అమిత్ షా, ఆరెస్సెస్ చేసిన సాయం మర్చిపోలేను.... డిగ్గీ రాజా

ABN , First Publish Date - 2021-10-01T00:31:39+05:30 IST

కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ అవకాశం దొరికినప్పుడల్లా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆరెస్సెస్‌పై

అమిత్ షా, ఆరెస్సెస్ చేసిన సాయం మర్చిపోలేను.... డిగ్గీ రాజా

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ అవకాశం దొరికినప్పుడల్లా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆరెస్సెస్‌పై నిప్పులు చెరుగుతూ ఉంటారు. అయితే, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. నాలుగేళ్ల క్రితం తన ‘నర్మద పరిక్రమ’ (తీర్థయాత్ర) సందర్భంగా అమిత్ షా, ఆరెస్సెస్ కార్యకర్తలు గొప్ప సాయం చేశారని దిగ్విజయ్ గుర్తు చేసుకున్నారు. 


దిగ్విజయ్ సింగ్ 2017లో తన భార్య అమృతతో కలిసి తీర్థయాత్ర చేపట్టారు. ‘‘ఒక రోజు రాత్రి 10 గంటల సమయంలో మేం గుజరాత్‌లోని గమ్యస్థానికి చేరుకున్నాం. అది అటవీ ప్రాంతం కావడంతో ముందుకెళ్లే దారిలేదు. పోనీ, ఆ రాత్రి అక్కడుందామా అంటే ఉండే సౌకర్యం లేదు’’ అని గుర్తు చేసుకున్నారు. తన దీర్ఘకాల సహచరుడు ఓపీ శర్మ రాసిన ‘‘నర్మద పాఠిక్’’ పుస్తకం ప్రారంభోత్సవం సందర్భంగా దిగ్విజయ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 


‘‘ఏం చేయాలో పాలుపోని స్థితిలో మేం ఆలోచిస్తున్న సమయంలో ఓ ఫారెస్ట్ అధికారి అకస్మాత్తుగా మా ముందు ప్రత్యక్షమయ్యారు. మాకు పూర్తిగా సహకరించాలని ఆదేశిస్తూ అమిత్ షా పంపారని ఆయన చెప్పగానే ఆశ్చర్యపోయాం’’ అని పేర్కొన్నారు. ‘‘ఎన్నికలు జరుగుతున్నాయి (గుజరాత్‌లో), దిగ్విజయ్ పెద్ద విమర్శకుడు. అయినప్పటికీ యాత్రలో మేం ఎలాంటి ఇబ్బంది పడకూడదని ఆయన (షా) చూసుకున్నారు. పర్వతాల మీదుగా దారిని కనుగొన్నారు. అంతేకాదు, మా అందరికీ ఆహారం సమకూర్చారు’’ అని దిగ్విజయ్ గుర్తు చేసుకున్నారు. 


30 సెప్టెంబర్ 2017న దిగ్విజయ్ 3 వేల కిలోమీటర్ల ‘నర్మద పరిక్రమ’ యాత్రను ప్రారంభించారు. నర్సింగ్‌పూర్ జిల్లాలోని బర్మన్ ఘాట్ నుంచి ప్రారంభమైన యాత్ర ఆరు నెలలపాటు కొనసాగింది. 


ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకు తాను షాను కలవలేదని, కానీ చేసిన సాయానికి పలు విధాలుగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూనే ఉన్నానని డిగ్గీరాజా చెప్పుకొచ్చారు. రాజకీయ సమన్వయం, సర్దుకుపోవడం, స్నేహానికి రాజకీయాలు, భావజాలం అడ్డం కాబోవనడానికి ఇదో ఉదాహరణ అని అన్నారు.


తాము భరూచ్ ప్రాంతం మీదుగా వెళ్తున్నప్పుడు ఆరెస్సెస్ కార్యకర్తలు తమ బృందానికి మాంఝీ సమాజ్ ధర్మశాలలో ఒక రోజు విడిది ఏర్పాటు చేశారని, తాము బస చేసిన గదిలో ఆరెస్సెస్ యోధులు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, మాధవరావ్ సదాశివరావ్ గోల్వాల్కర్ తదితరుల ఫొటోలు ఉండేవని దిగ్విజయ్ గుర్తు చేసుకున్నారు. కాబట్టి రాజకీయాలు, మతాలు వేర్వేరన్న విషయం ప్రజలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. తన తీర్థయాత్ర సందర్భంగా ప్రతి ఒక్కరి సాయం తీసుకున్నానని వివరించారు. 

Updated Date - 2021-10-01T00:31:39+05:30 IST