రోజుల సెలవు


కర్నూలు (ఆంధ్రజ్యోతి):  పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌పై నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) పంచాయతీ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను వాయిదా కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించినా, ఎన్నికలు కమిషన్‌ వెనక్కి తగ్గలేదు. మొదటి దశ ఎన్నికలు ఫిబ్రవరి 5వ తేదీ జరగనున్నాయి. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 28న నామినేషన్లను పరిశీలిస్తారు. 31న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. మిగిలిన మూడు దశల ఎన్నికలు ఫిబ్రవరి 9, 13, 17 తేదీల్లో నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్‌ తెలిపింది. 


అధికారులు సహకరించరా..?

పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసినా అధికారులు సహకరించేలా కనిపించడం లేదు. నోటిఫికేషన్‌ శనివారం విడుదల చేస్తామని, ఎన్నికల విధుల గురించి కలెక్టర్‌, ఎస్పీ సహా ముఖ్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ఉంటుందని ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది, కానీ కమిషన్‌ ఆదేశాలను జిల్లా అధికారులు పట్టించుకోలేదు. కలెక్టర్‌ జి. వీరపాండియన్‌ మూడు రోజుల సెలవుపై వెళ్లారు. మధ్యాహ్నం మూడు గంటలకు మొదలైన వీడియో కాన్ఫరెన్స్‌కు అధికారులు ఎవరూ హాజరు కాలేదు. శాశ్వత భూ హక్కు, రీ సర్వే పథకంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌కు వారు హాజరయ్యారు. 


రిజర్వేషన్లు

జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీలకు గత సంవత్సరం ఎన్నికల నోటిఫికేషన్‌ సమయంలో రిజర్వేషన్లు ఖరారు చేసి కలెక్టర్‌ అనుమతి తీసుకున్నారు. వాటిలో ఎలాంటి మార్పు లేదని పంచాయతీ అధికారులు తెలిపారు. మొత్తం 973 పంచాయతీలకు గాను సున్నిపెంట మినహా అన్నింటికీ రిజరేషన్ల ప్రక్రియ పూర్తయింది. సర్పంచు స్థానాలు మొత్తం 972 ఉన్నాయి. అందులో తండాలు 20 (జనరల్‌ 5, మహిళలు 15), ఎస్టీ 15 (అన్నీ మహిళలే), ఎస్సీ 191 (జనరల్‌ 95, మహిళలు 96), బీసీ 256 (జనరల్‌ 130, మహిళలు 126), అన్‌ రిజర్వుడు 490 (జనరల్‌ 246, మహిళలు 244) స్థానాలను కేటాయించారు.


నాలుగు విడతల్లో..

రెవెన్యూ డివిజన్ల వారీగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఈ ప్రకారం కర్నూలు, నంద్యాల, ఆదోని రెవెన్యూ డివిజన్లలో వేర్వేరు తేదీల్లో ఎన్నికలు ఉంటాయి. మొదటి దశ ఫిబ్రవరి 5న ఆదోని రెవెన్యూ డివిజన్‌లోని 14 మండలాల్లోని 292 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో దశలో ఫిబ్రవరి 9న కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్లలోని 12 మండలాల్లోని 193 పంచాయతీలకు, మూడో దశలో ఫిబ్రవరి 13న కర్నూలు, నంద్యాల డివిజన్లలోని మరో 13 మండలాల్లోని 240 పంచాయతీలకు, నాలుగో దశలో ఫిబ్రవరి 17న కర్నూలు, ఆదోని డివిజన్లలోని 14 మండలాల్లోని 245 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా 973 పంచాయతీలుండగా 970 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీల పరిధిలో పురుష ఓటర్లు 10,55,362 మంది, మహిళా ఓటర్లు 10,59,636 మంది, ఇతరులు 249 మంది ఉన్నారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ సమయంలో ఆర్వోలను, ఏఆర్వోలను నియమించామని, వారికి శిక్షణ కూడా అపుడే ఇచ్చామని, మరొకసాకి శిక్షణ ఇస్తే సరిపోతుందని పంచాయతీ అధికారులు అంటున్నారు.


సెలవులో కలెక్టర్‌ 

అనారోగ్య కారణాలతో కలెక్టర్‌ జి వీరపాండియన్‌ ఈ నెల 25 వరకు సెలవు పెట్టారని అధికారులు తెలిపారు. అంతవరకు జేసీ రాంసుందర్‌రెడ్డి ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తారు. కలెక్టర్‌ సెలవుపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలోనే ఆయన సెలవు పెట్టారన్న చర్చ జరుగుతోంది. ఆయన స్థానంలో విధులు నిర్వహిస్తున్న ఇన్‌చార్జి కలెక్టర్‌ కూడా ఎన్నికల కమిషన్‌ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కాకపోవడం గమనార్హం. 

Updated Date - 2021-01-24T06:07:59+05:30 IST