డెంగ్యూ నిర్ధారణ పరీక్షలకు కష్టాలు

ABN , First Publish Date - 2021-07-27T05:58:54+05:30 IST

కీలక సమయంలో ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రిలోని డెంగ్యూ నిర్ధారణ పరీక్షా కేంద్రం ఉప యోగంలోకి రాలేదు.

డెంగ్యూ నిర్ధారణ పరీక్షలకు కష్టాలు
ప్రాంతీయ ఆస్పత్రిలో నిరుపయోగంగా ఉన్న మిషన్లు

    ప్రాంతీయ ఆస్పత్రిలో  కీలక దశలో ఉపయోగపడని పరీక్షా కేంద్రం

  నిరుపయోగంగా ఎలీసా మిషన్లు 

ప్రైవేటు ల్యాబ్‌ల్లో ర్యాపిడ్‌ కిట్లతో పరీక్షలు

నర్సీపట్నం, జూలై 26 : కీలక సమయంలో ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రిలోని డెంగ్యూ నిర్ధారణ పరీక్షా కేంద్రం ఉప యోగంలోకి రాలేదు. ప్రస్తుతం నర్సీపట్నం, చుట్టు పక్కల మండలాల్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. నర్సీపట్నం శారదానగర్‌, నాతవరం మండలం జిల్లెడపూడి, ఏపీపురం, మాకవరపాలెం మండలం జి.కోడూరులలో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇటువంటి తరుణంలో ప్రాంతీయ ఆస్పత్రిలో డెంగ్యూ నిర్ధారణ పరీక్షా కేంద్రం అందుబాటులోకి వస్తే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉండేది. ఇప్పుడు ప్రైవేటు ల్యాబ్‌లలో ర్యాపిడ్‌ కిట్లు మీద పరీక్ష చేసి డెంగ్యూ రిపోర్ట్‌ ఇస్తున్నారు. రోగులు భయాందోళనకు గురై ప్రైవేటు వైద్యం కోసం డబ్బులు ఖర్చు చేసి ఆర్థికంగా నష్ట పోతున్నారు. ర్యాపిడ్‌ కిట్లు మీద డెంగ్యూ నిర్ధారణ కాదని, ఎలీసా పరీక్ష చేయించుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ ప్రాంతీయ ఆస్పత్రిలో డెంగ్యూ పరీక్షలు చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో రోగులు ప్రైవేటు వైద్యులు, ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. గతంలో విశాఖ కేజీహెచ్‌లో మాత్రమే డెంగ్యూ ఎలీసా పరీక్ష చేసేవారు. నాలుగు నెలల క్రితం నర్సీపట్నం, పాడేరు, అరకు ప్రాంతీయ ఆస్పత్రులకు డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు చేయడానికి అవసరమైన ఎలీసా రీడర్స్‌ మిషన్లు పంపించారు. ఒక మిషన్‌ మీద ఐదు శాంపిల్స్‌ ఒకేసారి పరీక్ష చేయవచ్చు. ఐదారు గంటల్లో రిపోర్టు వస్తుంది. నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి మూడు మిషన్లు, కెమికల్స్‌ పంపించారు. ఒక రకం కెమికల్‌ రావాల్సి ఉండడంతో డెంగ్యూ పరీక్షలు జరగడం లేదు.

Updated Date - 2021-07-27T05:58:54+05:30 IST