ఎటువైపు..

ABN , First Publish Date - 2022-05-22T06:24:10+05:30 IST

ఎటువైపు..

ఎటువైపు..

అంగలూరు డైట్‌ నుంచి వెనక్కి వస్తున్న అధ్యాపకులు

తిరిగి వచ్చే అధ్యాపకులకు ఖాళీలెక్కడ?

ప్రభుత్వ అనాలోచిత చర్యలతో అవస్థలు


అంగలూరులోని జిల్లా టీచర్స్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (డైట్‌)లో డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న అధ్యాపకులను ప్రభుత్వం సందిగ్ధంలోకి నెట్టింది. ఎవరికి వారు తమ యథాస్థానాలకు వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆయా స్థానాలు ప్రస్తుతం ఖాళీగా లేకపోవడంతో 18 మంది అధ్యాపకుల భవిత ప్రశ్నార్థకంగా మారింది. 


మచిలీపట్నం టౌన్‌, మే 21 : అంగలూరు పాఠశాలను జిల్లా టీచర్స్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌గా 1989లో ఏర్పాటు చేశారు. ఒక ప్రిన్సిపాల్‌, ఏడుగురు సీనియర్‌ లెక్చరర్లు, 16 మంది లెక్చరర్ల పోస్టులతో ఏర్పడిన  ఈ డైట్‌లో కేవలం ముగ్గురు సీనియర్‌ లెక్చరర్లు ఉండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత ఉన్న 18 మందిని డెప్యుటేషన్‌పై ఇక్కడ నియమించారు. అయితే, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల వీరిలో 12 మంది వెనక్కి  వచ్చే పరిస్థితి ఏర్పడింది. కేవలం తొమ్మిది మందితో అంగలూరు డైట్‌ నడిపే పరిస్థితి ఏర్పడింది. గణితంలో ఒక రెగ్యులర్‌ అధ్యాపకుడు ఉండగా, ఇద్దరు డిప్యుటేషన్‌పై వచ్చారు. వారిద్దరినీ వెనక్కి పంపుతున్నారు. ఈవీఎస్‌లో మూడు పోస్టులకు గానూ, ఒకరిని ఉంచి ఇద్దరిని వెనక్కి పంపుతున్నారు. సోషల్‌లో మూడు పోస్టులకు గానూ, ఒక రెగ్యులర్‌ అధ్యాపకుడు ఉండగా, ఇద్దరిని వెనక్కి  పంపుతున్నారు. సైన్స్‌లో మూడు పోస్టులకు గానూ, ఒకరిని ఉంచి ఇద్దరిని వెనక్కి పంపుతున్నారు. సైకాలజీలో రెండు పోస్టులకు గానూ, ఒక రెగ్యులర్‌ అధ్యాపకుడు ఉండగా, మరొకరిని వెనక్కి పంపుతున్నారు. ఫిలాసఫీలో రెండు పోస్టులకు గానూ, ఒకరిని ఉంచి మరొకరిని వెనక్కి పంపుతున్నారు. ఇంగ్లీషులో మూడు పోస్టులకు గానూ, ఒకరిని ఉంచి ఇద్దరిని పంపుతున్నారు. వృత్తి విద్యల్లో ఒకరు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో ఒకరిని యథాతథంగా ఉంచుతున్నారు. 

పోస్టులు తగ్గిస్తే ఇబ్బందులే..

అంగలూరు డైట్‌లో 24 పోస్టులను పది పోస్టులకు కుదించేందుకు ప్రభుత్వం అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడంతో విద్యావ్యవస్థ కుంటుపడే ప్రమాదం ఏర్పడుతోంది. మూడు దశాబ్దాలుగా ఇక్కడ ఉపాధ్యాయులకు ఇన్‌ సర్వీస్‌ ట్రైనింగ్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రాథమిక విద్యా పథకం, జిల్లా ప్రాథమిక విద్యా పథకంతో పాటు వివిధ పథకాలకు అంగలూరు డైట్‌ లెక్చరర్లు ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఒక మండలంలో ఇద్దరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. ఆ ఇద్దరు ఉపాధ్యాయులు మండలంలో మిగిలిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. అంతేకాదు.. ఐదేళ్ల పాటు ఉపాధ్యాయులే కృష్ణా తరంగాలు పత్రికలు కూడా నడిపారు. ఇలా డైట్‌లోని అధ్యాపకులతో పాటు సమాంతరంగా దశాబ్దాలపాటు సీనియర్‌, ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులు సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఖాళీ పోస్టుల్లో 18 మంది ఉపాధ్యాయులు డెప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఈ ఉపాధ్యాయులు వెనక్కి వెళ్తే అంగలూరు డైట్‌లో 200 మంది విద్యార్థులకు ఎవరు పాఠాలు బోధిస్తారనేది ప్రశ్నార్థకమే. అంతేకాకుండా టీచర్ల ఇన్‌ సర్వీస్‌ శిక్షణా తరగతులకు అంగలూరు డైట్‌లో మంగళం పాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇక పాఠశాలల విజిట్లు లేనట్టే..

అంగలూరు డైట్‌ లెక్చరర్లు ఇప్పటి వరకు పాఠశాలలు సందర్శిస్తూ, అక్కడి పనితీరును బేరీజు వేస్తూ ఉపాధ్యాయులకు చక్కటి మార్గదర్శకం చేసేవారు. ఇకపై డైట్‌ లెక్చరర్ల విజిట్‌లు రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. కేవలం అంగలూరు డైట్‌ ప్రీ టీచర్స్‌ ట్రైనింగ్‌గా మారిపోనుంది.

ఏమిటీ నిబంధనలు

జిల్లాలోని ప్రైవేట్‌ డైట్‌లకు ఒక నిబంధన, అంగలూరులోని ప్రభుత్వ డైట్‌కు మరో నిబంధన వర్తింపజేస్తున్నారు. విస్సన్నపేటలోని వికాస్‌ డైట్‌, గుడివాడలోని ఏఎన్‌ఆర్‌ డైట్‌లో విధిగా 24 పోస్టులు ఉండాలని నిబంధనలు విధించారు. ఒక ప్రిన్సిపాల్‌, 23 మంది లెక్చరర్లు ఉండాలని పేర్కొన్నారు. అయితే, అంగలూరు డైట్‌లో అందుకు భిన్నంగా ఒక ప్రిన్సిపాల్‌, తొమ్మిది మంది లెక్చరర్లు ఉంటే చాలని ఉత్తర్వులు జారీ చేశారు. డెప్యుటేషన్‌పై వచ్చిన టీచర్ల పోస్టులు ప్రస్తుతం ఖాళీగా లేవు. దీంతో వెనక్కి తిరిగి వెళ్లే టీచర్లను ఎక్కడికి పంపుతారనేది తెలియదు. అంతేకాకుండా డెప్యుటేషన్‌పై వెళ్లిన 18 మందిలో రెగ్యులర్‌ అధ్యాపకులు పోనూ మిగిలిన ఆరు ఖాళీ పోస్టుల్లో ఎవరిని ఉంచుతారనేది కూడా ప్రశ్నార్థకమే.


నా పోస్టు ఖాళీగా లేదు

భోగిరెడ్డి పల్లి హైస్కూల్‌లో మ్యాథ్స్‌ టీచర్‌గా పనిచేస్తూ అంగలూరు డైట్‌కు డెప్యుటేషన్‌పై తీసుకున్నారు. కలెక్టర్‌, డీఈవో, డైట్‌ ప్రిన్సిపాల్‌తో ఏర్పడిన కమిటీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ప్రస్తుతం భోగిరెడ్డిపల్లిలో మ్యాథ్స్‌ టీచర్‌ పోస్టు ఖాళీగా లేదు. ఇంకెక్కడికి పంపుతారో ఏమో.

- రమేశ్‌, మ్యాథ్స్‌ టీచర్‌ 


నా పరిస్థితి ఏంటో..?

తోట్లవల్లూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ అంగలూరు డైట్‌కు వెళ్లాను. ఇప్పుడు ఆ హెడ్‌మాస్టర్‌ పోస్టును ఎయిడెడ్‌ హెచ్‌ఎంతో భర్తీ చేశారు. ఆ పోస్టు ఖాళీగా లేదు. నన్ను ఎక్కడకు పంపుతారో ఏమో. - లలితా మోహన్‌, టీచర్‌ 

Updated Date - 2022-05-22T06:24:10+05:30 IST