డీజిల్‌ ధర పైపైకి

ABN , First Publish Date - 2021-07-22T05:07:25+05:30 IST

డీజిల్‌ ధర పైపైకి

డీజిల్‌ ధర పైపైకి

జిల్లాలో ప్రస్తుతం డీజిల్‌ లీటర్‌ ధర రూ.99.25

ఈనెలలోనే రూ.100 దాటవచ్చంటున్న డీలర్స్‌ అసోసియేషన్‌ 

కరోనా మొదటి దశకు ముందు రూ.71.27 

ఏడాదిన్నరలో రూ.27.98 పెంపు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు హడలెత్తిస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.100 దాటేసి అంతకంతకూ పెరిగిపోతుండగా, తాజాగా డీజిల్‌ సెంచరీకి చేరువైంది. ఫలితంగా జిల్లావ్యాప్తంగా రవాణా రంగంపై పెను ప్రభావం పడనుంది. 

విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో డీజిల్‌ ధర సెంచరీకి చేరువవుతోంది. జిల్లావ్యాప్తంగా  బుధవారం నాటికి డీజిల్‌ ధర రూ.99.25కు చేరింది. ఇప్పటికే పెట్రోల్‌ రేటు రూ.100 దాటేయగా, పెట్రోల్‌, డీజిల్‌ ధర మధ్య వ్యత్యాసం రూ.10లోపు ఉంది. ఈ నెలలోనే డీజిల్‌ ధర కూడా సెంచరీ కొడుతుందని జిల్లా పెట్రోలియం, డీజిల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ అంచనా వేస్తోంది. నాలుగు రోజుల నుంచి డీజిల్‌ ధరల పెరుగుదల స్థిరంగా ఉన్నప్పటికీ రెండు దఫాలు 35 పైసల చొప్పున పెంచితే వారంలోనే రూ.100కు చేరుతుంది. 

రవాణా రంగంపై పెను ప్రభావం

డీజిల్‌ ధరల పెరుగుదల రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కరోనాకు ముందు నుంచే రవాణా రంగం ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. అనంతర పరిస్థితుల్లో ఉత్పాదకత తగ్గటం, కిరాయిలు లేకపోవటం వల్ల మరింత కుంగిపోయింది. లారీ రవాణా రంగం పరిస్థితి మరీ ఘోరంగా ఉండటంతో త్రైమాసిక పన్నులు చెల్లించలేక ప్రభుత్వాన్ని పదేపదే గడువు కోరుతున్నారు. ఈఎంఐలు కట్టలేక, ఫైనాన్షియర్ల ఒత్తిళ్లు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడినవారూ ఉన్నారు. 

కరోనా సమయంలో  కష్టంగా..

కరోనా మొద టి దశ ముందు.. అంటే 2020, ఫిబ్రవరిలో డీజిల్‌ లీటర్‌ ధర రూ.71.27. ప్రస్తుతం రూ.99.25కు చేరుకుంది. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ ఏడాదిన్నరలోనే రూ.27.98 పెరగటం గమనార్హం. కరోనా అనంతరం కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలు కార్పొరేట్‌ సంస్థలకు తప్ప సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. పైగా డీజిల్‌ ధరల పెంపుతో పరోక్షంగా సామాన్యులపై భారం పడుతోంది. ఏడాదిన్నరలో పెరిగిన డీజిల్‌ ధర రూ.27.98 వల్ల జిల్లాలో లారీ రవాణా రంగంపై రోజుకు రూ.62.95 లక్షల మేర భారం పడుతోంది. అంటే నెలకు రూ.18.88 కోట్లు కాగా, ఏడాదికి రూ.226.63 కోట్లు. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులపైనా రూ.50 కోట్ల మేర భారం పడుతోంది.

పరోక్షంగా ప్రజలపైనే భారం

పెరిగిన డీజిల్‌ ధరల ప్రభావం అంతిమంగా ప్రజలపైనే పడుతోంది. లారీ రవాణా రంగం కిరాయిల రేట్లను పెంచుకుంది. జిల్లాలో 45వేల లారీలు ఉన్నాయి. వీటిలో 25వేల లారీలు జాతీయ పర్మిట్‌లు కాగా, 15వేలు చిన్న, పెద్ద టిప్పర్లు. జాతీయ పర్మిట్‌ లారీలు కిరాయిల ధరలను పెంచటం వల్ల నిత్యావసరాలు, ఆయిల్స్‌, పాలు, సిమెంట్‌, ఇతర ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఫలితంగా ఈ భారాన్ని ప్రజలు మోయాల్సి వస్తోంది. అలాగే చిన్న, పెద్ద టిప్పర్లు ఇసుక, గ్రావెల్‌ తదితర కిరాయిలను పెంచటం వల్ల అది కూడా ప్రజలపైనే పడుతోంది. ప్రైవేట్‌ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు, ట్యాక్సీల ధరలు కూడా పెరిగాయి. రైతులు ట్రాక్టర్లు, మోటార్ల డీజిల్‌ వినియోగానికీ అదనపు భారం పడుతోంది. 



Updated Date - 2021-07-22T05:07:25+05:30 IST