కష్టమైన పాట క్లిష్టమైన పాట

Dec 1 2021 @ 03:43AM

దాదాపు 800కు పైగా సినిమాల్లో 2400కు పైగా పాటలు రాసిన సీతారామశాస్త్రి కెరీర్‌లో.. ఆయన రాయడానికి బాగా ఇబ్బంది పడిన పాట ఏది? అంటే.. ‘స్వర్ణకమలం’ సినిమాలో రాసిన పాటలు చాలా క్లిష్టమైనవని ఆయన చెప్పేవారు. అందునా.. ‘శివపూజకు చివురించిన’ పాట రాయడం తనకు చాలా కష్టమైందంటూ ఆయన ఒక వ్యాసం రాశారు. ‘‘కవిగా తన సత్తా చూపించాలి అని అనుకునే ఎవరికైనా, సరైన చాలెంజ్‌ ఎదురైతే ఎంతో ఆనందం కలుగుతుంది. తన సర్వశక్తుల్నీ ధారపోసే అవకాశం దొరికిన సంతోషం అది. అసలు ‘స్వర్ణకమలం’ సినిమా కథలోనే గొప్పతనం ఉంది. దానికి పాటలు రాయడం అనేక విధాలా కత్తిమీద సాములాంటిది’’ అని అందులో పేర్కొన్నారు. ఆ వ్యాసంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 


‘‘‘శివపూజకి చివురించిన’ పాట.. కథానాయకుడు చంద్రానికీ, కథానాయిక మీనాక్షికి మధ్య జీవన దృక్పథాల్ని చెప్పుకుంటూ సంఘర్షించే పాట. నేను సినిమా కవిని. ఏ పాత్ర పాట పాడాలో ఆ పాత్ర సంస్కారాన్ని, భాషను పలికించాలి గానీ నా వ్యక్తిగత భావనల్ని కాదు. అంటే మీనాక్షి పాత్రకు రాసేటప్పుడు నేను మీనాక్షినే అయిపోవాలి. సీతారామశాస్త్రిగా, నాకు చంద్రం ఆలోచనే రైటు, మీనాక్షి ఒట్టి మూర్ఖురాలు అనిపించవచ్చు, అనిపించాలి! అదే కథ ఉద్దేశం. కనుకే మీనాక్షి మారుతుంది. సినిమా చూసే ప్రతీ ప్రేక్షకుడూ చంద్రం పక్షం వహిస్తాడు. కానీ మీనాక్షి అతను ఒకటంటే, తను పది అంటూ, తనే రైటని వాదిస్తుంది. చంద్రం ఏ లా పాయింట్‌ తీసినా, వాటికి ధీటుగా తనూ అంతకన్నా బలంగా సమాధానం చెబుతుంది. ఇదీ నిజమైన క్లిష్టత అంటే!


  • శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా
  • మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా
  • యతిరాజుకు జతిస్వరముల పరిమళమివ్వా?
  • నటనాంజలితో బ్రతుకును తరించనీవా?

అని చంద్రం పాడాల్సిన పల్లవి రాశాను. రాయగానే నాకు అనిపించింది చాలా అద్భుతంగా వచ్చిందని, డైరెక్టరు గారు (కె.విశ్వనాథ్‌ గారు) మెచ్చుకుంటారని. అనుకున్నట్టే ఆయన చాలా సంతోషించారు. అసలు చిక్కు అంతా అప్పుడు ప్రారంభమైంది. చంద్రం పల్లవికి ధీటైన పల్లవి మీనాక్షి అనాలి. ఇక ఆ క్షణం నుంచీ పదిహేను రోజులపాటు నేను పొందిన అలజడీ, అశాంతీ అంతా ఇంతా కాదు. అయితే ఆ ఛాలెంజ్‌ని ఎదుర్కోవడంలో ఇష్టం ఉంది. ఒక పాట రాయడానికి పదిహేను రోజులు టైమిచ్చే విశ్వనాథ్‌గారి వంటి దర్శకులుండటం, అటువంటి వారి వద్ద పనిచేసే అదృష్టం పట్టడం ఎంత గొప్ప. ఈ పదిహేను రోజులూ నేను మీనాక్షిని అయిపోయాను. చంద్రం ఆరోపణకు దీటైన సమాధానం ఇవ్వడం ఒక సమస్య. కానీ ఆ పల్లవిలో ఉన్న కవిత్వపు లోతుముందు ఈమె పల్లవి వెలవెలపోకూడదు. కానీ మీనాక్షి పాత్ర కవిత్వం పలకదు కదా. ఎలా? రాత్రీ లేదు, పగలూ లేదు. తిండీ లేదు, నిద్రా లేదు. మొదటి పల్లవి రాయడం ఒక తప్పు, దాన్ని అత్యుత్సాహంగా డైరెక్టరు గారికి చూపించేసి ‘సెభాష్‌’ అనిపించేసుకోవడం రెండో తప్పు. నా మెడకు నేనే ఉరి తగిలించుకున్నానే అని చింత మొదలైంది. మొత్తానికి, సరస్వతీదేవి కరుణ, శివుడి చల్లని దీవెన, నేను నిత్యం ఆరాధించే లలితా పరమేశ్వరి అనుగ్రహం వల్ల, దాదాపు పదిహేను రోజుల తర్వాత ఒక రాత్రి పన్నెండూ ఒంటిగంట మధ్య పిచ్చిపట్టినట్టు వడపళని రోడ్లంట తిరుగుతూ జుట్టు పీక్కుంటూంటే, నాకు కావాల్సిన అన్ని లక్షణాలూ ఉన్న పల్లవి దొరికింది. 

  • ‘‘పరుగాపక పయనించవె తలపుల నావా!
  • కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
  • నడిసంద్రపు తాళానికి నర్తిస్తావా?
  • మదికోరిన మధుసీమలు జయించుకోవా?’’


ఈ పల్లవిలో మూడో లైను కవిత్వపు ఘాటు వేస్తోందని, ఫైనల్‌ వర్షన్‌లో మార్చాను.  చరణాల్లో కూడా ఇదే బ్యాలెన్స్‌ చూపించాను.’’ అని సీతారామశాస్త్రి వివరించారు. 


ఎన్నెన్నో పురస్కారాలు

సిరివెన్నెల కీర్తికిరీటంలో ఎన్నోన్నో పురస్కారాలు. ఆయన కెరీర్‌లో 11 నంది అవార్డులు అందుకున్నారు. నాలుగు ఫిలింఫేర్‌ అవార్డులు సాధించారు. 2019లో భారత ప్రభుత్వం ఆయన్ను ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.