Advertisement

ఆర్టీసీ ఆదాయానికి డీజిల్‌ బ్రేకులు

Jun 30 2020 @ 06:30AM

మెదక్‌ ఆర్టీసీ రీజియన్‌పై డీజిల్‌ ధరల ప్రభావం

సగటున రోజుకు రూ.2.20 లక్షల భారం

కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటికే పడిపోయిన ఆదాయం

ప్రభుత్వం నుంచే జీతాల చెల్లింపు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జూన్‌ 29 :  ఇప్పటికే కరోనా ప్రభావంతో ప్రయాణికులు రాక చాలీచాలని ఆదాయంతో నెట్టుకొస్తున్న ఆర్టీసీని రోజురోజుకు పెరుగుతున్న డీజిల్‌ ధర మరింత కుదేలు చేస్తున్నది. సగటున రోజుకు రూ.2.20 లక్షల అదనపు భారం ఆర్టీసీపై పడుతున్నది. 


డీజిల్‌ ధరల పెంపుతో అదనపు భారం

డీజిల్‌ ధరలు పెరుగుతుండడం ఆర్టీసీకి భారంగా మారుతున్నది. ఈ నెల ఒకటో తేదీన డీజిల్‌ ధరలు లీటరుకు రూ.67.82లు ఉండగా, ఈ నెల ఏడో తేదీ నాటికి రూ.68.03లు అయింది. ఇక అప్పటి నుంచి డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నెల 24వ తేదీన రూ.78.06లుగా ఉన్న లీటర్‌ డీజిల్‌ ధర ఈ నెల 29వ తేదీన రూ.78.90 పెరిగింది. 24వ తేదీన లీటరు డీజిల్‌ ధరపై రూ.10.24ల భారం పడగా, 29వ తేదీ వచ్చేసరికి రూ.11.08ల భారం పడింది. ఈ నెల 29వ తేదీన పెరిగిన డీజిల్‌ ధరలతో మెదక్‌ రీజియన్‌ ఆర్టీసీకి రూ.2.70లక్షల భారం పడగా, ఈ నెల ఏడో తేదీ నుంచి పెరుగుతున్న ధరలతో పోల్చితే సగటున రోజుకు రూ.2.20 లక్షల అదనపు భారాన్ని భరించాల్సి వస్తున్నదని ఆర్టీసీ అధికారవర్గాలు తెలిపాయి. మెదక్‌ రీజియన్‌లో పూర్తి స్థాయిలో బస్సులు తిరిగితే ఈ భారం మరింతగా పెరిగే అవకాశాలున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.


తగ్గిన ప్రయాణ దూరం

లాక్‌డౌన్‌కు ముందు మెదక్‌ రీజియన్‌లో ఆర్టీసీ బస్సులను రోజు 2.50 లక్షల కిలోమీటర్లను నడిపేది. ఆర్టీసీ మెదక్‌ రీజియన్‌లో మొత్తం 642 బస్సులు ఉండగా ఇందులో 357 బస్సులు ఆర్టీసీవి కాగా, 292 అద్దె బస్సులున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో లాక్‌డౌన్‌ విధించగా గత మార్చి 22 నుంచి మే 18వ తేదీ వరకు మెదక్‌ రీజియన్‌లో బస్సులు తిరగలేదు. లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం మే 19వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. అయినా కోవిడ్‌ నిబంధనల ప్రకారం ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు వినియోగించాలని ప్రభుత్వం పేర్కొన్నది. అంతేగాక ఆర్టీసీ బస్సుల్లో సగం సీట్లలోనే ప్రయాణికులు కూర్చునేలా ఏర్పాట్లు చేసింది.


ఫలితంగా ప్రయాణికుల సంఖ్య తగ్గింది. దీనికి తోడు గ్రామాలకు బస్సులు నడపకపోవడం, ప్రయాణించడానికి ప్రజలు భయపడడంతో ఆర్టీసీ ఆదాయం గణనీయంగా తగ్గింది. లాక్‌డౌన్‌కు ముందు 642 బస్సులు రోజుకు 2.50 లక్షల కిలోమీటర్లు తిరగగా, లాక్‌డౌన్‌ సడలించిన మే 19 నుంచి ఇప్పటి వరకు 530 బస్సులు రోజూ 1.50 లక్షల కిలోమీటర్లే తిరుగుతున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు తిరిగిన ఆర్టీసీ బస్సులకు రోజుకు 45 వేల లీటర్ల డీజిల్‌ అవసరం కాగా, ఇప్పుడు 27 వేల లీటర్ల డీజిల్‌ సరిపోతున్నది. 


పడిపోయిన ఆదాయం.. వేతనాలకు లోటు

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసీ ఆదాయం పడిపోయింది. లాక్‌డౌన్‌కు ముందు రోజుకు రూ.70 నుంచి రూ.75 లక్షల ఆదాయం వచ్చేది. నెలకు సుమారు రూ.22 కోట్ల ఆదాయం సమకూరేది. లాక్‌డౌన్‌ సడలింపులతో మే 19 నుంచి నడుస్తున్న బస్సులతో రోజుకు సుమారు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల రాబడి వస్తున్నది. నెలకు సుమారు రూ.8 కోట్ల నుంచి రూ.9 కోట్ల ఆదాయమే వస్తున్నది. అంటే లాక్‌డౌన్‌ ముందు, తర్వాత పరిశీలిస్తే ఆర్టీసీ ఆదాయం రూ.15 కోట్ల వరకు తగ్గింది. దాంతో ఆర్టీసీ ఉద్యోగుల జీతాల కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తున్నది. ఆర్టీసీ మెదక్‌ రీజియన్‌లో 2,600 మంది సిబ్బంది పని చేస్తున్నారు.


వీరిలో 2,300 మంది డ్రైవర్లు, కండక్టర్లు, ఇతరులు ఉండగా, మరో 300 మంది ఔట్‌సోర్సింగ్‌ ద్వారా పని చేస్తున్నారు. వారందరికీ జీతాల కోసం ప్రతి నెలా రూ.10 కోట్లు చెల్లించాల్సి వస్తున్నది. అయితే ప్రస్తుతం ఆర్టీసీకి నెలకు రూ.9 లక్షల వరకే వస్తున్న ఆదాయం డీజిల్‌కు, బస్సుల నిర్వహణ ఇతరత్రా ఖర్చులకే సరిపోతున్నదని ఆర్టీసీ అధికారవర్గాలు తెలిపాయి. దాంతో ఆర్టీసీ సిబ్బంది జీతాల కోసం ప్రతి నెలా అవసరమైన రూ.10 కోట్లను ప్రభుత్వమే విడుదల చేస్తున్నదని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Follow Us on:
Advertisement
Advertisement