పిన్నెల్లిలో.. మట్టి దందా

ABN , First Publish Date - 2022-05-18T05:43:42+05:30 IST

తవ్వుకుంటాం.. తరలిస్తాం.. అడిగేదెవరు.. అడ్డుకునేదెవరు.. అసలు అంత థైర్యం ఎవరికి ఉంది.. వాహనాలను సీజ్‌ చేయండి చూస్తాం.. మా వెనుక వైసీపీ నాయకులు ఉన్నారు..

పిన్నెల్లిలో.. మట్టి దందా
పిన్నెల్లి నల్లచెరువులో జేసీబీతో ట్రాక్టర్లకు మట్టి తోలుతున్న దృశ్యం

తవ్వుకుని తరలిస్తున్నా అడ్డుకోని అధికారులు 

ఎక్స్‌కవేటర్‌, టిప్పర్ల యజమానుల అక్రమాలు

 

గుంటూరు, మే 17: తవ్వుకుంటాం.. తరలిస్తాం.. అడిగేదెవరు.. అడ్డుకునేదెవరు.. అసలు అంత థైర్యం ఎవరికి ఉంది.. వాహనాలను సీజ్‌ చేయండి చూస్తాం.. మా వెనుక వైసీపీ నాయకులు ఉన్నారు.. అంటూ ఎక్స్‌కవేటర్‌, టిప్పర్ల యజమానులు చెలరేగిపోతున్నారు.  మాచవరం మండలంలోని పిన్నెల్లి శివారు నల్లచెరువు ప్రాంతంలో కొన్నిరోజులుగా అడ్డగోలుగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. మూడు ఎక్స్‌కవేటర్లతో చెరువులో మట్టి తవ్వి 20 నుంచి 30 టిప్పర్లలో నిత్యం తరలిస్తున్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం గ్రామంలోని ఎస్సీ కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 20 నుంచి 30 సెంట్ల బీఫారాలు ఇచ్చారు. అయితే పంటలు పండించుకునేందుకు వీలు లేకపోవడంతో ఆ భూములను వదిలేశారు. దీంతో ఈ భూములపై కన్నేసిన వారు పట్టాదారులకు రూ.10 వేలు, రూ.15 వేలు ముట్టచెప్పి స్వాధీనం చేసుకున్నారు. ఈ భూముల్లో తవ్వకాలు చేసి రూ.లక్షల్లో సంపాదించుకుంటున్నారు. రెవెన్యూ, మైనింగ్‌ అధికారుల నుంచి తవ్వకాలకు అనుమతులు తీసుకోకుండా రాత్రి, పగలు అన్న తేడా లేకుండా ఇష్టానుసారంగా మట్టి తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు.   నల్లచెరువు నుంచి పిడుగురాళ్ల, వీరాపురం, తుమ్మలచెరువు, బ్రాహ్మణపల్లి, గంగిరెడ్డిపాలెం, మాచవరం, తురకపాలెం తదితర గ్రామాల్లోని పొలాలకు ఈ మట్టిని తరలించి అందిన కాడికి దోచుకుంటున్నారు. దూరాన్ని బట్టి రూ.2500 నుంచి రూ.4 వేల వరకు ఒక్కో టిప్పర్‌కు వసూలు చేస్తున్నారు. మధ్యవర్తులుగా ఉన్న వైసీపీ నాయకులకు ఒక్కో టిప్పర్‌కు రూ.300 నుంచి రూ.500 వరకు యజమానులు ఇస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సుమారు ఐదు నుంచి పది అడుగుల మేర లోతులో మట్టిని తవ్వుతున్నారు. ఈ తవ్వకాల గురించి రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌ అధికారులకు తెలిసినప్పటికీ అటువైపు కన్నెత్తి చూడటంలేదు. అక్రమార్కుల నుంచి మామూళ్లు ముడుతుండటమే ఇందుకు కారణమనే ఆరోపణలున్నాయి. పగలు అయితే జనం గమనిస్తారు.. రాత్రి సమయాల్లో తవ్వకాలు జరుపుకోండంటూ కొన్ని శాఖల అధికారులు సలహాలు ఇస్తూ బహిరంగంగానే సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 

రోడ్లు అధ్వానం

మట్టిని పరిమితికి మించి లోడుతో వెళ్తున్న టిప్పర్ల వల్ల గ్రామంలోని ప్రధాన రోడ్లు అధ్వానంగా మారుతున్నాయని  గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. సీసీ   రోడ్లు పాడైపోతున్నాయని తెలిపారు. ఇష్టం వచ్చినట్లు రాకపోకలు సాగిస్తున్న టిప్పర్ల యజమానులను ఎవరూ అడ్డుకోలేక పోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మట్టి తవ్వకాలను నిలుపుదల చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.  

Updated Date - 2022-05-18T05:43:42+05:30 IST