ఈ మార్పు సహజంగానే జరిగిందా?

ABN , First Publish Date - 2021-06-30T06:47:56+05:30 IST

దేశరాజకీయాల్లో బలమైన ప్రతిపక్షం లేకపోవడం, తనను ఎదుర్కోగల ఒక శక్తిమంతమైన నేత కానీ, పార్టీ కానీ కనపడకపోవడం వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు ప్రతికూలంగా ఉన్న వాతావరణాన్ని...

ఈ మార్పు సహజంగానే జరిగిందా?

దేశరాజకీయాల్లో బలమైన ప్రతిపక్షం లేకపోవడం, తనను ఎదుర్కోగల ఒక శక్తిమంతమైన నేత కానీ, పార్టీ కానీ కనపడకపోవడం వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు ప్రతికూలంగా ఉన్న వాతావరణాన్ని కూడా అనుకూలంగా మలుచుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అత్యంత బలహీనంగా ఉన్న ప్రతిపక్షాల విమర్శలను బట్టి తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఆయనకు ఎంత మాత్రమూ లేదు. అయితే తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే సౌలభ్యం కూడా మోదీకి లేదు. ప్రతిపక్షాలు లేవు కదా అని తమను విమర్శించే వారిని అణిచి వేయడం, వారిని దేశ వ్యతిరేకులుగా చిత్రించడం ఎల్లవేళలా సాధ్యం కాదు. ఎందుకంటే ఇవాళ ప్రతిపక్షాలు ఉన్నా, లేకపోయినా తమ అభిప్రాయాలను బలంగా చెప్పగల అవకాశాలు, వేదికలు ప్రజలకు, విమర్శకులకు లభ్యమవుతున్నాయి. అంతకంటే ముఖ్యంగా మొత్తం ప్రపంచం భారత దేశంలో ప్రతి కదలికనూ గమనిస్తోంది. నా దేశంలో ప్రజల పట్ల నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తానని చెప్పుకోవడానికి ఆస్కారం లేదు. ప్రపంచ దేశాలతో ఆర్థిక, దౌత్యపరమైన, రక్షణ పరమైన సంబంధాలు నెలకొల్పాలనుకునేవారు ఆయా దేశాలు కూడా మన దేశంలో జరుగుతున్న పరిణామాలను ప్రశ్నిస్తాయని ఎప్పటికైనా గ్రహించక తప్పదు.


బహుశా అందుకే మోదీ తనకు ప్రతికూలంగా ఉన్న వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు తప్పనిసరై చర్యల్ని ప్రారంభించారని అర్థం చేసుకోవచ్చు. కరోనా రెండో ప్రభంజనం మూలంగా తలెత్తిన తీవ్రవిమర్శలు, దాని రాజకీయ పర్యవసానాలు మాత్రమే కాదు, అంతర్జాతీయంగా తలెత్తిన పరిణామాలు కూడా ఆయన వైఖరికి కారణం అయి ఉంటాయి. ఈ దేశంలో న్యాయవ్యవస్థ ఉన్నట్లుండి గతంలో ఎన్నడూ లేనంతగా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్లు కనపడడం కూడా యాదృచ్ఛికంగా జరిగిన పరిణామం కాదు. వాక్సిన్ విధానాన్ని ప్రశ్నించడం, జర్నలిస్టు వినోద్ దువాపై కేసును కొట్టివేయడంతో పాటు కొందరు మానవహక్కుల కార్యకర్తల్ని విడుదల చేసే విషయంలో కోర్టులు రాజ్యాంగ ఉల్లంఘనలను ప్రస్తావించి తీవ్రంగా వ్యాఖ్యానించడం, అనేక సందర్భాల్లో ప్రభుత్వం బోనులో నిలబడాల్సి రావడం గత కొద్ది రోజుల్లోనే కనపడుతున్న ఆరోగ్యకరమైన పరిణామాలు. ఎమర్జెన్సీ చీకటి దినాలను గుర్తు చేసుకుంటూ భారత దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు, రాజ్యాంగంలో చెప్పిన విలువలను పరిరక్షించేందుకు సాధ్యమైనంత కృషి చేద్దామని ఇటీవల పిలుపు నిచ్చిన మోదీకి న్యాయస్థానాలు రాజ్యాంగ ఉల్లంఘన గురించి గుర్తు చేశాయంటే ఏమనుకోవాలి? న్యాయస్థానాలు కూడా బయటి ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను గమనించకపోతే తమ అస్తిత్వాన్ని తాము నిలబెట్టుకునే ప్రయత్నం చేయవు. 


జమ్ము, కశ్మీర్‌పై వివిధ రాజకీయ పార్టీలతో గత వారం చర్చలు నిర్వహించడం కూడా ఈ మారిన పరిణామంలో భాగం గానే జరిగిందనిపిస్తోంది. 2019లో జమ్మ–కశ్మీర్‌లో అసెంబ్లీని రద్దు చేశారు. ఆ రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని కూడా రద్దు చేశారు. ఆ సరిహద్దు రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఇందుకు నిరసన తెలిపిన అనేకమంది ప్రతిపక్ష నేతలను సుదీర్ఘకాలంపాటు నిర్బంధించారు. ఇంత జరిగిన తర్వాత, ఆ రాష్ట్రంలో సమీప భవిష్యత్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుగుతుందని ఎవరూ భావించలేదు. కనీసం ఇంటర్నెట్ పునరుద్ధరించడానికి కూడా ప్రభుత్వం గత ఏడాది అంతగా ఇష్టపడలేదు. మరి ఇప్పుడు ఆ వైఖరి ఎందుకు మారింది? కొద్ది రోజుల క్రితం గుప్కార్ ముఠాగా హోంమంత్రి అమిత్ షా, దోపిడీ ముఠాగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అభివర్ణించిన శక్తులనే చర్చకు ఎందుకు ఆహ్వానించాల్సి వచ్చింది? ‘కశ్మీర్ విషయంలో నేను ఎవరితో చర్చించేందుకు సిద్ధంగా లేను’ అని గత ఏడాది ప్రకటించిన నరేంద్రమోదీ ఈ సమావేశంలో అందరితో నవ్వుతూ, స్నేహపూర్వకంగా మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏమిటి? ‘ఈ సమావేశానికి ఎజెండా ఏమిట’ని ఒక కశ్మీరీ నాయకుడు అడిగినప్పుడు ‘మనం మనసువిప్పి స్వేచ్ఛగా ఏ విషయమైనా మాట్లాడుకునేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశాము’ అని మోదీ అంటారని ఎవరు ఊహించగలరు?


ఈ మార్పుకు అనేక కారణాలు ఉండవచ్చు. ప్రజాస్వామిక విలువలకు, స్వేచ్ఛా సమాజాలకు కట్టుబడి ఉండాలని తీర్మానం చేసిన జీ–7 నేతల సమావేశంలో పాల్గొన్న మోదీ ప్రపంచ దేశాలకు భారత్ పట్ల ఏర్పడుతున్న అభిప్రాయాలను అర్థం చేసుకోలేనంత అమాయకుడు కాదు. భారత దేశంలో కొన్ని పరిణామాలు ప్రజాస్వామిక విలువలకు అనుగుణంగా లేవన్న వ్యాఖ్యలు అమెరికాలో ప్రభుత్వం మారిన తర్వాత ఆ దేశ విదేశాంగ శాఖే చేసింది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉన్న భారత దేశంతో తాము వ్యూహాత్మక సంబంధాలు ఏర్పర్చుకోవాలనుకుంటున్నామని, అయితే భారత ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు ప్రజాస్వామిక విలువలకు వ్యతిరేకంగా ఉన్నాయని, భావ ప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు, కొందరు మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టుల నిర్బంధం పెరిగిపోయాయని విదేశాంగ శాఖ సహాయమంత్రి థాంప్సన్ ఒక సమావేశంలో వ్యాఖ్యానించారు. కశ్మీర్‌లో సాధ్యమైనంత త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని తాము భావిస్తున్నామని, ఖైదీల విడుదల, 4జి పునరుద్ధరణతోపాటు ఎన్నికలు జరిపించి ప్రజాస్వామిక ప్రక్రియ పునరుద్ధరించాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. ఈ ప్రకటన చేసిన రెండు వారాల్లోనే జమ్ము, కశ్మీర్ నేతలను మోదీ చర్చలకు ఆహ్వానించడం గమనార్హం. కరోనా రెండో ప్రభంజనం తర్వాత భారత్ ప్రతిష్ఠను పునరుద్ధరించేందుకు అమెరికాతో పాటు పలు దేశాల్లో పర్యటించిన విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా భారత్ పట్ల ఆయాదేశాల అభిప్రాయం తెలుసుకుని మోదీకి నివేదించి ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలతో ఖ్వాడ్ పేరిట ఒక కూటమిని ఏర్పర్చుకుని ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అంతర్జాతీయ శాంతిని ఏర్పర్చుకోవాలని, చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న తరుణంలో, అంతర్జాతీయ అభిప్రాయాలకు భిన్నంగా వ్యవహరించడం సరైంది కాదని భారత దేశాధినేతలు గ్రహించి ఉండాలి. పైగా కరోనా అతలాకుతలం చేసిన పరిస్థితుల్లో, ఆర్థికవ్యవస్థ సంక్షోభానికి గురైన సమయంలో, సరిహద్దుల్లో చైనా చీకాకు సృష్టిస్తున్న తరుణంలో భారత్ ఏకాకిగా, తాము మిత్రదేశాలనుకునేవాటి అభిప్రాయాలకు భిన్నంగా వ్యవహరించడం ఏ మాత్రం సాధ్యం కాదు. ఆఫ్ఘానిస్తాన్‌లో అమెరికా సైన్యం ఉపసంహరణ అనంతరం తాలిబాన్ నుంచి తలెత్తే ముప్పును కూడా తక్కువ అంచనా వేయలేం. వీటన్నిటి నేపథ్యంలో కశ్మీర్ విషయంలో బయటి శక్తుల జోక్యం కూడదని మనం ఖరాఖండిగా ఎంత చెప్పినప్పటికీ జమ్ము, కశ్మీర్‌లో ప్రజాస్వామిక ప్రక్రియ ప్రారంభించాలనుకోవడం అంతర్జాతీయ అభిప్రాయానికి, ముఖ్యంగా అమెరికా ఆకాంక్షలకు అనుగుణంగానే జరిగిందని చెప్పక తప్పదు. వచ్చే సెప్టెంబర్‌లో మోదీ అమెరికా సందర్శించే ఘట్టానికి ముందు ఇది ఉపోద్ఘాతం అనే అనుకోవాలి. ట్రంప్ మాదిరే బైడెన్ కూడా తనకు వైట్ హౌస్‌లో అఖండ స్వాగతం పలకాలని మోదీ ఆశించడంలో తప్పేముంది? కశ్మీర్‌లో ప్రజాస్వామిక ప్రక్రియ ప్రారంభించిన ఘనత మాజీ ప్రధాని పి.వి. నరసింహారావుకు దక్కుతుంది. ఆయన కూడా అమెరికా వెళ్లి క్లింటన్‌ను కలిసేముందు అమెరికన్ కాంగ్రెస్ సమావేశంలో కశ్మీర్ గురించి ప్రస్తావించారు. ‘యుద్ధాగ్ని జ్వాలల్లో దెబ్బతిన్న శతాబ్దం ముగియబోతోంది. మనం ఇప్పుడు కత్తులను నాగళ్లుగా మార్చాలి.’ అని ఆయన అన్నారు. 1845లో టెక్సాస్ అమెరికన్ యూనియన్‌లో భాగం కావడం, అమెరికా సుప్రీంకోర్టు ఈ విలీనాన్ని సంపూర్ణమని, అంతిమమని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ కశ్మీర్ విషయంలో కూడా ఇదే వర్తిస్తుందని స్పష్టం చేశారు. కశ్మీర్ గురించి ఆయన చేసిన ప్రస్తావన అమెరికన్లకు తగిన సందేశం పంపింది. 2000 సంవత్సరంలో వాజపేయి అమెరికా పర్యటించి, జమ్మూ -కశ్మీర్‌లో పాక్ ఉగ్రవాదం గురించి అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించిన తర్వాతే ఆ దేశ వైఖరిలో కొంత మార్పు కనపడింది. వాజపేయి కూడా అమెరికా ఆకాంక్షలకు భిన్నంగా ఏమీ నడుచుకోలేదు.


అందువల్ల మన విదేశాంగ నీతి ఎప్పుడూ స్వతంత్రం కాదు. భారతీయ జనతాపార్టీ సైద్ధాంతిక భూమిక బలమైనదే కావచ్చు కాని ప్రజాస్వామిక సమాజాల్లో, విదేశీ సంబంధాల విషయంలో కరడు గట్టిన అభిప్రాయాలకు తావు లేదు. ప్రజాస్వామిక విలువలు, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాల విషయంలో కూడా సిద్ధాంతాలు పరిధుల్ని నిర్వచించలేవు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత విమర్శించిన ప్రతి ఒక్కరి దేశభక్తిని శంకించడం, వారిపై ఏదో ముద్రవేయడం సాధారణమైపోయింది. కనుక ఆధునిక సమాజాల్లో మారుతున్న ప్రజల భావాలకు, ముఖ్యంగా యువతరం ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలను మార్చుకోవడం ఒక చారిత్రక అవసరం.


కశ్మీర్ విషయంలో మోదీ ప్రభుత్వంలో వచ్చిన మార్పు వల్ల కశ్మీరీ ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది? ప్రజాస్వామిక ప్రక్రియ ప్రారంభించడం వల్ల అక్కడి ప్రజలను మన రాజకీయ పార్టీలు మెప్పించగలుగుతాయా? – అన్నది వేరే చర్చ. కాని భారత దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ ప్రత్యర్థులు, రైతులు, ఇతర అనేక వర్గాల పట్ల అవలంబించే వైఖరిలో కూడా మార్పు వస్తుందా అన్నది వేచి చూడాలి. ప్రభుత్వ పాలనలో, వ్యవస్థల పనితీరులో, పార్లమెంట్ చర్చల్లో, పార్టీ పనితీరులో అంతర్గత, బహిర్గత ప్రజాస్వామ్యం ఆరోగ్యకరంగా మారాలి. ప్రజాస్వామ్యం పట్ల ప్రేమాభిమానాలు ఆచరణలో హృదయపూర్వకంగా కనపడ్డప్పుడే అది ఫలవంతమవుతుంది. అది ఓట్లకోసమో, అంతర్జాతీయ సంబంధాల కోసమో కపట నటనగా మారకూడదు.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2021-06-30T06:47:56+05:30 IST