అరటి రైతుకు కష్టాలు

ABN , First Publish Date - 2021-11-18T05:06:21+05:30 IST

మండలంలోని చిన్నవంగలి, చాగలమర్రి గ్రామాల్లో అరటి సాగు చేసిన రైతులకు తుపాను వల్ల కష్టాలు చుట్టుము ట్టాయి.

అరటి రైతుకు కష్టాలు
చిన్నవంగలిలో అరటి చెట్లకే వదిలేసిన గెలలు

  1. పడిపోయిన ధరలు
  2. తుపాను ప్రభావంతో నిలిచిన ఎగుమతులు 
  3. ఆందోళనలో రైతులు 


చాగలమర్రి, నవంబరు 17: మండలంలోని చిన్నవంగలి, చాగలమర్రి గ్రామాల్లో అరటి సాగు చేసిన రైతులకు తుపాను వల్ల కష్టాలు చుట్టుము ట్టాయి. ఈ గ్రామాల్లో  300 ఎకరాల్లో సాగు చేసిన  అరటి  కోత దశకు చేరుకుంది. అయితే తుపాను ప్రభావంతో ఎగుమతులు నిలిచిపోయాయి.  ఎకరాకు రూ.70 వేలు నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడులు పెట్టారు. ఒక్కో అరటి గెల దాదాపు 20 నుంచి 25 కిలోల బరువుతో కాపు వచ్చింది. గత నెల కిలో రూ.15 ఉన్న ధర ప్రస్తుతం రూ.2లకు పడిపోయింది.  


ముందుకురాని కొనుగోలు దారులు 

ఢిల్లీ, హర్యాణా నుంచి వ్యాపారులు మధ్యవర్తుల ద్వారా అరటిపంట కొని ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటారు. అయితే ఒకరిద్దరు వ్యాపారులు అరటితోటల వద్దకు వెళ్లి ధరలను అమాంతం తగ్గిస్తున్నారు. వర్షాల వల్ల ఎగుమతి నిలిచిపోవడంతో ధర తగ్గిపోయిందని అంటున్నారు. దీంతో కిలో రూ.2లకే అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. లేకపోతే వ్యాపారులు ముందుకు రావడం లేదని, దీంతో గెలలను పొలాల్లోనే వదులుకోవాల్సి వస్తోందని అంటున్నారు.  టన్ను రూ.1,500 కూడా అమ్ముడు పోవడం లేదని రైతులు విలపిస్తున్నారు. 


తోటలు దున్నేస్తున్నారు.. 

ధరలు లేక పోవడంతో డోజర్‌తో అరటి తోటలను రైతులు దున్నేస్తున్నారు. ఇప్పటికే 100 ఎకరాల దాకా అరటి తోటలు తొలగించి ప్రత్యామ్నాయంగా   శనగ, మినుము పంటలు సాగు చేశారు. ఆ పంటలు కూడా తుపాను దెబ్బతో నల్లగా మారిపోతున్నాయి.  అరటి పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 


రూ.2 లక్షలు నష్టపోయా

రెండు ఎకరాల్లో అరటి పంట సాగు చేశా. రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టా. ధర తగ్గడంతో వ్యాపారులు ముందుకు రావడం లేదు. పొలంలోనే  గెలలు వదిలేశా. ప్రభుత్వం ఆదుకొని పరిహారం అందించాలి. 

- చంద్ర ఓబుళరెడ్డి, రైతు, చిన్నవంగలి 


కొనేవారే లేరు

మూడు ఎకరాల్లో అరటి సాగు చేశా. రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టా. దిగుబడి వచ్చే సరికి ధరలు పతనమయ్యాయి. పొలాల్లోనే అరటి గెలలు మాగిపోయి నష్టం కలుగుతోంది. మార్కెట్‌ సౌకర్యం కల్పించి ప్రభుత్వం కొనాలి.  

- మహబూబ్‌బాషా, రైతు, చిన్నవంగలి



Updated Date - 2021-11-18T05:06:21+05:30 IST