
దిగంబరకవులు అనగానే నగ్నముని, మహాస్వప్న, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు, భైరవయ్య అనే ఆరుగురు వ్యక్తులు, 1965 నుండి 1968 వరకూ వెలువరించిన మూడు కవితా సంపుటులు, వాటి తాలూకు షాక్ ట్రీట్మెంట్- తెలుగు సాహిత్యలోకం మదిలో మెదుల్తాయి. నిఖిలేశ్వర్ పదేపదే స్పష్టం చేసిన విషయం ఏమిటంటే ‘‘దిగంబర కవుల కవిత్వం ఇతర ఉద్యమాలకు, విదేశీ వాదాలకు అనుకరణగా భావించడం పొరబాటు తప్ప మరొకటికాదు’’ అని (భారతి- జనవరి 1967). ‘‘నా స్పష్టమైన విశ్లేషణ-వివరణలను చదివి కూడా, కొంతమంది విమర్శకులు-ఆచార్యులు, దిగంబర కవుల ఉద్యమాన్ని విదేశీ తిరుగుబాటు ఉద్యమాలకు అనుకరణ మాత్రమేనని విమర్శించి తమ అజ్ఞానాన్ని, సొంత తెలివితేటల్ని ప్రదర్శించారు. మన పరిశోధకుల-విమర్శకుల అవగాహన పెరగలేదు’’ (ప్రపంచ సాహిత్యంలో ఉద్యమాలు-పూర్వరంగం- మార్చ్ 1995) అని విశ్వవిద్యాలయ ఆచార్యులమీద విమర్శకుల మీద వ్యంగ్య-విమర్శనాస్త్రాలను సంధించారు.
ఈ కవిత్వం ఏ ఉద్యమాలకు అనుకరణ కానీ, అనుసరణ కానీ కాదన్న మాట కొంచెం లోతుగా అధ్యయనం చేసినవారికి సత్యదూరమనే అనిపిస్తున్నది. ప్రథమంగా వారు ఉపయోగించిన ‘‘దిగంబర’’ అనే మాటే పూర్తిగా విదేశీ అనుకరణ. ఈ పదం ‘‘బీట్నిక్కుల క్రీస్తు’’గా భావించబడే ఎలెన్ గిన్స్బర్గ్ ఒక కవితలో ప్రయోగించిన మాట. 1950వ దశకంలో ఒకసారి లాస్ ఏంజెల్స్‌లో కవిసమ్మేళనం జరుగుతున్నప్పుడు గిన్స్బర్గ్ ‘హౌల్’ అనే బహు ప్రాచుర్యం పొందిన తన బీట్నిక్కు కవితను గంభీరంగా చదువుతున్నాడు. ఆ కవితలో ఒకచోట ఉన్న ‘నేకెడ్నెస్’ (నగ్నత్వం లేక దిగంబరత్వం) అనే మాటను ఉచ్ఛరించగానే, ఒక శ్రోత వెంటనే లేచి ‘‘మీరు నగ్నత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు. కానీ నగ్నత్వం అంటే ఏమిటి?’’ అని ఆయన్ను నిలదీశాడు. గిన్స్బర్గ్ కాసేపు నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. చివరకు, ‘‘దిగంబరత్వమంటే చూడు!’’ అని తన బట్టలనీ విప్పేసి ‘‘ఇదే దిగంబరత్వం!’’ అన్నాడు. ఆ కవి సమ్మేళనంలోని స్త్రీ-పురుషులు ఒక్కసారి అవాక్కయ్యారు. వేశ్యలా ఉన్న అమెరికన్ మిథ్యాగౌరవాన్ని ప్రశ్నిస్తూ గిన్స్బర్గ్ ఈ పని చేశాడని సహకవులు అన్నారు. అమెరికన్ యువకుల్లో అసంతృప్తి, అలజడి, నిస్పృహ వర్గానికి చెందిన ఈ బీట్ తరం యువకుల్లో గిన్స్బర్గ్తోబాటూ మరికొంతమంది శక్తివంతమైన రచయితలు కూడా ఉన్నారు. కవిత్వంలో ఈ ‘‘దిగంబరత్వం’’ అనే పదం మన తెలుగుకవులను ఆకర్షించడంతో ‘‘దిగంబర కవిత్వం’’ అన్న నామకరణం జరిగి ఉంటుంది. 1962లో ‘ఉదయించని ఉదయాలు’ పేరుతో కవితాసంపుటిని ‘మానేపల్లి హృషీకేశవరావు’ వెలువరించి, హఠా త్తుగా దిగంబర కవిత్వం కోసం ‘నగ్నముని’గా మారడం వెనుక కూడా పై నేపథ్యం ఉన్నట్టు అనుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
రెండో విషయం ఏమిటంటే దిగంబర కవులు వెలువరించిన రెండవ సంపుటిలో 1966 సంవత్సరాన్ని ‘‘దిగంబర శకం’’ అనీ, ఖండికలను దిక్కులని ప్రత్యేక నామకరణం చేశారు. ఈ ప్రత్యేక నామకరణం దిగంబర కవుల స్వంత ఆలోచన కాదని నా భావన. ఎందుకంటే, ‘‘ఆకలితరం’’ (హంగ్రీ జెనరేషన్) అనబడే పశ్చిమ బెంగాల్ యువకవుల ఆలోచనలనుండి ఈ నూత్న ఆవిష్కరణ పుట్టింది. మన భారతదేశంలో సాహిత్య-సాంస్కృతిక విప్లవాలకు బెంగాల్ రాష్ట్రం ఒకప్పుడు ముందుండేది. బెంగాల్ విభజన జరిగిన తర్వాత దాదాపు పాతికేళ్ళు పశ్చిమబెంగాల్ ప్రశాంతంగా లేదు. రాష్ట్రానికి ప్రతిబింబమైన కలకత్తా నగరంలో ఎన్నో సంచ లనాలు. ఆ కాలంలో అక్కడ సమ్మెలేని రోజు అంటూ ఉండేది కాదు. ఇల్లు, తిండి లేక ఆకలికి నకనకలాడే కాందిశీకులు, శుష్క వాగ్దానాలు గుప్పించే రాజకీయ నాయకులు, ఏదో రాసి డబ్బు గడించుకుందామనుకునే వ్యాపార మనస్తత్వంగల రచయితలు, ముందు కాళ్ళకు బంధాలు వేసే సాంప్రదాయ నియమాలు... ఇవన్నీ కలకత్తాలో నివసించే యువకవులను ‘‘ఆకలి తరం’’ కవులుగా మార్చాయి. అదే సమయంలో యాదృచ్ఛికంగా బీట్ జెనరేషన్ ఏసుక్రీస్తు ఎలెన్ గిన్స్బర్గ్ భారతదేశ పర్యటనకు వచ్చి కలకత్తాలో ఈ యువకవులను కలిసి బీట్నిక్కుల విధానాన్ని ప్రేరణగా చూపాడు. వారు ఉద్యమాన్ని ఒక కారణం, ఔన్నత్యం కోసం ప్రారంభించారు. ఆకలితరం కవుల మేనిఫెస్టోలో ఉన్న అనేక విషయాలలో ఒకటి: ‘‘కాలాన్ని దశాంశ ప్రణాళికలో విభజించి కొత్త నిముషాలుగా, కొత్త గంటలుగా భావిస్తాము’’ అన్నది (ప్రపంచ సాహిత్యంలో తిరుగుబాటు ఉద్యమాలు, నిఖిలేశ్వర్ పుట.18). ఒక అంశాన్ని స్ఫూర్తిగా తీసుకుని దిగంబర కవులు కాలానికి కొత్త నామకరణ ‘‘దిగంబర శకం’’ అని పెట్టారనడంలో సందేహం ఏమీ లేదు. అలాగే వారాలకు, ఋతువులకు, సంవత్సరాలకు కూడా కొత్త పేర్లను పెట్టడంలో కూడా అదే స్ఫూర్తి కొనసాగింది.
సాహిత్యంలో ఏదీ హటాత్తుగా ఉద్భవించదు, ఊడిపడదు. పాతదే రూపురేఖలు మార్చుకొని కొత్తదనాన్ని సంతరించుకొం టుంది. సాహిత్యం పరిణామశీలి. నిత్య ప్రయోగశీలి. కవులు, రచయితలు పాత పరిస్థితులకంటే మెరుగైన పరిస్థితులకోసం అన్వేషించడం సహజ లక్షణం. అన్వేషించిన ప్రయోజనాలు, సత్ఫలితాలు దక్కాయా? లేదా? అనే విషయం పక్కనబెడితే, అలాంటి ఒక అపూర్వ ప్రయోగమే దిగంబరకవిత్వమని ఆధునికాంధ్ర సాహిత్యచరిత్ర పుటలు పరిశీలించినవారికి ద్యోతకమయే సత్యం.
టేకుమళ్ళ వెంకటప్పయ్య
94904 00858