ప్రగతిబాట పట్టేనా..?

ABN , First Publish Date - 2022-05-14T04:24:37+05:30 IST

పల్లెల్లో ప్రజల సమస్యలు పరిష్కరించి, పారిశుధ్యం మెరుగు పర్చాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలుగా పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తోంది. పథకంలో భాగంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా అభివృద్ధి అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. పల్లెల్లో మౌలిక సదుపాయాలకు కూడా ప్రజలు నోచుకోని పరిస్థితి ఉంది. పల్లె ప్రగతి పనులు చేపట్టడంలో ప్రజల అవసరాలు పరిగణలోకి తీసుకోకుండా అక్కడి నాయకులకు నచ్చిన చోట, వారు సూచిస్తున్న పనులు చేపడుతుండటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.

ప్రగతిబాట పట్టేనా..?
తాండూరు మండల కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో గుంతలో చేరిన మురుగు నీరు

సమస్యలతో గ్రామాలు సతమతం

నిధులు కేటాయిస్తున్నా తీరు మారని వైనం

నామ్‌కే వాస్తేగా పల్లె ప్రగతి పనులు

ఈనెల 20 నుంచి జూన్‌ 5 వరకు ఐదో విడుత ప్రారంభం

మంచిర్యాల, మే 13 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో ప్రజల సమస్యలు పరిష్కరించి, పారిశుధ్యం మెరుగు పర్చాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలుగా పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తోంది. పథకంలో భాగంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా అభివృద్ధి అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. పల్లెల్లో మౌలిక సదుపాయాలకు కూడా ప్రజలు నోచుకోని పరిస్థితి ఉంది. పల్లె ప్రగతి పనులు చేపట్టడంలో ప్రజల అవసరాలు పరిగణలోకి తీసుకోకుండా అక్కడి నాయకులకు నచ్చిన చోట, వారు సూచిస్తున్న పనులు చేపడుతుండటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఈ క్రమంలో ఈ నెల 20 నుంచి జూన్‌ 5వ తేదీ వరకు ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై ఈ నెల 11న హైద్రాబాద్‌లో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్ని జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించి, సాధించాల్సిన లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో వాస్తవంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

ఐదో విడుత లక్ష్యాలు...

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో మెరుగైన జీవన ప్రమాణాలు, పరిశుభ్రత, పచ్చదనాన్ని పెంపొందించడం వంటి లక్ష్యాల సాధనకు కార్యాచరణ రూపొందించుకొని అమలు చేయాల్సిన బాధ్యత  అధికారులపై ఉంది. సాధించిన ప్రగతి నివేదికలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అప్‌లోడ్‌ చేసేందుకుగాను ఇప్పటికే డీపీవోలకు లాప్‌టాప్‌లు, డీఆర్‌డీవోలకు మొబైల్‌ ఫోన్ల పంపిణీ జరిగింది. పనులను పర్యవేక్షించేందుకు పల్లె ప్రగతి జరుగుతున్న రోజుల్లో కార్యదర్శులందరూ  ఉదయం 6 గంటలకు తప్పనిసరిగా గ్రామాల్లో ఉండాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. పల్లెల్లో చేపడుతున్న పనులను డీపీవోలు, డీఎల్‌పీవోలు, ఎంపీవోలు తనిఖీలు చేయడంతోపాటు సర్పంచులు, కార్యదర్శులకు డీపీవోలు మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుంది. కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని అన్ని ప్రభుత్వ సంస్థలు, పాఠశాలల్లో పారిశుధ్య పనులు  రోజూ నిర్వహించడంతోపాటు, తడిచెత్త నుంచి కంపోస్ట్‌ తయారు చేయాలి. వైకుంఠధామాలకు నీరు, విద్యుత్‌ సౌకర్యం కల్పించాలి. గ్రీన్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది.

పరిశుభ్రతకు ప్రాధాన్యం ఏదీ...?

పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తొలిసారిగా 2019 సెప్టెంబర్‌లో ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు విడుతలు పూర్తికాగా అవసరమైన నిదులను ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తోంది. 2019-20లో ఏడు నెలలకు గాను జనరల్‌ ఫండ్‌, ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు, టీఎస్టీ ఫండ్‌ నుంచి సుమారు రూ. 28 కోట్లు విడుదల కాగా 2020-21లో దాదాపు రూ.84 కోట్లు, 2021-22లో మరో రూ.84 కోట్ల మేర నిధులు విడుదలయ్యాయి. కార్యక్రమంలో ప్రధానంగా పారిశుధ్యానికి పెద్దపీట వేయాల్సి ఉంది. ఇందులో భాగంగా వర్షపు నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చోట డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టడం, ఎప్పటికప్పుడు డ్రైనేజీలను శుభ్రపరచడం, రోడ్ల పక్కన ఉన్న చెట్లకు ట్రీగార్డ్స్‌ ఏర్పాటు,  చెత్తకుప్పలు నిలువ ఉండకుండా చర్యలు చేపట్టడం, తదితర పనులు చేయాల్సి ఉంది.  అయితే అందుకు భిన్నంగా ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను పంచాయతీల్లో ఇతరత్రా పనులకు వెచ్చిస్తూ నామ్‌కే వాస్తేగా పనులు చేపడుతుండటంతో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

సమస్యలతో సతమతం...

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి ద్వారా పల్లెల్లో జరిగిన అభివృద్ది పెద్దగా ఏదీ లేదనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని అనేక గ్రామాల్లో ఇప్పటికీ డ్రైనేజీలు లేకపోవడం గమనార్హం. గ్రామాల్లో నెలకొన్న సమస్యలతో ప్రజలు నిత్యం సతమతం అవుతున్నారు. మౌలిక సౌకర్యాలు లేని గ్రామాలు మచ్చుకు కొన్ని.....

 జైపూర్‌ మండలం వెంకట్‌రావు పల్లెలో డ్రైనేజీలు లేక వర్షపు నీరంతా రోడ్లపై ప్రవహిస్తోంది. కరెంటు స్తంభాలు, సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

 నెన్నెల మండలం జోగాపూర్‌లో శ్మశాన వాటికకు నీటి సౌకర్యం కల్పించకపోవడంతో అది ఉపయోగంలోకి రాలేదు. 

 తాండూరు మండల కేంధ్రంలోని సుభద్ర కాలనీలో పల్లె ప్రగతి పనులు చేపట్టిన దాఖలాలే లేవు. ఇక్కడ 200 కుటుంబాలు ఉండగా డ్రైనేజీలు లేకపోవడంతో మురుగు నీరు వీధుల పక్కన గుంతల్లో చేరి అపరిశుభ్రంగా తయారైంది. 

 భీమారం మండలం దళితవాడలో రోడ్లకు ఇరువైపులా నాళాలు లేకపోవడం వల్ల మురుగు నీరు రోడ్లపైకి చేరుతోంది. 

 లక్షెట్టిపేట మండలం లక్ష్మీపూర్‌ గ్రామంలో డ్రైనేజీలు లేక మురికి నీరు రోడ్లపై నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 

 కన్నెపెల్లి మండలంలోని నాయకంపేట పంచాయతీ పరిధి కుర్మగూడలో ఇప్పటి వరకు ఒక్క పనికూడా చేపట్టిన దాఖలాలు లేవు. గ్రామంలో సీసీ రోడ్లు లేవు. డ్రైనేజీలు లేవు. దీంతో మురికి నీరంతా వీధుల్లో ప్రవహించి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.


Read more