ఝిగేల్‌మంటున్న డిజిటల్‌ మార్కెట్‌

ABN , First Publish Date - 2022-02-20T05:30:00+05:30 IST

ఎవరెన్ని విశ్లేషణలు ఇచ్చినా సరే, అంతిమంగా సినిమా అనేది ఓ వ్యాపారం. పెట్టుబడి ఎంత పెట్టాం? రాబడి ఎంత వచ్చింది? అనే లెక్కలు తేలాల్సిందే. రూపాయి పెడితే, మరో రూపాయి రాబట్టుకోవడానికే...

ఝిగేల్‌మంటున్న డిజిటల్‌ మార్కెట్‌

ఎవరెన్ని విశ్లేషణలు ఇచ్చినా సరే, అంతిమంగా సినిమా అనేది ఓ వ్యాపారం. పెట్టుబడి ఎంత పెట్టాం? రాబడి ఎంత వచ్చింది? అనే లెక్కలు తేలాల్సిందే. రూపాయి పెడితే, మరో రూపాయి రాబట్టుకోవడానికే... నిర్మాతలు పాట్లు పడేది. ఏ సినిమా చేసినా, ఎవరితో తీసినా... ఆ హీరో మార్కెట్‌ ఎంత? ఆ సినిమా చుట్టూ ఎన్ని రకాలుగా వ్యాపారం జరుగుతుంది? అనే విషయం ఆలోచించే నిర్మాతలు అడుగు వేయాలి. ఇది వరకు నిర్మాతలకు థియేటరికల్‌ రైట్స్‌ రూపంలోనే డబ్బులు వచ్చేవి. ఆంధ్రా, సీడెడ్‌, నైజాం... ఈ మూడు చోట్ల నుంచి వచ్చే రాబడే ప్రధాన ఆదాయ వనరు. ఆ తరవాత.... మార్కెట్‌ పక్క రాష్ర్టాలకు విస్తరించింది. ఓవర్సీస్‌ బిజినెస్‌ ఏర్పడింది. అలా... పెట్టుబడి తిరిగి రాబట్టుకునే మార్గాలు దొరికాయి. మెల్లగా శాటిలైట్‌ వచ్చింది. టీవీ ఛానళ్లు పెరిగిపోవడంతో.... వాటికంటూ ఫుటేజీ అవసరం అయ్యింది. దాంతో టీవీ ఛానళ్లన్నీ సినిమాలపై పడ్డాయి. తొలుత గంపగుత్తగా సినిమాలు కొనేశాయి టీవీ ఛానళ్లు. ఆ తరవాత పంథా మారింది. హీరో, వాళ్ల ఇమేజ్‌, స్టార్‌ కాస్టింగ్‌, క్రేజ్‌ ఆధారంగా చేసుకుని, శాటిలైట్‌ మార్కెట్‌ ఏర్పడింది.  


శాటిలైట్‌కి ఈ స్థాయి మార్కెట్‌ ఉందా? అంటూ నిర్మాతలే ఆశ్చర్యపోయేలా, హక్కులు అమ్ముడుపోయాయి. కథానాయకుడి పారితోషికం మొత్తం శాటిలైట్‌ నుంచి వచ్చేస్తాయి అనే ధీమా నిర్మాతల్లో వచ్చేది. కొంతమంది నిర్మాతలు పనిగట్టుకుని శాటిలైట్‌ కోసం సినిమాలు తీసేవారు. అలా.. ‘శాటిలైట్‌ స్టార్లు’ పుట్టుకొచ్చారు. ఓ హీరోకి రూ.3 కోట్ల రూపాయల శాటిలైట్‌ మార్కెట్‌ ఉందనుకోండి. ఆ హీరోతో రూ.2 కోట్లతో సినిమా పూర్తి చేసి, టీవీ ఛానళ్లకి అమ్మేసేవారు. అలా నిర్మాతకు రూ.కోటి లాభం దక్కేది. ఈ జిమ్మిక్కుల వల్ల టీవీ ఛానళ్లకు నాసిరకం సినిమాలు దక్కాయి. శాటిలైట్‌ కోసం టీవీ ఛానళ్ల బడ్జెట్‌ తడిసి మోపెడు అవ్వడం, ఆయా సినిమాల వల్ల పెద్దగా రాబడి లేదని తేలిపోవడంతో... కొంతకాలం టీవీ ఛానళ్లు సినిమా కొనడమే మానేశాయి. అలా.. ఒక్కసారిగా శాటిలైట్‌ మార్కెట్‌ ఢమాల్‌మంది. సినిమా విడుదలయ్యాక, ఆ సినిమా ఫలితం చూసి, అప్పుడు శాటిలైట్‌ హక్కులు కొనాలని చాలా ఛానళ్లు డిసైడ్‌ అయ్యాయి. ఇప్పటికీ అదే పంథా కొనసాగుతోంది. అయితే పెద్ద సినిమాలకు ఎప్పుడూ ఇలాంటి విషయాల్లో మినహాయింపులు ఉంటాయి. అగ్ర హీరోలు చిరంజీవి, మహేష్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌.. ఇలా స్టార్‌ సినిమా అంటే శాటిలైట్‌ డీల్‌ ముందే క్లోజ్‌ అయిపోతుంది. చిన్న సినిమాలకే చిక్కొచ్చిపడింది. వాటికి దాదాపుగా శాటిలైట్‌ ద్వారాలు మూసుకుపోయినట్టే.


ఓ తలుపు మూసుకుంటే, మరోటి తెరచుకుంటుందంటారు. సినిమాల విషయంలో అదే జరిగింది. ఎప్పుడైతే శాటిలైట్‌ మార్కెట్‌ డల్‌ అయ్యిందో, అప్పుడు.... ఓటీటీ మార్కెట్‌ ఓపెన్‌ అయ్యింది. నెట్‌ ఫ్లిక్స్‌, అమేజాన్‌, సోనీ, జీ 5, ఆహా, హాట్‌ స్టార్‌... ఇలా ఓటీటీ సంస్థల ప్రాబల్యం పెరిగింది. లాక్‌ డౌన్‌ సమయంలో.. థియేటర్లు లేని లోటుని ఓటీటీలు తీర్చాయి. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియని సందిగ్థంలో.. ఓటీటీలవైపు ఆకర్షితులయ్యారు నిర్మాతలు. ‘నిశ్శబ్దం’, ‘వి’, ‘టక్‌ జగదీష్‌’, ‘నారప్ప’, ‘దృశ్యం 2’ లాంటి చిత్రాలు నేరుగా ఓటీటీలోనే విడుదలయ్యాయి. చిన్న సినిమాలకు ఓటీటీ చక్కటి ప్రత్యామ్నాయ మార్గంగా మారిపోయింది. పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాలు నలిగిపోతాయన్న భయం లేదిప్పుడు. థియేటర్లు దొరక్కపోయినా, ఓటీటీ ఉందన్న భరోసా ఏర్పడింది. చిన్న సినిమాలు టీజర్లు, ట్రైలర్లతో బజ్‌ వచ్చేలా చేసుకుంటే చాలు. ఓటీటీలే ఆ సినిమాల్ని కొనడానికి ముందుకు వస్తున్నాయి. లాక్‌ డౌన్‌ సమయంలో దాదాపు 30 చిన్న సినిమాలు నేరుగా ఓటీటీలో వచ్చేశాయి. ఆయా సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా, ఓటీటీ హక్కుల ద్వారానే పెట్టుబడి రాబట్టుకోగలిగారు నిర్మాతలు. 


పే ఫర్‌ వ్యూ అనే మరో పద్ధతి కూడా ఉంది. ఓటీటీలు సినిమాల్ని కొనకపోయినా, వ్యూవర్‌ షిప్‌ పద్ధతిలో.. ఆయా సినిమాని ఎంత మంది చూశారు అనే అంకెని బట్టి, రాబడి వస్తుంది. ఇది కూడా.. నిర్మాతలకు లాభదాయకమైన మార్గమే.


‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’, ‘రాధే శ్యామ్‌’, ‘భీమ్లా నాయక్‌’ లాంటి సినిమాల్ని సైతం నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తారన్న ప్రచారం జరిగింది. నెట్‌ ఫ్లిక్స్‌ సంస్థ ‘భీమ్లా నాయక్‌’కి రూ.150 కోట్లకు కొనడానికి ముందుకొచ్చిందని చెప్పుకున్నారు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ టికెట్‌కు రూ.500 చెప్పున ఓటీటీలో ప్రదర్శిస్తారని అనుకున్నారు. అయితే ఇవేం కార్యరూపం దాల్చలేదు. తమ సినిమాల్ని కేవలం థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్మాతలు ఫిక్స్‌ అయి ఓటీటీ ఆఫర్లని తిప్పికొట్టారు. 


ఈమధ్య ఆడియో మార్కెట్‌కీ రెక్కలొచ్చాయి. ఇది వరకు.. ఆడియో కంపెనీలు చాలా తక్కువ రేటుకి పాటల హక్కుల్ని కొనేవారు. క్యాసెట్లు, సీడీల హవా పోవడంతో... పాటల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయింది. దాంతో.. ఆడియో కంపెనీలు నష్టాల బాట పట్టాయి. ఆడియో రైట్స్‌ దాదాపుగా శూన్యం అయిపోయిన తరుణంలో ఇప్పుడు వాటికీ రెక్కలొచ్చేశాయ్‌. యూ ట్యూబ్‌ వ్యూస్‌ రూపంలో.. ఆడియోకి జీవం వచ్చింది. ఓ పాట బాగుందన్న టాక్‌ వస్తే చాలు. యూ ట్యూబ్‌లో కోట్లాది వ్యూస్‌ వచ్చేస్తున్నాయి. చిన్న సినిమాలో పాట కూడా బాగా పాపులర్‌ అయిపోతోంది. ఒక్కో పాటకూ 10 కోట్ల వ్యూస్‌ వస్తున్న సందర్భాలు ఉన్నాయి. ‘సారంగ దరియా’లాంటి పాటలు.. యూ ట్యూబ్‌లో కొత్త రికార్డుల్ని సృష్టించాయి. ఇవన్నీ నిర్మాతలకు ఆదాయ వనరులే. పెద్ద సినిమా విడుదల అవుతోందంటే... ఆ పాటల హక్కుల్ని కైవసం చేసుకోవడానికి ఆడియో సంస్థలు పోటీ పడుతున్నాయి. స్టార్‌ హీరోల సినిమాలకు ఆడియో రూపంలోనే రూ.10 కోట్ల రూపాయలు వరకూ వస్తున్నాయి.


పూర్తిగా ‘జీరో’ అయిపోయిన మార్కెట్‌.. మళ్లీ కోట్ల రూపాయలు కురిపించడం.. నిజంగా చిత్రసీమకు ఉత్సాహం అందించే అంశమే. సిద్ద్‌ శ్రీరామ్‌, రామ్‌ మిరియాల, మంగ్లీ.. వీళ్లు పాడుతున్న పాటలు ఈమధ్య బాగా పాపులర్‌ అవుతున్నాయి. వాటి వ్యూస్‌ పెరుగుతున్నాయి. దాంతో ఆయా సినిమాలకు మంచి పబ్లిసిటీ ఏర్పడుతుంది. మరో వైపు నిర్మాతలకు డబ్బులూ వస్తున్నాయి. ఆడియో రైట్స్‌ రూపంలో ఆదాయం ఎప్పుడైతే పెరిగిందో, సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు నిర్మాతలు. క్వాలిటీ విషయంలో ఎవరూ రాజీ పడడం లేదు. కవర్‌ సాంగ్‌లూ, లిరికల్‌ వీడియోల హవా ఈమధ్య మరింత పెరిగింది. వాటి రూపంలో కూడా.. ఆదాయం భారీగానే వస్తోంది.


డబ్బింగ్‌ రైట్స్‌ కూడా ఈమధ్య బాగా పెరిగిపోయాయి.  ముఖ్యంగా హిందీ మార్కెట్‌ ఓపెన్‌ అయ్యింది. యాక్షన్‌, మసాలా సినిమాలకు హిందీ నాట గిరాకీ ఏర్పడింది. మన తెలుగు సినిమాలన్నీ బాలీవుడ్‌లో రిలీజ్‌ కాకపోవొచ్చు. కానీ... హిందీ డబ్బింగుల రూపంలో ప్రతీ ఇంటికీ చేరుతున్నాయి. అగ్ర హీరోలకే కాదు... గోపీచంద్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ లాంటి హీరోల చిత్రాలకు సైతం మంచి రేట్లు గిట్టుబాటు అవుతున్నాయి. మొత్తం బడ్జెట్‌లో కనీసం 20 శాతం హిందీ డబ్బింగుల రూపంలో రావడం విశేషం.


ఇదంతా చూస్తుంటే, థియేటరికల్‌ రైట్స్‌ రూపంలో వస్తున్న ఆదాయం కంటే, డిజిటల్‌ రైట్స్‌ రూపంలో నే ఎక్కువ ఆదాయం వస్తోందన్న విషయం స్పష్టమవుతోంది. భవిష్యత్తులో థియేటర్ల నుంచి ఆదాయం రాకపోయినా, డిజిటల్‌ మార్కెట్‌ నుంచే పెట్టుబడి మొత్తం తిరిగి రాబట్టుకోవచ్చన్న భరోసా ఏర్పడింది. నిజానికి ఈ పోకడ ఎంత కాలం అన్నది ఇప్పుడే చెప్పలేం. ఒకప్పుడు శాటిలైట్‌ హవా కూడా ఇలానే మొదలైంది. ఆ క్రేజ్‌ పీక్స్‌కి చేరింది. ఆ తరవాత.. ఒక్కసారిగా శాటిలైట్‌ మార్కెట్‌ కుప్పకూలింది. భవిష్యత్తులో డిజిటల్‌ క్రేజ్‌ కూడా ఇలానే ఉంటుందా.? లేదా.. ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తుందా అనేది పెద్ద ప్రశ్న. ఒకటి మాత్రం నిజం. డిజిటల్‌ మార్కెట్‌ అనేది బంగారు బాతు గుడ్డు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం నిర్మాతలదే. 

Updated Date - 2022-02-20T05:30:00+05:30 IST