నేను తప్పుడు ఫొటోను పోస్ట్ చేశాను, అందుకే డిలీట్ చేశాను : దిగ్విజయ సింగ్

ABN , First Publish Date - 2022-04-13T19:46:34+05:30 IST

మధ్య ప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో శ్రీరామ నవమి సందర్భంగా

నేను తప్పుడు ఫొటోను పోస్ట్ చేశాను, అందుకే డిలీట్ చేశాను : దిగ్విజయ సింగ్

భోపాల్ : మధ్య ప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో శ్రీరామ నవమి సందర్భంగా జరిగిన హింసాకాండపై తాను ఇచ్చిన ట్వీట్‌లో జత చేసిన ఫొటో మాత్రమే తప్పు అని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ సింగ్ చెప్పారు. ఈ ట్వీట్‌లో తాను ప్రశ్నలను మాత్రమే సంధించానని తెలిపారు.  ఆ ఫొటో ఖర్గోన్‌కు సంబంధించినది కానందువల్లే తాను ఈ పోస్ట్‌ను డిలీట్ చేశానని తెలిపారు. 


శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా మధ్య ప్రదేశ్‌లోని రెండు జిల్లాల్లో హింసాకాండ చెలరేగింది. ఖర్గోన్‌లో ఈ శోభాయాత్రలో పాల్గొన్నవారిపై ఓ వర్గానికి చెందినవారు రాళ్లు విసిరి, బీభత్సం సృష్టించారు. ఈ సంఘటనపై స్పందిస్తూ దిగ్విజయ సింగ్ ఇచ్చిన ట్వీట్‌పై విమర్శలు వస్తున్నాయి. ఆయనపై మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్, జబల్‌పూర్, నర్మద పురం, సాత్నాలలో మంగళవారం రాత్రి ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. 


ఈ నేపథ్యంలో దిగ్విజయ సింగ్ బుధవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, తాను ఇచ్చిన ట్వీట్‌లో కేవలం ప్రశ్నలను మాత్రమే సంధించానని చెప్పారు. ఈ ట్వీట్‌తో జత చేసిన ఫొటో ఖర్గోన్‌కు సంబంధించినది కానందువల్లే తాను ఈ పోస్ట్‌ను డిలీట్ చేశానన్నారు. తనపై లక్ష ఎఫ్ఐఆర్‌లు దాఖలైనా తాను మతతత్వంపై ప్రశ్నలను సంధించడం మానబోనని చెప్పారు. 


దిగ్విజయ సింగ్ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, కర్రలు, కత్తులు వంటి ఆయుధాలను పట్టుకుని ప్రదర్శన నిర్వహించడానికి ఖర్గోన్ అధికార యంత్రాంగం అనుమతి ఇచ్చిందా?  రాళ్ళు విసిరినవారు ఏ మతానికి చెందినవారైనప్పటికీ, వారి ఇళ్లపై నుంచి బుల్డోజర్లు వెళ్తాయా? నిష్పక్షపాతంగా ప్రభుత్వాన్ని నడుపుతామని ప్రమాణం చేసిన విషయాన్ని మర్చిపోవద్దు శివరాజ్ గారూ అని పేర్కొన్నారు. దీనికి ఆయన బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో జరిగిన సంఘటనకు సంబంధించిన ఫొటోను జత చేశారు. 


Updated Date - 2022-04-13T19:46:34+05:30 IST