దిక్కుతోచని మిర్చి రైతు

Published: Fri, 12 Aug 2022 00:42:33 ISTfb-iconwhatsapp-icontwitter-icon
దిక్కుతోచని మిర్చి రైతు

తామర పురుగు తిప్పలు తప్పేదెట్లా...

ఇప్పటికే ఇతర పంటల్లో పురుగు అవశేషాలు

గత ఏడాది తామర పురుగు తెగుళ్లతో అపార నష్టం

ఆత్మహత్యలు చేసుకున్న మిర్చి రైతులు

వ్యాపారులకు లాభాలు.. రైతులకు నష్టాలు

మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటుపై దృష్టి పెట్టని ప్రభుత్వం


ఓరుగల్లు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మిర్చి రైతులు అయోమయంలో ఉన్నారు. వరి, పత్తి తర్వాత ప్రత్యామ్నాయంగా రైతులు మిర్చి పంటను పెద్ద ఎత్తున రాష్ట్రంలో సాగు చేస్తున్నారు. అదే స్థాయిలో వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో కూడా మిర్చి పంటను సాగు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం మిర్చి పంటకు మంచి గిట్టుబాటు ధర రావడంతో రైతులు మిర్చి సాగు చేసేందుకు మొగ్గు చూపారు. ఫలితంగా సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువ పెరిగింది. పంట కూడా ఏపుగానే పెరిగింది. ఇంకేముంది రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆ సంతోషం ఎంతో కాలం నిలువలేదు. 


అంతుచిక్కని తెగుళ్లు మిర్చి పంటను ఆశించాయి. ఎన్ని రకాల మందులు వాడినా తగ్గలేదు. తామర పురుగు తెగులు అని శాస్త్రవేత్తలు, ఉద్యానవన శాఖాధికారులు తేల్చారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టిన మిర్చి రైతులు దిగాలు పడ్డారు. చేసేదేమి లేక కొంత మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ వానా కాలంలో మిర్చి పంట సాగు చేయాలా.. వద్దా.. అన్న డోలాయమాన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ వరి సాగు చేయొద్దని ప్రభుత్వం చెబుతోంది.  ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల్లో మిర్చి పంటను సాగు చేస్తే తామర పురుగు సర్వనాశనం చేస్తోంది. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు.


తామర పురుగు అస్తిత్వం

మిర్చి వాణిజ్య పంటగా రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాలు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నాయి. తామర పురుగు దెబ్బతో ఈ జిల్లాలో ఒక్కసారిగా విస్తీర్ణం తగ్గిపోయిందని ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు. గత ఏడాది మిర్చి పంట కాపుకొచ్చే సమయంలో ప్రత్యక్షమైన తామరు పురుగు పంటను నాశనం చేసింది. ఎన్ని రకాల మందులు పిచికారి చేసినప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. దాదాపు 70 మంది వరకు ఒక్క ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా కార్యదర్శి బీరం రాములు చెబుతున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాతనే తాము ఈ లెక్కలు చెబుతున్నామని రాములు స్పష్టం చేస్తున్నారు. 


ఇంత పెద్ద సంఖ్యలో మిర్చి రైతులు ఆత్మహత్యలకు పాల్పడడంతో కదిలిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ బెంగళూరు, రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గత ఏడాది నవంబరులో వరంగల్‌, మహబూబాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించింది.. తామర పురుగు ఆశించిన మిర్చి పంటల నుంచి నమూనాలు సేకరించారు. దాదాపు పది రకాల తెగుళ్లను గుర్తించారు. కొత్త రకం తామర పురుగులు ఒక్కో మిర్చి పువ్వులో 20 నుంచి 30 ఉన్నట్టు గుర్తించారు. అధిక వర్షాలతో పాటు ఎక్కువ మోతాదులో రసాయనికి ఎరువులను వాడడం వల్ల తామర పురుగులకు సహజ శత్రువులైన పురుగులు చనిపోవడమే కాకుండా నిరోధక శక్తి లభిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


తామర పురుగు యాజమాన్య పద్ధతులను రైతాంగానికి అందించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ఉన్నామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కూరగాయలు ముఖ్యంగా వంకాయలు, మునగ తదితర పంటల్లో తామర పురుగు తెగుళ్లను గుర్తించామని చెబుతున్నారు. సస్యరక్షణ పద్ధతులు చేపట్టినప్పటికీ తామర పురుగు ఈసారి ఎలాంటి ఉధృతి చూపిస్తుందో ముందస్తుగా తాము కూడా చెప్పలేమని ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు.


వ్యాపారులకు లాభాలు.. రైతులకు నష్టాలు

రైతుల కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు రూపొందిస్తాయి. ఆచరణలో మాత్రం అవి వ్యాపారులకు ప్రయోజనాలు కలిగిస్తాయన్న విమర్శలు ఉన్నాయి. మిర్చి రైతుల విషయంలో అదే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్‌లలో కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేశారు. సీజన్‌లో గిట్టుబాటు ధర లేనప్పుడు వాటిని కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసుకునే సదుపాయం ఉంటుంది. అంతేకాకుండా నిల్వ చేసుకున్న పంటపై రుణ సదుపాయం కూడా లభిస్తుంది. గత సీజన్‌లో మిర్చి క్వింటాల్‌కు రూ.15వేల నుంచి రూ.18వేల వరకు ధర పలికింది. ఇటీవలి కాలంలో అంటే ఏప్రిల్‌, మే నెలలో మాత్రం రెట్టింపు ధర పలికింది. కొన్ని రకాల మిర్చికి మాత్రం క్వింటాల్‌కు ఏకంగా రూ.50వేలు పలికింది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమంటే.. కోల్డ్‌ స్టోరేజీలో నిల్వ చేసుకున్న వారి రైతుల పేరుతో వ్యాపారులే ఉంటారు. ధరలు పెరిగినప్పుడు వారికే లాభాలు దక్కుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి రైతుల పేరుతో వ్యాపారులు చేసే దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఉందని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.


మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి

మన దేశానికి స్వాతంత్య్రం రాకముందే వరంగల్‌ జిల్లాలో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. 1933 సంవత్సరంలో ఆరెపల్లి సమీపంలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. అనేక కొత్త వరి వంగడాలను సృష్టించి దేశంలోనే పేరు సంపాదించారు. వరిలో వ్యయం తగ్గించే సేద్య పద్ధతులను రూపొందించారు. వరి, పత్తి, పప్పు ధాన్యాల సాగుకు సంబంధించి అనేక కొత్త పద్ధతులను రైతాంగానికి అందించారు. దాదాపు 600 క్వింటాళ్ల విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నారు. వరంగల్‌ జిల్లాలో పత్తి, వరి తర్వాత మిరప పంటను అధికంగా రైతులు పండిస్తున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రత్యేకమైన రకాలను పండించడంలో జిల్లా రైతాంగం ముందున్నది. మిరప పంటకు సంబంధించి రైతాంగం మరిన్ని మెలకువలు తెలుసుకుని అధిక ఉత్పత్తిని సాధించాలంటే మిరప పంటకు సంబంధించిన ప్రత్యేక పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.


ప్రత్యేక సూచనలు ఇస్తున్నాం : శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్‌, ఉద్యానవన శాఖ

మిర్చి పంటలో బీభత్సం సృష్టించిన తామర పురుగు ఇప్పటికే కూరగాయల పంటల్లో కనబడుతోంది. అయినప్పటికి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రైతులకు ప్రత్యేక జాగ్రత్తలు సూచిస్తున్నాం. మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. ఈ ప్రాం తంలో వచ్చే సరికొత్త తెగుళ్లపై పరిశోధన జరుగుతుంది. సరికొత్త వంగడాలు వస్తాయి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.