డీజిల్‌ దడ

ABN , First Publish Date - 2021-10-03T06:54:33+05:30 IST

డీజిల్‌, పెట్రోలు ధరలు మండిపోతున్నాయి. మూడు రోజుల నుంచి రోజుకు 30పైసలు చొప్పున పెరుగుతున్నాయి.

డీజిల్‌ దడ

లీటరు రూ.100కు చేరువలో ధర

పెట్రోలు రూ.107.42

మూడు రోజులుగా పెరుగుతున్న ధరలు

ప్రజానీకంపై రోజుకు రూ.10లక్షలపైనే భారం

ఒంగోలు (కలెక్టరేట్‌), అక్టోబరు 2: డీజిల్‌, పెట్రోలు ధరలు మండిపోతున్నాయి. మూడు రోజుల నుంచి రోజుకు 30పైసలు చొప్పున పెరుగుతున్నాయి. ప్రస్తుతం డీజల్‌ రూ.100కు చేరువలో ఉండగా, పెట్రోల్‌ ధర మాత్రం 107.42కు చేరింది. నెల రోజులుగా నిలకడగా ఉన్న పెట్రో ధరలు మూడు రోజుల నుంచి మళ్లీ పెరుగుతుండటంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. రోజుకు జిల్లాలో 20 లక్షల లీటర్ల వరకు డీజిల్‌, 8 లక్షల లీటర్ల వరకు పెట్రోల్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. వాటి ధరల పెరుగుదలతో ప్రజానీకంపై రోజుకు రూ.10లక్షల చొప్పున నెలకు రూ.3 కోట్ల భారం పడుతోంది. జిల్లాలో 400 వరకు పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. జిల్లాలో లీటర్‌ డీజిల్‌ ధర శుక్రవారం 98.08 పైసలు  ఉండగా, శనివారం రూ.99.39కు చేరింది. లీటర్‌ పెట్రోల్‌ ధర శుక్రవారం రూ.107.17 ఉండగా శనివారం రూ.107.42కు పెరిగింది. 

అన్ని రంగాలపై భారం...

డీజిల్‌, పెట్రోలు ధరల పెరుగుదలతో అన్నిరంగాలపై ఆ భారం పడింది. ప్రధానంగా నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇతర ప్రాంతాల నుంచి సరుకుల రవాణా చార్జీలు పెరుగుతాయి. దీంతో ధరలు మండుతాయి. ఇప్పటికే ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజానీకం ఏమీ కొనలేని పరిస్థితి ఉంది. నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలు, పండ్లు వంటి వాటిపై ధరల ప్రభావం పడనుంది. జిల్లాలో సుమారు 29వేలకుపైగా వాహనాలు ఉండగా అందులో ఐదారు వేల ట్రాన్స్‌పోర్టు వాహనాలు. మరో 10వేలకుపైగా నాన్‌ ట్రాన్స్‌పోర్టు వాహనాలు నడుస్తున్నాయి. బైక్‌లు కూడా 10లక్షలకుపైగా ఉన్నాయి. ఇవికాకుండా కార్లు, ప్రైవేటు ట్రావెల్స్‌, స్కూలు బస్సులు కూడా వేలల్లోనే ఉన్నాయి. పెట్రో ధరలు పెరగడంతో రోజుకు లక్షల భారం వాహనదారులపై పడుతోంది. 




Updated Date - 2021-10-03T06:54:33+05:30 IST