మహిళల రక్షణ కోసం దిశ యాప్‌

ABN , First Publish Date - 2022-05-20T06:29:57+05:30 IST

మహిళల రక్షణ కోసమే ప్రభుత్వం దిశ చట్టం, యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి తెలిపారు.

మహిళల రక్షణ కోసం దిశ యాప్‌
డౌన్‌లోడ్‌, రిజిస్ర్టేషన్‌ చేయించుకున్న యాప్‌ను చూపుతున్న మహిళలు, చిత్రంలో ఎంపీ సత్యవతి, కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, జిల్లా ఎస్పీ గౌతమిశాలి

కలెక్టర్‌ రవి  పట్టన్‌శెట్టి, ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి

అనకాపల్లిటౌన్‌, మే 19: మహిళల రక్షణ కోసమే ప్రభుత్వం దిశ చట్టం, యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి తెలిపారు. గురువారం స్థానిక దిశ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో దిశ యాప్‌ మెగా డ్రైవ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి మహిళల రక్షణ కోసమే ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. జిల్లా ఎస్పీ గౌతమిశాలి మాట్లాడుతూ జిల్లాలో లక్ష యాప్‌లు డౌన్‌లోడ్‌, రిజిస్ర్టేషన్‌ చేయించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి మహిళ తన భద్రతలో భాగంగా దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో పాటు రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాలన్నారు. అలా రిజిస్ర్టేషన్‌ చేయించుకున్న మహిళలకు ఏ కష్టం వచ్చినా యాప్‌ ద్వారా వచ్చే సమాచారం మేరకు పోలీస్‌శాఖ అందుబాటులోకి వచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో దిశ పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీ ఎం.మహేష్‌, పట్టణ సీఐ ఎల్‌.భాస్కరరావు, విద్యార్థినులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. అనకాపల్లి రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రధాన జంక్షన్‌లతో పాటు బస్సుల్లో వెళ్లే మహిళలకు కూడా యాప్‌ తాలుకా వివరాలు తెలియపరిచి వారి మొబైల్‌లో దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి రిజిస్ర్టేషన్‌ చేయించుకునే విధంగా చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. 

ఎలమంచిలిలో..

ఎలమంచిలి: పట్టణంతోపాటు మండలంలోని పలు జంక్షన్‌ల వద్ద గురువారం పట్టణ, రూరల్‌ ఎస్‌ఐలు నీలకంఠరావు, సన్నిబాబు, పోలీసు సిబ్బంది కలిసి దిశ యాప్‌ రిజస్ర్టేషన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. రోడ్డుపై వెళుతున్న వాహనదారులతోపాటు బస్సుల్లో ప్రయాణికులతో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించారు.


Updated Date - 2022-05-20T06:29:57+05:30 IST