కావాలంటున్న GHMC.. వద్దంటున్న KCR సర్కార్.. హైకోర్టు నోటీసులు

ABN , First Publish Date - 2022-03-20T13:36:25+05:30 IST

కావాలంటున్న GHMC.. వద్దంటున్న KCR సర్కార్.. హైకోర్టు నోటీసులు

కావాలంటున్న GHMC.. వద్దంటున్న KCR సర్కార్.. హైకోర్టు నోటీసులు

  • రోడ్డు నిర్మాణంపై భిన్న వైఖరులు


హైదరాబాద్‌ : నగరంలోని వెంగళరావునగర్‌లో రోడ్డు నిర్మాణంపై జీహెచ్‌ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం భిన్న వాదనలు వినిపించడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు పంపించింది. పలు కాలనీలకు సౌకర్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో వెంగళరావునగర్‌లోని శిశువిహార్‌, స్టేట్‌ హోంల స్థలం మీదుగా రోడ్డు నిర్మించాలని జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించింది. అందులో భాగంగా గతంలో అక్కడి ప్రహరీని తొలగించే పనులు చేపట్టింది. దీన్ని సవాలు చేస్తూ బాలల హక్కుల సంఘం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా స్టే ఉత్తర్వులు వచ్చాయి. తాజాగా, ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఎన్‌. తుకారాంజీల ధర్మాసనం విచారణ చేపట్టింది.


పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సి.దామోదర్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ శిశువిహార్‌ స్థలం మీదుగా రోడ్డు నిర్మించడం వల్ల అక్కడ ఉండే చిన్నపిల్లలు, వృద్ధుల ప్రశాంత జీవనానికి భంగం కలుగుతుందని తెలిపారు. ఈ స్థలంలో జోక్యం చేసుకోబోమని ఇటీవల పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ సైతం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ ప్రమాణ పత్రం సమర్పించింది. మరోవైపు జీహెచ్‌ఎంసీ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రజా ప్రయోజనాల కోసమే దీన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ సంస్థలే భిన్న వాదనలు వినిపించడాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంలో ప్రభుత్వ వైఖరి వివరించి, కోర్టుకు సహాయం చేయాలని అడ్వకేట్‌ జనరల్‌ బి.ఎస్‌. ప్రసాద్‌కు సూచించింది. తదుపరి విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది. 

Updated Date - 2022-03-20T13:36:25+05:30 IST