బీఆర్‌ఏయూలో డిజిటల్‌ సేవలు

ABN , First Publish Date - 2022-08-07T05:40:37+05:30 IST

అంబేడ్కర్‌ యూనివర్సిటీలో విద్యార్థుల సౌలభ్యం కోసం డిజిటల్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని వీసీ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు తెలిపారు.

బీఆర్‌ఏయూలో డిజిటల్‌ సేవలు
విద్యార్థుల సమస్యలను ఫోన్‌లో వింటున్న వీసీ వెంకటరావు



  వీసీ ప్రొఫెసర్‌ వెంకటరావు
ఎచ్చెర్ల, ఆగస్టు 6: 
అంబేడ్కర్‌ యూనివర్సిటీలో విద్యార్థుల సౌలభ్యం కోసం డిజిటల్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని వీసీ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు తెలిపారు. వర్సిటీలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. యూజీసీ నిబంధనలు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సూచనల మేరకు ఈ విధానాన్ని తీసుకువచ్చామన్నారు. ఇప్పటి వరకు పరీక్షలు రాసేందుకు, సర్టిఫికెట్లు పొందేందుకు, తదితర వాటికి విద్యార్థులు డీడీ రూపంలో బ్యాం కుల్లో రుసుం చెల్లించేవారన్నారు. ఇక ఈ విధానానికి స్వస్తి పలుకుతున్నామన్నారు. ఈ విధానంతో సమయంతో పాటు, డీడీ చార్జీలు ఆదా అవుతున్నట్టు చెప్పారు వర్సిటీ, అనుబంధ విద్యార్థులు నెఫ్ట్‌ (ఆన్‌లైన్‌) విధానంలో చెల్లింపులు జరిగేలా మార్పుచేశామన్నారు. కళాశాలల యాజమాన్యాలు ఆర్టీజీఎస్‌ విధానంలో రుసుం చెల్లించుకోవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ ఆధీనంలోని నేషనల్‌ అకడమిక్‌ డిపాజిటరీ (ఎన్‌ఏడీ) అనే ఆన్‌లైన్‌ స్టోర్‌ హౌస్‌ అనే పోర్టల్‌లో వర్సిటీ, అనుబంధ విద్యార్థుల అకడమిక్‌ అవార్డ్స్‌ పొందుపరుస్తామన్నారు. ఈ పోర్టల్‌లో విద్యార్థుల ఒరిజనల్‌ డిగ్రీలు (ఓడీ), మార్కుల జాబితాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పటికే వర్సిటీలో 2015 నుంచి 2020 వరకు చదివి ఉత్తీర్ణులైన 39,400 మంది విద్యార్థుల ఓడీలు, మార్కులను పొందుపర్చామన్నారు. మరి కొద్ది రోజుల్లో 2021 సంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఓడీలు, మార్కుల జాబితాలు అందుబాటులో ఉంచుతామన్నారు. ఇకపై ఫలితాలు విడుదలైన వెంటనే ఈ పోర్టల్‌లో వివరాలు ఉంటాయన్నారు. వివిధ ప్రభుత్వ రంగ, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల కచ్చితత్వాన్ని ఎన్‌ఏడీ పోర్టల్‌లో ఆయా యాజమాన్యాలు తనిఖీ చేసుకోవచ్చునని తెలిపారు.


త్వరలో డిగ్రీ స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్ష ఫలితాలు
 అంబేడ్కర్‌ యూనివర్సిటీ అనుబంధ విద్యార్థుల డిగ్రీ స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్ష ఫలితాలను త్వరలో విడుదల చేస్తామని డీన్‌ డాక్టర్‌ ఎస్‌.ఉదయభాస్కర్‌ తెలిపారు. వర్సిటీలో శనివారం వీసీ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు పర్యవేక్షణలో డయల్‌ యువర్‌ యూనివర్సిటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది విద్యార్థులు ఏడాది కాల వ్యవధి గల డిగ్రీ స్పెషల్‌ డ్రైవ్‌ పరీక్ష ఫలితాలపై ఫోన్‌ ఇన్‌ లైవ్‌లో అడిగారు. ఇప్పటికే మూల్యాంకనం పూర్తిచేశామని, త్వరలో ఫలితాలు విడుదల చేస్తామని డీన్‌ తెలిపారు. ఎల్‌ఎల్‌బీ ఆరో సెమిస్టర్‌, డిగ్రీ, పీజీ కోర్సుల సెమిస్టర్‌ ఫలితాల విడు దలపై పలువురు విద్యార్థులు ఫోన్‌లో అడిగారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ ఏ రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-07T05:40:37+05:30 IST