అడ్డగోలుగా తవ్వేస్తున్నారు!

ABN , First Publish Date - 2022-06-22T08:01:48+05:30 IST

జిల్లాలో కొన్నేళ్లుగా ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్‌ కొనసాగుతోంది. దీంతో అక్రమార్కులు లక్షల రూపాయల్లో అందినకాడికి దండుకుంటున్నారు.

అడ్డగోలుగా తవ్వేస్తున్నారు!

జిల్లాలో ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్‌

కొన్నేళ్లుగా  యథేచ్ఛగా కొనసాగుతున్న తవ్వకాలు

లక్షల రూపాయల్లో దండుకుంటున్న అక్రమార్కులు

ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో పట్టించుకోని అధికారులు

అక్రమ మైనింగ్‌పై ఎమ్మెల్సీ కవిత సీరియస్‌

కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్సీ

చర్యలకు ఆదేశించిన కలెక్టర్‌ నారాయణరెడ్డి

నిజామాబాద్‌, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కొన్నేళ్లుగా ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్‌ కొనసాగుతోంది. దీంతో అక్రమార్కులు లక్షల రూపాయల్లో అందినకాడికి దండుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో అధికారులు అక్రమార్కులపై చర్యలకు వెనకడుగు వేస్తున్నారు. దీంతో జిల్లాలో అక్రమ మైనింగ్‌ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. 

 ఫ మంజీరాలో ఇసుక తవ్వకాలు..

జిల్లాలోని మంజీరా, వాగుల నుంచి ఇసుక తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. వీటితో పాటు మట్టి, మొరం తవ్వకాలు ప్రభుత్వ, అటవీ భూముల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. గుట్టలతో పాటు ఇతర భూముల్లో తవ్వకాలను చేస్తున్నారు. అక్రమంగా తరలిస్తూ అమ్మకాలు చేస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న మట్టి, మొరం తవ్వకాలపై సాక్షాత్తు మైనింగ్‌శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ గ్రామాలతో సహా వివరాలను ప్రధాన కార్యదర్శికి పంపించారు. చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ వివరాలను క్రోడికరించి ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలోని పలు జిల్లాల కలెక్టర్‌లను మట్టి, మొరం, ఇసుక తవ్వకాలు జరగకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో అక్కడక్కడ ట్రాక్టర్‌లు, టిప్పర్‌లను సీజ్‌చేసినా ప్రతిరోజూ జరిగే తవ్వకాలపై దృష్టిపెట్టలేదు. జిల్లాలోని మోపాల్‌, నిజామాబాద్‌ రూరల్‌, ఎడపల్లి, మాక్లూర్‌, డిచ్‌పల్లి, బోధన్‌, రుద్రూర్‌, మోస్రా, నవీపేట, రేంజల్‌, నందిపేట, ఆర్మూర్‌, మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి, జక్రాన్‌పల్లి, వేల్పూర్‌, ముప్కాల్‌, బాల్కొండ మండలాల పరిధిలో ఎక్కువగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. మట్టి, ఇసుక, మొరం భారీగా తవ్వకాలు చేస్తున్నారు. జేసీబీలు, ఇతర వాహనాలను ఉపయోగించి తరలిస్తున్నారు. కిందిస్థాయి అధికారులందరికీ తెలిసినా పట్టించుకోవడంలేదు. చివరకు ‘ప్రజావాణి’లో ఫిర్యాదులు వస్తే కొంతమేర స్పందిస్తున్నారు. ఒకటి రెండు రోజులు చర్యలు తీసుకుని వదిలేస్తున్నారు. మండలస్థాయిలో అభివృద్ధి పనుల కోసం ఇసుక, మట్టి, మొరం తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నారు. ప్రభుత్వ పథకాల పేరు ఇస్తున్నా ఈ అనుమతులతో ప్రైవేట్‌కు ఎక్కువగా తరలిస్తున్నారు. ఈ తవ్వకాల్లో అధికార పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా ఉండడంతో అధికారులు కూడా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ తవ్వకాల్లో ఉన్నవారు కావాల్సిన వారికి డబ్బులు కూడా పెద్దఎత్తున ఇస్తుండడంతో చర్యలు చేపట్టడంలేదు.

   ఫ గుట్టలు మాయం..

జిల్లాలో పలు ప్రాంతాల్లోని గుట్టలు ఈ తవ్వకాల వల్ల మాయమయ్యాయి. గతంలో జిల్లాకు చెందిన కొంతమంది ఎన్‌జీటీలో కూడా ఫిర్యాదు చేశారు. రాష్ట్ర విజిలెన్స్‌ డీజీపీ కూడా ఫిర్యాదులను ఇచ్చారు. వారు దర్యాప్తుచేసి వెళ్లారు. అక్రమ తవ్వకాలను ఆపాలని కోరారు. కొన్ని ప్రాంతాల్లో రిజర్వ్‌ఫారెస్టు ఉన్న వదలకుండా తవ్వేస్తున్నారు. అటవీశాఖ అధికారులు కొన్నిచోట్ల చర్యలు చేపట్టినా ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో చూసిచూడనట్లు పోవడం వల్ల అటవీ ప్రాంతంలో చాలా గుట్టల్లో బొందలు కనిపిస్తున్నాయి. నగరం చుట్టూ ఏ గుట్టలు, చెరువులను చూసినా అన్ని బొందలే ఉన్నాయి. దేనిని తవ్వకాలకు వదలిపెట్టలేదు. మట్టి, మొరం కోసం మొత్తం తవ్వారు. పూర్తిస్థాయిలో అమ్మకాలు చేశారు. ప్రభుత్వం ఏదైనా అనుమతులు ఇచ్చిన గుట్టలు మినహా ఇతర ప్రాంతాల్లో తవ్వకాలను చేపట్టవద్దు. కానీ జిల్లాలో ఏ ప్రాంతం చూసినా భారీగానే తవ్వకాలను జరిపారు. ఎమ్మెల్సీ ఆదేశాలతో జిల్లాలో అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటే కొంతమొత్తంలో తవ్వకాలు ఆగే పరిస్థితి ఉంది. జిల్లాలో ప్రభుత్వ అవసరాలు మినహా వేరే ఎక్కడా తవ్వకాలు చేపట్టినా చర్యలు చేపడతామని కలెక్టర్‌ నారాయణరెడ్డి హెచ్చరించారు. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

అక్రమ తవ్వకాలపై  ఎమ్మెల్సీ సీరియస్‌

జిల్లాలో అక్రమ మైనింగ్‌ తవ్వకాలను నిలిపివేయాలని, అనుమతులు లేకుండా మట్టి, మొరం, ఇసుక తవ్వితే కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత ఆదేశించారు. కవిత కలెక్టర్‌ నారాయణరెడ్డితో మంగళవారం మాట్లాడారు. అక్రమ రవాణా చేసేవారిపై చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వ అవసరాలుంటే అనుమతులు మినహా అక్రమ తవ్వకాలు ఉంటే ఎవరినైనా వదిలిపెట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కలెకక్టర్‌ నారాయణరెడ్డి అక్రమార్కులపై చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నగరం చుట్టూ తవ్వుతున్న మట్టి, మొరం, ఇసుక అక్రమదారులపై చర్యలు తీసుకుంటామని ఆమెకు తెలిపారు. అధికారులతో కూడా సమీక్షించి ఎక్కడ మొరం, మట్టి తవ్వకాలు జరిగినా వాహనాలు సీజ్‌ చేయడంతో పాటు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నజర్‌ పెట్టాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 

Updated Date - 2022-06-22T08:01:48+05:30 IST