ltrScrptTheme3

జబీనా అప్పీలు.. తిరస్కరణ

Oct 17 2021 @ 00:38AM
గుంటూరులో ఆందోళన నిర్వహిస్తున్న టీడీపీ నేతలు నసీర్‌, జయలక్ష్మి తదితరులు

కలెక్టర్‌ కోర్టులోనూ దక్కని ఉపశమనం

38 పేజీలతో కలెక్టర్‌ ఉత్తర్వులు 


గుంటూరు(ఆంధ్రజ్యోతి), దుగ్గిరాల, అక్టోబరు 16: దుగ్గిరాల ఎంపీపీ పదవికి టీడీపీ అభ్యర్థి షేక్‌ జబీన్‌కి కలెక్టర్‌ కోర్టులో ఉపశమనం లభించలేదు. వారంపాటు విచారణ జరిపిన అనంతరం కలెక్టర్‌ ఆమె చేసుకొన్న అప్పీల్‌ని తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. శుక్రవారం సాయంత్రమే కలెక్టర్‌ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ బహిర్గతమయ్యాయి. దీనిపై జబీన్‌, ఆమె కుటుంబసభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ముస్లిం మైనార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమౌతున్నారు. తన అప్పీల్‌ని కలెక్టర్‌ తిరస్కరించడంపై తిరిగి హైకోర్టుని ఆశ్రయించనున్నట్లు జబీన్‌ తెలిపారు.  తనకు న్యాయం జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేని కేంద్ర ప్రభుత్వ కమిటీతో విచారణ జరిపించాల్సిందిగా కోరనున్నట్లు ఆమె వర్గీయులు తెలిపారు. దీనిపై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది వచ్చే వారంలో తెలిపోనుంది. 


ఆధారాలు నివేదించినప్పటికీ..

సీఎం జగన్‌కి సన్నిహితుడైన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ ఎన్నికల్లో మెజార్టీని సాధించింది. ఇక్కడ మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలుండగా తొమ్మిది ఎంపీటీసీలు గెలుపొందింది. జనసేన ఒక చోట, వైసీపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించాయి. జనసేన అభ్యర్థి టీడీపీ అండగా నిలిచారు. దీంతో 10 స్థానాలతో ఎంపీపీ పదవిని దక్కించుకొనేందుకు టీడీపీకి స్పష్టమైన  ఆధిక్యం ఉంది. అయితే ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడంతో కులధ్రువీకరణ పత్రం తప్పనిసరి. చిలువూరు సెగ్మెంట్‌-1 నుంచి గెలుపొందిన జబీనా కులధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోగా క్షేత్రస్థాయి విచారణ నిర్వహించకుండానే కేవలం ఆమె టీసీలో కులం నింపాల్సిన చోట ఖాళీగా ఉందని దుగ్గిరాల తహసీల్దారు తిరస్కరించారు. మరోవైపు తన తండ్రి రక్తసంబంధీకులు మొహమ్మద్‌ కులం పేరుతో బీసీ-ఈ, భర్త తరఫు కుటుంబ సభ్యులు షేక్‌ కులం పేరుతో బీసీ-ఈ కులధ్రువీకరణ పత్రాలు ఇదే తహసీల్దార్‌ కార్యాలయం ఇచ్చిందని, అందుకు ఆధారాలను జబీనా నివేదించింది. అయినప్పటికీ తహసీల్దార్‌ ఆమె అర్జీని తిరస్కరించడం వెనుక అధికార పార్టీ ఒత్తిళ్లున్నాయని ఆరోపణలు చేశారు. మరోవైపు ఎంపీపీ ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించడంతో జబీన్‌ హైకోర్టుని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు జబీన్‌ అప్పీల్‌ని పరిష్కరించాలని కలెక్టర్‌కి వారం గడువు ఇచ్చింది. అప్పటివరకు ఎలాంటి ఎన్నికల నోటిఫికేషన్‌ని జారీ చేయొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. 


ఇంచుమించు తహసీల్దార్లు చెప్పినవే..

హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ జబీనా, ఆమె లాయర్‌ని తన కోర్టులోకి అనుమతించి విచారణ జరిపారు. తెనాలి సబ్‌ కలెక్టర్‌తో క్షేత్రస్థాయి విచారణ జరిపించారు. కలెక్టర్‌ తన రిమార్కులలో ఇంచుమించు తహసీల్దార్‌ పేర్కొన్న సాంకేతిక కారణాలనే ఉటంకించారు. ప్రధానంగా జబీనా ద్వంద విధానాలను అవలంబిస్తున్నారు. తాను మొహమ్మద్‌ కులానికి చెందినదానిని ఒకవైపు పేర్కొంటూ మరోవైపు షేక్‌ కులం సర్టిఫికేట్‌ కోరుతున్నారని పలుమార్లు కలెక్టర్‌ తాను గుర్తించిన అంశాలుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముస్లిం తెగలకు చెందిన ఉపకులాలను బీసీ-ఈగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2007లో ఉత్తర్వులు ఇచ్చిందని, అయితే జబీనా 2010లో స్థానిక కేవీఎస్‌ హైస్కూల్‌ నుంచి తీసుకొన్న టీసీలో కులం ఉన్న చోట ఆ ప్రస్తావన లేదని, ఖాళీగా పెట్టారని తెలిపారు. మొహమ్మద్‌లు, షేక్‌లు ఒక్కటేనని ధ్రువీకరించే ఏ ఒక్క ఆధారాన్ని ఆమె చూపించలేకపోయారని ప్రస్తావించారు. అలానే తహసీల్దారు వద్ద తాను షేక్‌ అని చెప్పి మొహమ్మద్‌ అనేది కులం కాదని పేర్కొన్నారని తెలిపారు. మొహమ్మద్‌లు, షేక్‌లు ఒక్కటేనని ధ్రువీకరించే పత్రం కూడా లేదన్నారు. జబీనా తండ్రికి కూడా బీసీ-ఈ సర్టిఫికేట్‌ లేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తండ్రి కులం వారి సంతానానికి వస్తుందన్నారు. భర్త కులం భార్యకు రాదని స్పష్టం చేశారు. జబీనా చెబుతున్నట్లుగా ఎన్నికల సంఘం జారీ చేసే ఓటరు జాబితాలో ఎక్కడా కులం గురించి ప్రస్తావన ఉండదన్నారు. ఈ కేసులో జబీనా తాను పుట్టుకతో మొహమ్మద్‌ అని పేర్కొంటూ కులధ్రువీకరణ కోసం అర్జీని దాఖలు చేశారని, అది తిరస్కరించడంతో ఇప్పుడు షేక్‌ సర్టిఫికేట్‌ కోసం క్లెయిమ్‌ చేయరాదని కలెక్టర్‌ పేర్కొన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని జబీన్‌ అప్పీల్‌ని తిరస్కరిస్తున్నట్లు కలెక్టర్‌ ఉత్తర్వులు వెలువరించారు. 


30 రోజుల్లో ప్రభుత్వం వద్ద అప్పీల్‌కు అవకాశం

జబీనా అప్పీల్‌ని కలెక్టర్‌ తిరస్కరిస్తూ ఆమె 30 రోజుల వ్యవధిలో ప్రభుత్వం వద్ద ఈ తీర్పుపై అప్పీలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా కలెక్టర్‌ తీర్పుపై హైకోర్టులో సవాలు చేయనున్నట్లు జబీన్‌ తెలిపారు. ఈ దఫా తాము రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన వ్యవస్థలపై నమ్మకం లేదని చెబుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే అధికారులో కమిటీని నియమించి విచారణ జరిపించాల్సిందిగా కోరతామన్నారు. కాగా జబీన్‌ తండ్రి సోదరులు, ఆయన పిల్లలకు మొహమ్మద్‌ కులం పేరుతో బీసీ-ఈ సర్టిఫికేట్లను ఇదే తహసీల్దార్‌ కార్యాలయం ఎలా ఇచ్చిందనే దానిపై స్పష్టమైన వివరణని పేర్కొనలేదు. 

 

మైనారిటీ ద్రోహి జగన్‌రెడ్డి

టీడీపీ శ్రేణుల ఆందోళన

గుంటూరు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ముస్లిం మైనార్టీ బీసీ మహిళ షేక్‌ జబీనాకు కుల ధ్రువీకరణ పత్రం కలెక్టర్‌ తిరస్కరించటం దారుణమని.. ఈ చర్యతో సీఎం జగన్‌రెడ్డి మైనారిటీ  ద్రోహిగా మిగిలిపోయారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్‌ నసీర్‌ విమర్శించారు. కలెక్టర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద మహిళా నేతలు, మైనార్టీ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఇది ఒక్క జబీనాకు జరిగిన అన్యాయం కాదని యావత్‌ మైనారిటీల సమస్య అన్నారు. దీనిపై సోమవారం నుంచి ప్రతి జిల్లాలో  కలెక్టర్‌, తహసీల్దారు కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలానే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్‌ ముస్తాఫా కార్యాలయాన్ని  ముట్టడించే యత్నం చేశారు. దీనిని పోలీసుల అడ్డుకున్నారు. నసీర్‌తో పాటు నేతలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మైనారిటీ మహిళకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కును రాష్ట్ర ప్రభుత్వం హరిస్తోందని మండిపడ్డారు. సీఎం జగన్‌, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కలెక్టర్‌ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటరీ టీడీపీ మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, ప్రధానకార్యదర్శి రిజ్వానా బేగం, రావిపాటి సాయి,  మన్నవ వంశీ, నేతలు ఎల్లావుల అశోక్‌యాదవ్‌, జాగర్లమూడి శ్రీనివాస్‌, మహ్మద్‌ ఈబ్రహీం, ఎస్‌ఎస్‌పీ జాదా, షేక్‌ అఫ్రోజ్‌, మహ్మద్‌ రియాజ్‌, పఠాన్‌ జమీర్‌, హఫీజ్‌, ఖాసీం ఖాన్‌, ఇతర నేతలు పాల్గొన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.