ఉమేష్‌ పోలీస్‌ క్రిమినల్‌

Published: Fri, 07 Feb 2020 17:28:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఉమేష్‌ పోలీస్‌ క్రిమినల్‌

బ్లాక్‌ మెయిల్‌కు బెదరను... నేను ముక్కోపిని కాదు

పోస్టింగుల కోసమే శంకర్రావు బ్లాక్‌మెయిల్‌

డీజీపీని అవుతానని 1997లోనే తెలుసు

జ్యోతిషం ఒక సైన్స్‌.. అందులో నేను పండితుడిని

22-10-12న ఓపెన్‌ హార్ట్‌లో డీజీపీ దినేష్‌ రెడ్డి


మీ నేపథ్యం?

మాది నెల్లూరు జిల్లాలో తీర ప్రాంతగ్రామం. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో, కాలేజీ మద్రాసులో.. పీజీ ఢిల్లీలో చేశాను. ఢిల్లీలో అందరూ ఐపీఎస్‌కు ప్రిపేరవడం చూసి, నేనూ చేయాలని నిర్ణయించుకున్నా. సేవ చేయడానికి వీలవుతుందని చెప్పి మా నా న్నను ఒప్పించా. మాది జమీందారీ కుటుంబం. నలుగురు అక్కలు, ఒక తమ్ముడు. మా కుటుంబంలో నేనే మొదటి ప్రభుత్వోద్యోగిని. నాకు ఇద్దరు కుమార్తెలు.


మీకు కుటుంబానికి హైదరాబాద్‌లో భారీగా భూములు, ఆస్తులు ఉన్నాయంటారు?

అది సరికాదు. మా కుటుంబానికి మొదట్లో ఉన్న భూములే కొనసాగుతున్నాయి. ఒకటీ అరా కొనడం తప్పించి, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమేమీ చేయడం లేదు.


మీకు ముక్కుసూటి, ముక్కోపి అనే పేరుంది..

ముక్కుసూటిగా వ్యవహరించడం కరక్టే. కానీ, కోపం రావడం అనేది సరికాదు. ఏ సంస్థలోనైనా కింది ఉద్యోగులు అనుకున్న పోస్టింగ్‌ పొందలేకపోతే.. పైవాళ్ల మీద బుర ద జల్లుతుంటారు. రకరకాల విమర్శలకు దిగుతారు. నేను డీజీపీ అయిన తర్వాత.. అందరినీ కలుపుకొని పోతున్నాను. కానీ, అర్హతలను బట్టే పోస్టింగ్‌లు ఇస్తున్నాను. నా వల్ల న్యాయం జరుగుతోందని డిపార్ట్‌మెంట్‌లో కూడా అనుకుంటున్నారు.


ఉమేష్‌కుమార్‌ వ్యవహారంలో వివాదం?

ఆయన సాధారణ క్రిమినల్‌ కాదు. పెద్ద అవినీతిపరుడు. ఒక ఎంపీ సంతకాన్ని ఫో ర్జరీ చేసి.. నన్ను డీజీపీని కాకుండా చేయడానికి ప్రయత్నించడం చాలా దారుణం. అతడిని పోలీస్‌ క్రిమినల్‌ అని చెప్పొచ్చు. ఆయన చేసిన పనికి ఎప్పుడో అరెస్టు చేసి జైల్లో పెట్టాలి. కానీ, పెద్ద మనసుతో వదిలేశాం. కానీ, తప్పు చేసినప్పుడు శిక్షించకపోతే.. మ రింత చెలరేగుతారు. అది డిపార్ట్‌మెంట్‌కు చెడ్డపేరు తెస్తుంది. అందుకే చార్జిషీట్‌ వేసి.. బాధ్యత కోర్టుకు అప్పగించాం. ఉమేష్‌ను వదిలేయాలని కొందరు వచ్చి అడిగారు.


పోలీసు అధికారుల మధ్య ఇన్ని వైరుధ్యాలు ఎందుకొస్తున్నాయి?

పోలీసుశాఖలో కీలకమైన పోస్టులు చాలా తక్కువ. ఆ పోస్టులకు ఎక్కువ మంది అర్హులు ఉంటున్నారు. అందువల్ల ఆ పోస్టు రావడం కోసం.. ముందున్నవారిపై దు మ్మెత్తి పోయడం, ఏవైనా అంశాలు లీక్‌ చేయడం వంటివి చేస్తుంటారు. ఇది రాజకీయా ల కంటే దారుణంగా తయారైంది. ప్రతీ రాష్ట్రంలో పోలీస్‌శాఖ పరిస్థితి ఇలాగే ఉంది.


కీలక పదవుల్లో ఉన్నవారిపై తీవ్ర ఆరోపణలున్నాయి?

అలాంటివారిని గమనించి వీలైనంత వరకు చెప్పి, హెచ్చరించి చూస్తున్నాం. లేకపోతే.. బదిలీ చేస్తున్నాం. ఐజీ, అడిషనల్‌ డీజీ స్థాయి అధికారుల పేర్లు కూడా బయటి కి వస్తున్నాయి. లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డీజీ హుడాపై ఆరోపణలు అవాస్తవం. వాటి ని వెరిఫై చేసి కూడా చూశాం. ఆయన ట్రాక్‌ రికార్డు బాగుంది. ఇక సీబీసీఐడీ అడిషన ల్‌ డీజీ రమణమూర్తి ఇప్పుడు ఇంతకుముందులా వ్యవహరించడం లేదు. కట్టడి చేశాం.


పోలీసుశాఖలో క్రమశిక్షణా రాహిత్యం ఎందుకు పెరుగుతోంది?

కొన్ని సార్లు సిబ్బంది డిమాండ్లను తీర్చలేకపోతే.. వారు అనుకున్న రీతిలో స్పందించకపోతే.. విచ్చలవిడిగా బయటపడడం మొదలుపెడతారు. అలా చేయడం వల్ల ఏదో ఒక లాభం ఉంటుందని వారు భావించడమే దానికి కారణం. ఇలాంటివాటిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. కానిస్టేబుల్‌ అయినా నేరుగా వచ్చి నన్ను కలవొచ్చు.


అవినీతి పెరిగిపోవడానికి కారణం?

అది 21వ శతాబ్ధం పరిణామం కావొచ్చు. జీవన వ్యయం, ఆశలు పెరిగిపోయాయి. దాంతో అవినీతికి పాల్పడడం మొదలైంది. నిజాయితీగా ఉండాలని అకాడమీల్లో బోధి స్తున్నాం. ఇటీవల డైరెక్ట్‌గా రిక్రూట్‌ అయిన ఇద్దరు డీఎస్పీలను అవినీతి వల్లే సర్వీస్‌ నుంచి తొలగించాం. తప్పు చేస్తే ఐపీఎస్‌ అధికారైనా క్షమాభిక్షకు అర్హుడు కాదు. పోలీస్‌ శాఖలో అవినీతి 0.03శాతం కన్నా తక్కువే. సీఎం కిరణ్‌ అవినీతిని సమర్థంగా నియంత్రిస్తున్నారు. ఆయన, నేను కలిసి పోలీసు శాఖలో మార్పులు తీసుకొస్తున్నాం.

ఉమేష్‌ పోలీస్‌ క్రిమినల్‌

పోలీస్‌శాఖ ప్రతీ వారికీ అవసరం. కానీ, చెడు ఇమేజ్‌ ఎక్కువగా ఉంది?

‘మన దగ్గరకు వచ్చేవారు ఎన్నో సమస్యలతో వస్తారు. వారు చిరునవ్వుతో తిరిగివెళ్లేలా చూడాలి’ అని సిబ్బందికి తరచూ చెబుతున్నాం. ఎఫ్‌ఐఆర్‌ తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించాం. తమకంటూ మంచి వ్యక్తిత్వం ఉన్నప్పుడే ప్రజల నుంచైనా, రాజకీయ నాయకులు నుంచైనా విలువ పెరుగుతుంది. ఎవరినీ సంప్రదించకుండా.. ఎక్కడో దూరంగా క్యాంపులు ఏర్పాటు చేయడం వంటివాటివల్ల ఏపీఎస్పీ బెటాలియన్‌లో తిరుగుబాటు వచ్చింది. దీనిపై తగిన చర్యలు తీసుకున్నాం.


దానం నాగేందర్‌ వివాదం?

ఆయనపై కేసులు పెట్టాం. విచారణ సాగుతోంది. పది మంది దోషులు తప్పించుకున్నా.. ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదనే విధానం మేరకు సరైన ఆధారాల కోసం చూస్తున్నాం. అధికార పార్టీ వాళ్లకు కొన్ని రకాల లాభాలు ఉంటాయి.


వ్యాస్‌ హత్య ఎలా జరిగింది

నేను, వ్యాస్‌ ఇద్దరం కలిసి సాయంత్రం హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో జాగింగ్‌ చేసేవాళ్లం. కొద్ది రోజుల తర్వాత ఆయన ఎల్బీ స్టేడియంలో జాగింగ్‌ చేద్దామని పిలిచారు. అక్కడ రెండ్రోజులు జాగింగ్‌ చేశాం. అప్పటికే వ్యాస్‌ హత్యకు కుట్రపన్నినట్లుగా ఇంటలిజెన్స్‌ కూడా హెచ్చరించింది. కానీ, ఆయన పట్టించుకోలేదు. మూడోరోజు కాస్త ఆయాసంగా ఉండడంతో.. జాగింగ్‌ చేయకుండా మైదానం గేటు వద్దే ఆగి, అక్కడే ఉన్న వ్యాస్‌ భార్యతో మాట్లాడుతున్నాను. కొద్దిసేపటికి టపటపమని చప్పుళ్లు వినిపించాయి. అక్కడున్న వారంతా ఎవరో టపాసులు పేలుస్తున్నారనుకున్నారు. కానీ, నేను చూసేసరికి మైదానం అవతలి చివర వ్యాస్‌ను ఎవరో ఐదుగురు వ్యక్తులు చుట్టుముట్టి దగ్గరి నుంచి కాల్పులు జరుపుతున్నారు. వెంటనే సెక్యూరిటీని పిలుస్తూ.. అటువైపు పరుగెత్తాను. ఆ లోపే వారు బాంబు విసిరి పారిపోయారు. మేం వెళ్లేసరికే వ్యాస్‌ మరణించారు. ఆయన్ను వెంటనే నా కార్లోనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. అంతదూరంలో ఉన్నవారిని చూసి, గుర్తుపట్టే అవకాశం లేదు. ఆ సమయంలో వ్యాస్‌ భార్య కూడా అక్కడే ఉన్నారు. కోర్టు కూడా మమ్మల్ని ప్రత్యక్ష సాక్షులుగా పిలవలేదు. కానీ, ఈ ఘటనలో నా నిర్లక్ష్యం ఉందంటూ.. ఒకరిద్దరు రాజకీయ నాయకులు సహా చాలా మంది నాపై ఆరోపణలు చేశారు.ఎస్పీని బంధించిన కానిస్టేబుల్‌ వివాదంపై...

పోలీసుశాఖ ట్రాన్స్‌పోర్ట్‌ విభాగం ఎస్పీని బంధించిన ఘటనలో.. ఆ రోజు ఇచ్చిన హామీ మేరకు కానిస్టేబుల్‌ శర్మను వెంటనే అరెస్టు చేయలేదు. కానీ, శాఖాప రమైన విచారణలో చాలా విషయాలు బయటపడ్డాయి. దాంతో ఆయనను తప్పించాం. ఇక ఆ ఘటనలో ఎస్పీ పాత్ర మీద కూడా నివేదికను ప్రభుత్వానికి నివేదిక పంపాం. త్వరలో ఆయనను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు వెలువడొచ్చు.


శంకర్‌రావు మీ వెంట ఎందుకు పడ్డారు?

మా ఇద్దరిదీ చాలా పాత పరిచయం. కొన్ని సీఎస్‌, ఏసీపీ పోస్టింగుల గురించి అడిగారు. కానీ, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం. అప్పటి నుంచీ శంకర్‌రావు బుర ద జల్లడం మొదలుపెట్టారు. మరో ఎంపీ కూడా కొన్ని కారణాలతో నాపై అవినీతి ఆరోపణలు చేశారు. వారికి నోటీసులు ఇవ్వాలనుకుంటున్నాం. సరైన సమాధానం రాకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రశ్నే లేదు.


మీలో మీకు నచ్చిన క్వాలిటీ?

‘కట్టె కొట్టె తెచ్చె’ అన్నట్లుగా నా వ్యవహారం ఉంటుంది. నా సూచనలను తప్పనిసరిగా పాటించాలని భావిస్తా. డొంకతిరుగుడు నాకు నచ్చదు. మహిళలు, వృద్ధులు, బలహీన వర్గాలు నా దగ్గరికి వచ్చినప్పుడు.. వారికి వెంటనే న్యాయం చేసే ప్రయత్నాలు చేస్తే ఆనందంగా ఉంటుంది.


మీరు తెలంగాణ వ్యతిరేకి అనే ఆరోపణలు?

నిరసన తెలిపే హక్కుకు మేం వ్యతిరేకం కాదు. చేసే విధానం సరికానప్పుడే.. కల్పించుకుంటాం. తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇచ్చాం. మితిమీరినప్పుడే పోలీసులు రంగప్రవేశం చేయాల్సి ఉంటుందని ముందే చెప్పాం.


మీ చేతి ఉంగరాల కథేమిటి?

నేను జ్యోతిష శాస్త్రం నేర్చుకున్నాను. జ్యోతిషాన్ని బాగా నమ్ముతాను. ఇది వందశాతం సైన్స్‌. తూర్పుగోదావరి ఎస్పీగా ఉన్నప్పుడూ, హైదరాబాద్‌లోనూ జ్యోతిష పండితుల వద్ద శిక్షణ తీసుకున్నాను. జ్యోతిషం ప్రకారమే ఈ ఉంగరాలు ధరించాను. నేను రాష్ట్ర పోలీసు అధికారిని అవుతానని 1997లోనే జ్యోతిషంలో తేలింది. దేవుడిని నమ్ముతాను. కానీ, బాబాలను నమ్మను. వాస్తుశాస్త్రంలోనూ ప్రవేశం ఉంది. మనిషి పుట్టుక, పెళ్లి, చావు... ఈ మూడింటిని తప్ప మిగతా అంశాలెన్నింటినో.. గ్రహగతులకు అనుగుణంగా నిర్ణయించుకోవచ్చు.


మీ ఇష్టాలు?

ప్రయాణాలు నాకు చాలా ఇష్టం. అన్ని ఖండాల్లో కలిపి 90 దేశాలను సందర్శించా. చదవడం, పొలాల్లో తిరగడం, సముద్రపు ఒడ్డునగడపడం, గుర్రపుస్వారీ అన్నా ఇష్టం.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.