ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బందులు

ABN , First Publish Date - 2022-06-26T06:20:00+05:30 IST

‘రాఘవాపూర్‌ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పది సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణం కోసం రెండు గుంటల స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు.

ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బందులు

- నాలా కన్వర్షన్‌ లేక గ్రామాల్లో లభించని అనుమతులు

- ‘ధరణి’లో విక్రయించిన వారి పేరిటనే భూములు

- రెవెన్యూ రికార్డుల్లో నమోదుకు అవకాశం ఇవ్వాలని వేడుకోలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

‘రాఘవాపూర్‌ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పది సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణం కోసం రెండు గుంటల స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. కానీ మ్యుటేషన్‌ చేయించుకోలేదు. భూ ప్రక్షాళన అనంతరం తీసుకవచ్చిన ధరణిలో మాత్రం విక్రయదారుడి పేరిటనే వ్యవసాయ భూమిగా నమోదై ఉన్నది. కొనుగోలుదారుడు ఇల్లు నిర్మించుకునేందుకు గ్రామపంచాయతీలో దరఖాస్తు చేసుకుంటే నాలా(నాన్‌-అగ్రికల్చరల్‌ ల్యాండ్‌ అసెస్‌మెంట్‌) కన్వర్షన్‌ కానందున తిరస్కరించారు. ఆ భూమిని నాలా కన్వర్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ధరణిలో అతడి పేరిట ఆ భూమి ఉండాలి. కానీ విక్రయించిన వారి పేరిటనే ఆ భూమి ఉన్నది. ఇలాంటి భూములను మార్పు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడంతో జిల్లావ్యాప్తంగా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్‌ పరిధిలో ఉన్న రిజిష్టర్డ్‌ భూముల్లో ఇల్లు కట్టుకునేందుకు మాత్రం ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టించుకుని అనుమతులు ఇస్తున్నది. గ్రామపంచాయతీల పరిధిలోని భూములకు అనుమతులు ఇవ్వకపోవడంతో చాలా మంది సతమతం అవుతున్నారు.

దరఖాస్తుల తిరస్కరణ..

ధరణి వెబ్‌సైట్‌ రాక ముందు గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాల కోసం గజాల్లో కొనుగోలు చేసిన భూముల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతులు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఆ భూములను నాలా కింద కన్వర్షన్‌ చేయలేదనే కారణంగా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. అయితే ఆ స్థలాలను నాలా కన్వర్షన్‌ చేసుకునేందుకు అవకాశం లేక ఆందోళనకు గురవుతున్నారు. గ్రామాల్లో ఉండే పట్టాదారులు తమ అవసరాల నిమిత్తం తమకున్న భూమిని ఇళ్ల నిర్మాణాల కోసం 2, 3 గుంటల చొప్పున విక్రయించుకున్నారు. ఇళ్ల కోసం కొనుగోలు చేసిన భూములను అప్పటి సబ్‌ రిజిష్ట్రార్‌ అధికారులు కొన్ని గజాల్లో, మరికొన్ని గుంటల్లో రిజిస్ట్రేషన్‌ చేశారు. ఆ వెంటనే స్థలాలను రెవెన్యూ రికార్డుల్లో తమ పేరిట మార్పు చేయించుకునేందుకు మ్యుటేషన్‌ కోసం చాలా మంది దరఖాస్తు చేసుకోలేదు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత ఆ భూమి ఎక్కడికి పోతుందనే ధీమాతో మిన్నకుండిపోయారు. కానీ ఇప్పుడు ఆ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోవాలంటే అనుమతుల కోసం తంటాలు పడాల్సి వస్తున్నది. జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్‌, ఓదెల, రామగిరి, కమాన్‌పూర్‌, కాల్వశ్రీరాంపూర్‌, జూలపల్లి, ధర్మారం, ఎలిగేడు, ముత్తారం, మంథని, పాలకుర్తి, అంతర్గాం మండలాల్లో ఇలా అనేక మంది ఉన్నారు. రాష్ట్రంలో భూరికార్డులను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం 2015-16లో శ్రీకారం చుట్టింది. పాత పట్టాదారు పాసుపుస్తకాల స్థానంలో కొత్త పాసు పుస్తకాలను జారీ చేసింది. ఈ పాస్‌ బుక్కుల స్థానంలో ఎవరు కూడా దొంగ పాసు బుక్కులు సృష్టించకుండా ఉండే విధంగా రూపొందించారు. భూముల వివరాలన్నింటినీ ధరణి పోర్టల్‌లో నమోదు చేశారు. వ్యవసాయ భూముల కోసం ఒక పోర్టల్‌ను, వ్యవసాయేతర భూముల కోసం ఒక పోర్టల్‌ను తీసుకరావాలని ప్రభుత్వం భావించింది. వ్యవసాయ భూములన్నింటినీ మండల రెవెన్యూ కార్యాలయాల్లో, ఇతర భూములను సబ్‌ రిజిష్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయాలని భావించింది. కానీ కేవలం వ్యవసాయ భూములను మాత్రమే ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ఒకేరోజు పూర్తిచేసి వారం రోజుల్లో పట్టాదారు పాసు పుస్తకాలను అందజేస్తున్నారు. 

విక్రయదారుల పేరిటనే..

ధరణి రాక ముందు ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూములను తమ పేరిట రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించుకోకపోవడంతో విక్రయించిన వారి పేరిటనే ధరణిలో నమోదయ్యాయి. ఇప్పుడు అలాంటి స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకై పలువురు గ్రామ పంచాయతీల్లో ఆన్‌లైన్‌ ద్వారా చేసుకుంటున్న దరఖాస్తులన్నీ నాలా కన్వర్షన్‌ కాలేదనే కారణంగా తిరస్కరణకు గురవుతుండడంతో ఆందోళనకు గురువుతున్నారు. గతంలో పంచాయతీల్లో మ్యాన్యువల్‌గానే చూసీచూడనట్లుగా అనుమతులు ఇచ్చేవాళ్లు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ ద్వారా అనుమతులు ఇస్తున్నారు. అన్ని రకాల డాక్యుమెంట్లు ఉంటేనే అనుమతులు ఇస్తున్నారు. నాలా కన్వర్షన్‌ చేయని భూములను నాలా కన్వర్షన్‌ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం వ్యవసాయ భూములను నాలా కన్వర్షన్‌ చేసుకోవాలంటే ఆ భూముల వివరాలు ధరణిలో నమోదై ఉంటేనే కన్వర్షన్‌ అవుతున్నాయి. ఇళ్ల స్థలాల కోసం స్థలాలు కొనుగోలు చేసి రెవెన్యూ రికార్డుల్లో తమ పేరిట ఎక్కించుకోలేని వాళ్లు ఆ స్థలాలను కన్వర్షన్‌ చేసుకునే అవకాశం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న ఇళ్ల స్థలాలకు డీటీసీపీ అనుమతులు లేకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టించుకుని రోడ్ల కోసం కావాల్సిన భూమిని వదిలేసి మిగతా స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతులు ఇస్తున్నారు. ఇళ్ల స్థలాల కోసం గతంలో కొనుగోలు చేసిన భూములను తమ పేరిట మ్యుటేషన్‌ చేయించుకునేందుకు ధరణి ద్వారా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-06-26T06:20:00+05:30 IST