రామునిపట్ల చెక్‌డ్యాంలో ముంచాలి

ABN , First Publish Date - 2022-09-26T05:30:00+05:30 IST

ఢిల్లీలో కూర్చున్న కొందరు నాయకులు ‘‘కాళేశ్వరంతో ఒక్క ఎకరం కూడా పారలేదని, కాళేశ్వరంతో ఏం లాభమని’’ అంటున్నారని వారిని తీసుకొచ్చి రామునిపట్ల చెక్‌డ్యాంలో ముంచాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

రామునిపట్ల చెక్‌డ్యాంలో ముంచాలి
చిన్నకోడూరు మండలం రామునిపట్లలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

కేంద్రంలో ఉన్న బీజేపీ చేత కాని ప్రభుత్వం

కాంగ్రెస్‌ అంటే కాలిపోయే మోటార్లు,  పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు

పేదలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు


 చిన్నకోడూరు, సెప్టెంబరు 26: ఢిల్లీలో కూర్చున్న కొందరు నాయకులు ‘‘కాళేశ్వరంతో ఒక్క ఎకరం కూడా పారలేదని, కాళేశ్వరంతో ఏం లాభమని’’ అంటున్నారని వారిని తీసుకొచ్చి రామునిపట్ల చెక్‌డ్యాంలో ముంచాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గత యాసంగిలో ఎంత ఇబ్బందైనా రైతులు పండించిన ప్రతిగింజను కొనుగోలు చేసి, వారంలో రైతుల ఖాతాల్లో డబ్బు జమచేశామన్నారు. సోమవారం చిన్నకోడూరు మండలం రామునిపట్లలో నూతన గ్రామ పంచాయతీ, మహిళా సమాఖ్య భవనం, ఓహెచ్‌ఎ్‌సఆర్‌ వాటర్‌ ట్యాంకు, డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించి 20 మంది లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అని ఆయన మండిపడ్డారు.  కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన వడ్లు కొనుగోలు చేయకుండా చేతులెత్తే ప్రయత్నం చేసిందన్నారు. గతంలో పని దొరక్క బతకడానికి హైదరాబాద్‌, ముంబాయి, దుబాయికి వెళ్లేవారని, కానీ ఇప్పుడు పని కోసం పక్క రాష్ట్రం వాళ్లు మన రాష్ర్టానికి వస్తున్నారని చెప్పారు. రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంటు, కాళేశ్వరం నీటితో రెండు పంటలు పండుతున్నాయని చెప్పారు. గురి కుదిరింది కనుక భూమి ధరలు పెరిగాయన్నారు. రెండు పంటలు పక్కాగా పండేట్లు సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పక్కాగా చేసిందన్నారు. చైనా, పాకిస్థాన్‌ వంటి దేశాల్లో కరువు వచ్చి అక్కడ పంట పండక తెలంగాణ బియ్యానికి మంచి గిరాకీ వచ్చిందని కేసీఆర్‌ సంతోషపడ్డారని, కానీ కేంద్ర ప్రభుత్వం నూకలను విదేశాలకు ఎగుమతి చేయకుండా నిషేధించిదని, విదేశాలకు బియ్యం ఎగుమతి చేస్తే 20 శాతం సుంకం విధించిందని మంత్రి ఆగ్ర హం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టడం తప్ప కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్‌ అంటే కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ ఫార్మర్లని, యాసంగిలో ఎనక మడి ఎండకుండా పంట పండేది కాదన్నారు. రూ.200 ఉన్న పింఛన్‌ను కేసీఆర్‌ రూ.2016కు పెంచి వృద్ధులకు, వితంతువులకు ఇబ్బంది కలగకుండా చేశారన్నారు. సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, ప్రజలు మంచి చేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్నారు. రైతులు అధిక ఆదాయం వచ్చే ఆయిల్‌ఫాం, మల్బరీ తోటలను సాగుచేయాలన్నారు.  అనంతరం బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అంతకు ముందు చిన్నకోడూరులో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్నారు. 


సిద్దిపేటకు బీ పార్మసీ కళాశాల రావడం సంతోషం

సిద్దిపేటను విద్యాక్షేత్రంగా అభివృద్ధి చేస్తూ వచ్చామని, బీ ఫార్మసీ కళాశాల రావడం సంతోషంగా ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం చిన్నకోడూరు మండలం రామంచ శివారులో బీ ఫార్మసీ కళాశాల భవన నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్‌ సంస్థ కొన్ని లక్షల మంది పిల్లలను, ముఖ్యంగా మహిళలను విద్యావంతులను చేసిందన్నారు. విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసిన సంస్థ హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ సంస్థ అన్నారు. ఎగ్జిబిషన్‌ సంస్థను ఒక యూనివర్సిటీగా ఆఫ్‌ గ్రేడ్‌ చేయాలని తన అభిప్రాయం అని, భవిష్యత్‌లో సీఎం కేసీఆర్‌తో మాట్లాడి దీనిని యూనివర్సిటీగా అభివృద్ధి చేయడానికి తన వంతు సహకారం అందిస్తానని మంత్రి చెప్పారు. ఒక కోర్టు కేసు లేకుండా భూ సేకరణ చేసి మూడు సంవత్సరాల్లో రంగనాయకసాగర్‌ ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. రంగనాయకసాగర్‌ ఒక లక్ష ఎకరాలకు రైతులకు సాగు నీరు అందిస్తుందన్నారు. లక్ష ఎకరాలకు నీరు అందించడమే కాకుండా వందలాది చెరువులు, చెక్‌డ్యాంలకు నీళ్లు అందించి భూగర్భ జలాలు పెరగడానికి, మత్స్యసంపద, పాడిపరిశ్రమ అభివృద్ది చెందడానికి, రైతులు బాగుపడటానికి ఎంతగానో ఉపయోగపడిందని చెప్పారు. బీఫార్మసీతో ఆగకుండా భవిష్యత్‌లో ఇంటర్‌ పూర్తిచేయగానే ఫాం డీ ఆరేళ్ల కోర్సును ప్రారంభిస్తామని, అదే విధంగా ఎంఫార్మసీ (పీజీ)ని ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగేళ్ల క్రితం కన్న కల ఈ రోజు నిజమైందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ బి. ప్రభాశంకర్‌, కార్యదర్శి ఆదిత్య మార్గం, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎంపీపీ మాణిక్యరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ పాపయ్య, ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ రవీందర్‌ రెడ్డి, పీఏసీఏస్‌ చైర్మన్లు సదానందం, కనకరాజు,సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు ఉమేష్‌చంద్ర, ఎంపీటీసీల ఫోరం మండలాఽధ్యక్షుడు శ్రీనివాస్‌, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్‌ వెంకటేశం, డీసీసీబీ ఉమ్మడి మెదక్‌ జిల్లా డైరెక్టర్‌ రామచంద్రం, గొర్రెల కాపరుల సంఘం ఉమ్మడి మెదక్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి యాదవ్‌, సర్పంచులు శ్రీనివాస్‌, సంతోషి, ఎంపీటీసీలు జ్యోతి, వెంకటలక్ష్మీ పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి

సిద్దిపేట టౌన్‌ : కులవృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలోని హౌసింగ్‌ బోర్డు సర్కిల్‌లో చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకుని ఆమె విగ్రహానికి పూలమాల వేసి మంత్రి హరీశ్‌రావు నివాళులర్పించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని కొనియాడారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని, అధికారికంగా నిర్వహించడం మనందరికి గర్వకారణమని చెప్పారు. రానున్న రోజుల్లో ఐలమ్మ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని సిద్దిపేటలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. సిద్దిపేటలో అన్ని సౌకర్యాలతో మోడ్రన్‌ దోబిఘాట్‌లను రజకుల సౌకర్యార్థం నిర్మించామని, రానున్న రోజుల్లో ఎంబీసీ కార్పొరేషన్‌ ద్వారా రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేస్తామని హమీనిచ్చారు. కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్‌ రోజాశర్మ పాల్గొన్నారు.  


నర్సింగ్‌ ఉద్యోగం కాదు.. సేవ కలిగిన వృత్తి

సిద్దిపేటటౌన్‌ : మీ జీవితంలో ఈరోజు అతి ముఖ్యమైన రోజు అని, నర్సింగ్‌ అనేది ఉద్యోగం కాదని సేవ కలిగిన వృత్తి అని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సోమవారం రాత్రి సిద్దిపేటలోని విపంచి కళా నిలయంలో ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు నిర్వహించిన ల్యాంప్‌ ఆఫ్‌ లైటింగ్‌ ప్రతిజ్ఞ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. అనంతరం క్యాండిల్‌ లైట్‌తో విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సమాజం కోసం అతి పవిత్రమైన దానిలో నర్సింగ్‌ ఒకటని తెలిపారు. సిద్దిపేటలో రూ. 40కోట్లతో నిర్మిస్తున్న నర్సింగ్‌ భవనం త్వరలో అందుబాటులోకి వస్తుందని  బీఎస్సీ నర్సింగ్‌ తర్వాత మరొక కోర్సును తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. పల్లె, బస్తీ దవఖానాలకు ఇచ్చిన నోటిఫికేషన్‌లో బీఎస్సీ చదివిన నర్సును తీసుకోవాలని పేర్కొన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నర్సింగ్‌ కౌన్సిలింగ్‌ సభ్యుడు పాల సాయిరాం, కళాశాల ప్రిన్సిపాల్‌ సునీత, డీఎంఅండ్‌హెచ్‌వో కాశీనాథ్‌, సుడా చైర్మన్‌ మారెడ్డి రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్సు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.



Updated Date - 2022-09-26T05:30:00+05:30 IST