పేద విద్యార్థులకు చేరని డిజిటల్ పాఠాలు

ABN , First Publish Date - 2021-07-08T05:42:50+05:30 IST

కరోనా విపత్తు వల్ల తెలంగాణలో ఈ విద్యా సంవత్సరం కూడా డిజిటల్ రూపంలోనే బోధన ఉంటుందని విద్యా శాఖ స్పష్టం చేసింది....

పేద విద్యార్థులకు చేరని డిజిటల్ పాఠాలు

కరోనా విపత్తు వల్ల తెలంగాణలో ఈ విద్యా సంవత్సరం కూడా డిజిటల్ రూపంలోనే బోధన ఉంటుందని విద్యా శాఖ స్పష్టం చేసింది. కానీ ఈ డిజిటల్ పాఠాలు ఎంత మంది విద్యార్థులకు అందుతున్నాయనేది పెద్ద ప్రశ్న. డిజిటల్ విద్యాబోధనకు ప్రతి విద్యార్థికి ల్యాప్ టాప్, స్మార్ట్ టివి, ట్యాబ్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, డాటా బాలెన్స్ కంప్యూటర్ గురించిన కనీస పరిజ్ఞానం, ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్పనిసరి. పాలకులు వీటిని సమకూర్చకుండా విద్య అందిస్తున్నామని ప్రకటించడం అర్థరహితం. 2020 సెప్టెంబరు నెల నుంచి డిజిటల్ విద్యాబోధన సాగుతున్నదని ప్రకటిస్తున్న విద్యాశాఖ ఎంత మంది విద్యార్థులు పాఠాలు వింటున్నారో, ఎంత మంది విద్యార్థుల ఇండ్లలో స్టార్ట్ టివి, ల్యాప్ టాప్, ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నదో ఎంత మందికి ప్రభుత్వం ద్వారా ఈ సౌకర్యాలు కల్పించారో శ్వేతపత్రం విడుదల చేయాలి. సర్కారు ప్రకటించిన టి-శాట్ చానల్ ఎందరి ఇండ్లలో ప్రసారం అవుతున్నది. ఎంత మంది విద్యార్థుల వద్ద టి-శాట్ తరగతుల టైమ్ టేబుల్ ఉన్నదో స్పష్టం చేయాలి. 2020-–21 విద్యాసంవత్సరంలో డిజిటల్ పాఠాలు వినే కనీస సౌకర్యాలు లేక వేలసంఖ్యలో విద్యార్థులు డ్రాపౌట్లుగా మారారు. కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, గురుకుల పాఠశాలలో ప్రతి తరగతిలో డ్రాపౌట్ విద్యార్థుల సంఖ్య 10 శాతం మించింది. వారంతా బాలకార్మికులుగా, యాచకులుగా, వ్యవసాయ కూలీలుగా, అర్ధ కార్మికులుగా మారుతున్నారు. ఈ పరిస్థితిని నివారించాలంటే ప్రతి టివి చానల్ రోజూ ఒక తరగతికి సంబంధించిన విద్యాబోధనను ప్రత్యక్ష ప్రసారం చేస్తే కొంతవరకు విద్యార్థులకు ఉపయోగకరం. ఇందుకు ప్రైవేటు ప్రసార సంస్థల యాజమాన్యాలను ఒప్పించి ట్రాయ్ నిబంధనలను సవరించే బాధ్యత ప్రభుత్వ టెలికాం, ప్రసారాల మంత్రిత్వ శాఖ తీసుకోవాలి. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని 5వ షెడ్యూల్ పరిధిలోని అటవీప్రాంతాలలో విద్యాబోధనకు పట్టణకేంద్రాల నుంచి కేబుల్ కనెక్టివిటీ అందించాలి. ఆదివాసులకు వారి స్థానిక భాషలో ఆన్‌లైన్ పాఠాలు బోధించేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలి. విద్యారంగానికి నిధుల కేటాయింపు పెంచాలి. 

కె.ఆనంద్

పిడిఎస్‌యు(విజృంభణ)

Updated Date - 2021-07-08T05:42:50+05:30 IST