నేరుగా వాహనాల నుంచే అపహరణ

ABN , First Publish Date - 2021-11-08T06:41:34+05:30 IST

అనంతపురం నగరపాలక సంస్థలో డీజిల్‌ దొంగలు పడ్డారు. రోజూ డీజిల్‌ను వాహనాల నుంచే అపహరిస్తారు.

నేరుగా వాహనాల నుంచే అపహరణ
ఇటీవల ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని టెంకాయల అంగడి వద్ద డ్రైవర్‌ వదిలిపెట్టిన డీజిల్‌ క్యాన (వృత్తంలో..)

నగరపాలక సంస్థలో డీజిల్‌ దొంగలు..!

ఈ తంతు వెనుక ఓ డీఈ?

ఆయనకు అదనంగా ముగ్గురు ప్రైవేట్‌ సిబ్బంది

వారి కోసమే ప్రతినెలా రూ.25 వేలు

డీజిల్‌ లెక్కలు రాసేదీ  డ్రైవరే!

పని తక్కువ.. దోచుడు ఎక్కువ..

అనంతపురం కార్పొరేషన, నవంబరు 7: అనంతపురం నగరపాలక సంస్థలో డీజిల్‌ దొంగలు పడ్డారు. రోజూ డీజిల్‌ను వాహనాల నుంచే అపహరిస్తారు. వారు బహిరంగంగా దొరికినా పట్టించుకునే నాథుడేలేడు. ఓ అధికారి వారికి పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించడమే ఇందుకు ప్రధాన కారణం. ఆ ఇంజనీరింగ్‌ అధికారి ఈ స్కామ్‌ వెనుక కీలకపాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చెత్త తరలింపు సమయంలో వాహనాల వెంట ఉండే సిబ్బందే ఈ డీజిల్‌ను అపహరిస్తున్నారు. అలా డీజిల్‌ తీస్తూ ఎన్నోమార్లు నేరుగా దొరికినా, ఫొటో సాక్ష్యమున్నా... అధికారులు ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. పెట్రోల్‌ బంక్‌ మార్చినా అవినీతి మాత్రం ఆగలేదు. డీజిల్‌ ధరలు పెరిగాయనే ముసుగులో ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శలు లేకపోలేదు. కొన్నేళ్లుగా కార్పొరేషనలో డీజిల్‌ కుంభకోణాలు కొనసాగుతూనే ఉన్నాయి.



నేరుగా వాహనాల నుంచే..

చెత్త తరలించే వాహనాల నుంచే నేరుగా వాటి డ్రైవర్లు, ఇతర సిబ్బంది డీజిల్‌ను తీస్తున్నారు. పదుల సంఖ్యలో లీటర్ల డీజిల్‌ను పెద్దపెద్ద క్యాన్లలో తీసేస్తున్నారు. పది రోజుల క్రితం గుత్తిరోడ్డులో ఓ టిప్పర్‌ డ్రైవర్‌ డీజిల్‌ను క్యానలోకి తీశాడు. దానిని తాను కూర్చునే సీటు వద్దకు చేర్చాడు. అది ఎవరో వీడియో తీయడంతో.. ‘మీ కాళ్లు మొక్కుతాననీ, వదిలిపెట్టమని’ వేడుకుంటున్నాడు. ఆ వీడియో వైరల్‌ అయింది. గతనెల 31న మరో టిప్పర్‌ డ్రైవర్‌ ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఓ పచ్చిటెంకాయల దుకాణం వద్ద డీజిల్‌ నిండు క్యానను పెట్టేసి, మళ్లీ తన వాహనం ఎక్కి బయలుదేరాడు. ఇంత బహిరంగంగా డీజిల్‌ దోపిడీకి పాల్పడుతున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదు. ఆ విభాగాన్ని పర్యవేక్షించే ఆ ఇంజనీరింగ్‌ అధికారిని చూసే ఎవరూ పల్లెత్తుమాట అనడం లేదనే విమర్శలున్నాయి. గతంలో ఇలాంటి ఫొటోలు, వీడియోలు ఎవరైనా ఆ డీఈకి పంపితే... ఎవరికీ చెప్పకుండా వెంటనే వాటిని డిలీట్‌ చేసేయమని సెలవిస్తారట. కాంప్యాక్టర్లు మినహా దాదాపు ప్రతి వాహనం నుంచి డీజిల్‌ను అపహరిస్తున్నట్లు సమాచారం. దానిని విక్రయించగా వచ్చే సొమ్ము ఎవరెవరికి చేరుతుందో తెలియాల్సి ఉంది. రోజూ 50 లీటర్లనుకున్నా లీటర్‌ డీజిల్‌ రూ.100 అనుకుంటే రోజుకు రూ.5 వేల చొప్పున ప్రతినెలా రూ.1.50 లక్షలు హాంఫట్‌ అనడంలో సందేహం లేదు. అంతకుమించి దొంగలిస్తే ఆ మొత్తం ఇంకా పెరుగుతుంది.



పని తక్కువ... దోచుడు ఎక్కువ.. 

నగరపాలక సంస్థ పరిధిలో చెత్తను కంపో్‌స్టయార్డుకు తరలించేందుకు మొత్తం 42 వాహనాలున్నాయి. నగరంలోని ఆరు సర్కిళ్లలో వీటిని ఉపయోగిస్తారు. ఒకటో సర్కిల్‌కు ఒక పెద్ద, చిన్న కాంప్యాక్టర్‌, రెండు ట్రాక్టర్లు, ఒక ఆటో, రెండో సర్కిల్‌కు 2 చిన్న కాంప్యాక్టర్లు, 2 ట్రాక్టర్లు, ఒక టిప్పర్‌, మూడో సర్కిల్‌కు ఒక పెద్ద, మరో చిన్న కాంప్యాక్టర్‌, 3 ట్రాక్టర్లు, నాలుగో సర్కిల్‌లో 2 చిన్న కాంప్యాక్టర్లు, ఒక ట్రాక్టర్‌, ఒక ఆటో, ఐదో సర్కిల్‌లో ఒక పెద్ద, చిన్న కాంప్యాక్టరు, 2 ట్రాక్టర్లు, ఆరో సర్కిల్‌లో ఒక చిన్న కాంప్యాక్టర్‌, 2 ట్రాక్టర్లు, ఒక టిప్పర్‌ ఉన్నాయి. అదనంగా కంపోస్టుయార్డులో ఒక ఎక్స్‌కవేటర్‌ ఉంటుంది. అది రోజులో ఏం చేస్తుందో, ఎంత పనిచేస్తుందో అక్కడున్న చెత్త దిబ్బలకు తప్ప ఎవరికీ తెలియదు. ఆ వాహనానికి రో జూ వంద లీటర్ల డీజిల్‌ పోస్తారట. రోజూ పెద్ద, చిన్న కాం ప్యాక్టర్లు రెండింటికీ 60 లీటర్ల చొప్పున డీజిల్‌, టిప్పర్‌కు 48 లీటర్లు, ట్రాక్టర్‌కు 28 లీటర్లు, ఆటోలకు 15 లీటర్ల చొప్పున డీజిల్‌ వేస్తారు. ఒక్కో వాహనం కనీసం మూడుసార్లయినా కంపోస్టుయార్డుకు వెళ్లాలి. రెండు సార్లు కూడా తిరగడం లేదనే ఆరోపణలున్నాయి. కాంప్యాక్టర్లు మాత్రమే ఎక్కువగా తిరగడం, టిప్పర్లను తక్కువగా తిప్పుతున్నట్లు తెలుస్తోంది. 



డీజిల్‌ లెక్కలు రాసేదీ డ్రైవరే...

డీజిల్‌ లెక్కలు రాసేది ఏ జూనియర్‌ అసిస్టెంటో, సీనియర్‌ అసిస్టెంటో కాదు, ఓ వాహన డ్రైవర్‌. వినడానికి విడ్డూరంగానే ఉన్నా.. నగరపాలక సంస్థలో జరిగే చోద్యం ఇదే. కీలకంగా వ్యవహారం నడిపే ఆ డీఈకి, డీజిల్‌ లెక్కలు రాసే డ్రైవర్‌కు అవినాభావ సంబంధం ఉంది. అతను వాహ నం దిగి లోపలికి వస్తే ఆ డీఈ పక్కనున్న బీరువాలో ఫైళ్లు వెతుకుతాడు. డీఈ చాంబర్‌లో కంప్యూటర్‌ ముందు కూర్చుని, సీరియస్‌గా ఫైళ్లు చూస్తుంటాడు. ఆ డీఈ, ఈ డ్రైవర్‌ ఒకే సామాజికవర్గానికి చెందిన వారవడంతోనే వ్యవహారం నడుపుతున్నారన్న ఆరోపణలున్నాయి. కొన్ని వాహనాలు నెలల తరబడి మరమ్మతులకు నోచుకోక మూలనపడి ఉంటాయి. అలాంటి వాటికి సైతం బిల్లు రాసే విధంగా లెక్కలు చూపుతున్నట్లు సమాచారం.


ఆయనకు ముగ్గురు ప్రైవేట్‌ సిబ్బంది

ఆ ముగ్గురు ఉద్యోగులు నగరపాలక సంస్థ ఉద్యోగులు కాదు. ఆ డీఈ ప్రత్యేకంగా పనిచేయించుకుంటున్న సిబ్బంది. ఈ వ్యవహారం నగరపాలక సంస్థలో ఎవర్నడిగినా చెబుతారు. వారెందుకలా ఆ డీఈ చాంబర్‌లో కూర్చుంటారని ప్రశ్నించే నాథుడే లేడు. ఈ లెక్కన చూస్తే ఆ డీఈ ఏ స్థాయిలో శాసిస్తున్నాడో అర్థమవుతుంది. ఆ ముగ్గురూ నిత్యం డీఈ కంటే ముందే వచ్చి కంప్యూటర్‌ ముందు కూర్చుంటారు. వారికి జీతభత్యాలు కూడా ఆయనే ఇస్తారట. ఎంత లేదన్నా ఒక్కొక్కరికి రూ.8 వేల చొప్పున ఇచ్చినా రూ.పాతికవేలు ప్రతినెలా ఇస్తారంటే ఆయన ఆదాయం ఎంతో మరి...?

Updated Date - 2021-11-08T06:41:34+05:30 IST