దౌత్యయాత్ర

ABN , First Publish Date - 2022-05-06T08:57:07+05:30 IST

మిత్రదేశమైన రష్యా మనసు నొప్పించకుండా, యూరప్‌లోని ముఖ్యదేశాల మనసు గెలుచుకోవడంలో మోదీ విజయవంతమైనారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు...

దౌత్యయాత్ర

మిత్రదేశమైన రష్యా మనసు నొప్పించకుండా, యూరప్‌లోని ముఖ్యదేశాల మనసు గెలుచుకోవడంలో మోదీ విజయవంతమైనారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మూడురోజుల  ఐరోపా పర్యటన అత్యంత సంక్లిష్టమైన కాలంలో జరుగుతున్నందున అడుగుపెట్టిన ప్రతీచోటా ఆలింగనాలు, ఆప్యాయతలతో పాటు ఉక్రెయిన్ యుద్ధం ప్రస్తావనలు ఉంటాయని తెలియనిదేమీ కాదు. 


ఈ ఏడాది జరిపిన ఈ తొలి విదేశీ పర్యటనలో మోదీ మూడురోజుల్లో మూడుదేశాలను చుట్టేశారు. అదనంగా మరికొంతమంది నేతలనూ కలుసుకున్నారు. రష్యామీద యూరప్‌లో చాలా దేశాలు గుర్రుగా ఉన్నస్థితిలో, మన వాదన కూడా తెలియచెప్పడానికి ఈ పర్యటన ఉపకరించింది. మోదీ ముందుగా కాలూనిన జర్మనీలో ఇటీవలే కొత్త చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ నాయకత్వంలో కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. యుద్ధం విషయంలో దాని వైఖరి ఏమైనప్పటికీ, మనతో అనాదిగా ఉన్న అదే అప్యాయతను షోల్జ్ కనబరిచారు. జర్మనీ అధ్యక్షుడు కాస్త గట్టిగానే రష్యాను ఉద్దేశించి మాటలు తూటాలుగా విసిరినప్పటికీ, ఈ యుద్ధంలో ఎవరూ అంతిమవిజేతలుగా నిలవబోరని మోదీ మాటలను జాగ్రత్తగా ప్రయోగించారు. భారతదేశం మాదిరిగానే జర్మనీకి కూడా రష్యాతో బలమైన ఆర్థికబంధాలున్నాయి. మరీ ముఖ్యంగా ఇంధనం విషయంలో అది రష్యామీద బాగా ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో రష్యా దూకుడు జర్మనీని ఇబ్బందిపెట్టింది. ఇంధన అవసరాలను తగ్గించుకోవడం, రష్యాపై ఆంక్షలు ప్రకటించడం, ఆయుధాలను పెంచుకోవడంలో పశ్చిమదేశాలతో కలసి పనిచేస్తున్నప్పటికీ, మిగతా నాటో దేశాల మాదిరిగా నేరుగా ఉక్రెయిన్‌లో ఆయుధాలను మోహరించేందుకు జర్మనీ సిద్ధపడలేదు. యుద్ధం విషయంలో భారత్ జర్మనీలు రెండూ వాస్తవికతతోనే వ్యవహరిస్తున్నాయని అనుకోవాలి. పారిస్ ఒప్పందానికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ కోసమంటూ దాదాపు 80వేలకోట్ల రూపాయల రుణాన్ని అదనంగా ప్రకటించడం ద్వారా జర్మనీ తన ఆప్యాయతను బలంగానే ప్రదర్శించింది. యూరప్‌లో భారతదేశానికి జర్మనీ అతిపెద్ద వాణిజ్యభాగస్వామి. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులతో పాటు, ఆకర్షణీయ నగరాలు, నమామిగంగే వంటి ప్రాజెక్టులకు కూడా ఆర్థికసాయం చేస్తోంది. మోదీ పర్యటనలో ఇరుదేశాల మధ్యా కుదిరిన తొమ్మిది కీలక ఒప్పందాలతోపాటు, హరిత సుస్థిరాభివృద్ధికి చెప్పుకున్న సంకల్పం ఇండో జర్మనీ భాగస్వామ్యానికి మరింత బలమైన పునాదులు వేస్తుంది. 


డెన్మార్క్‌తో వివిధరంగాల్లో సహకారానికి సంబంధించిన అవగాహనలను అటుంచితే, ఉక్రెయిన్ యుద్ధంపై ఆ దేశ ప్రధాని ఫ్రెడెరిక్సన్ మోదీని కాస్తంత గట్టిగానే నిలదీశారు. యుద్ధనివారణకు భారత్ బలంగా కృషిచేయాలన్న ఆమె వ్యాఖ్యానించిన నేపథ్యంలో, కాల్పుల విరమణ గురించి మోదీ కాస్తంత గట్టిగా అనాల్సి వచ్చింది. అలాగే, పెట్టుబడులకు భారతదేశం స్వర్గధామంగా ఉన్నదనీ, అంకుర సంస్థలకు అద్భుత తోడ్పాటు దక్కుతున్నదని మోదీ చెప్పుకొచ్చారు. నార్డిక్ దేశాల ప్రధానమంత్రులతో జరిగిన సదస్సులోనూ ఉక్రెయిన్ ప్రస్తావన తప్పలేదు. భారత్ తన వైఖరి చెప్పుకొచ్చింది, ఆ తరువాత విడుదలైన ప్రకటనలో నార్డిక్ దేశాలు రష్యాను దుమ్మెత్తిపోశాయి. ఈ రెండో ఇండో నార్డిక్ సదస్సు మైత్రీబంధాన్ని మరింత బలోపేతం చేసిన కారణంగా పలు రంగాల్లో ఆ దేశాల సామర్థ్యాలు భారతదేశానికి రాబోయే రోజుల్లో ఎంతో ఉపకరిస్తాయి. ఫ్రాన్స్‌తో భారత్ బంధం ఆయుధాల దశదాటి ఆలింగనాలకు ఎప్పుడో చేరింది. పైగా మరోమారు మేక్రాన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడం భారత్‌కు పెద్ద ఉపశమనం. రాఫెల్ యుద్ధవిమానాల విషయంలోనే కాక, మరింత ఆయుధ సహకారానికి ఈ పర్యటనలో అడుగులు పడినట్టు చెబుతున్నారు.


ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కారణంగా యూరప్ అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో వస్తున్న మార్పుల దృష్ట్యా, స్వీయ అవసరాల కారణంగా యూరప్ భారతదేశంతో బలమైన వాణిజ్య, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది. ఈ మధ్యనే న్యూఢిల్లీ వచ్చిన యూరోపియన్ యూనియన్ (ఈయూ) అధ్యక్షురాలు ఉర్సులా లెయెన్ భారతదేశం మాకు అత్యంత సన్నిహిత భాగస్వామి అని ప్రకటించి మరీ వెళ్ళారు. మోదీ కూడా అదేస్థాయిలో నాలుగుమంచిమాటలన్నారు. మోదీ మూడురోజుల యూరప్‌ పర్యటన ఆ స్నేహాన్ని మరింత సుస్థిరపరుస్తుందనడంలో సందేహం అక్కరలేదు.

Read more