ఎన్‌కౌంటర్‌ బూటకం

ABN , First Publish Date - 2022-05-21T09:17:45+05:30 IST

దిశ అత్యాచారం, హత్య ఘటన అనంతరం ఎన్‌కౌంటరైన నలుగురు నిందితులను పోలీసులే కాల్చి చంపారని సుప్రీంకోర్టు నియమించిన సిర్పుర్కర్‌ కమిషన్‌ నిర్ధారించింది.

ఎన్‌కౌంటర్‌ బూటకం

  • ‘దిశ’ హంతకులను కావాలనే కాల్చి చంపారు
  • చస్తారని తెలిసే పోలీసుల ఫైరింగ్‌
  • ఆత్మరక్షణ కోసం కాల్చామన్నది కట్టుకథ
  • 10 మంది పోలీసులపై హత్య కేసు పెట్టాలి
  • పోలీసుల కంట్లో మట్టి కొట్టడం అసాధ్యం 
  • ఘటన జరిగిన చేలో అంతా పచ్చగడ్డే
  • పోలీసుల వాదనల్లో ఎక్కడా పొంతనలేదు
  • సాక్షాల్లో డొల్లతనం బయటపడుతుందనే
  • సీసీ టీవీ సాక్ష్యాలను మాకు సమర్పించలేదు 
  • నిందితుల గుర్తింపు, అరెస్టు సందర్భాల్లో
  • పోలీసులు చట్టబద్ధ హక్కుల్ని ఉల్లంఘించారు
  • మరణించిన నలుగురిలో ముగ్గురు మైనర్లు
  • వాళ్లు పారిపోయే ప్రయత్నమే చేయలేదు
  • ఆయుధాలు లాక్కొని, కాల్పులు జరపడం 
  • అబద్ధం.. సుప్రీంకు సిర్పుర్కర్‌ కమిషన్‌ నివేదిక
  • వెంటనే దాన్ని బహిర్గతం చేసిన సుప్రీం


న్యూఢిల్లీ, మే 20 (ఆంధ్రజ్యోతి): దిశ అత్యాచారం, హత్య ఘటన అనంతరం ఎన్‌కౌంటరైన నలుగురు నిందితులను పోలీసులే కాల్చి చంపారని సుప్రీంకోర్టు నియమించిన సిర్పుర్కర్‌ కమిషన్‌ నిర్ధారించింది. నిందితులకు తమకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగిందని పోలీసులు చెబుతున్న కథనం బూటకమని, తమ నిర్బంధంలో నిరాయుధులుగా ఉన్న నిందితులను పోలీసులే చంపేశారని తేల్చిచెప్పింది. చంపే ఉద్ధేశంతోనే వారిపై కాల్పులు జరిపారని తెలిపింది. బూటకపు ఎన్‌కౌంటర్‌కు బాధ్యులైన పది మంది పోలీసు అధికారులపై హత్య కేసు నమోదు చేసి, విచారణ జరపాలని సుప్రీంకోర్టుకు సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వి.ఎ్‌స.సిర్పుర్కర్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్‌ ఇటీవల సీల్డ్‌ కవర్‌లో నివేదిక సమర్పించింది. సుప్రీంకోర్టులో శుక్రవారం ఈ కేసు విచారణ సందర్భంగా నివేదికను బహిర్గతం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ, అభ్యంతరాలను తోసిరాజని సర్వోన్నత న్యాయస్థానం నివేదికను బయట పెట్టింది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 10 మంది పోలీసులపై ఐపీసీ సెక్షన్‌ 302 ప్రకారం హత్య కేసులు నమోదు చేయాలని జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ సిఫారసు చేసింది. ఎన్‌కౌంటర్‌పై పోలీసులు చెప్పిందంతా కట్టుకథేనని స్పష్టం చేసింది. 


ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నది ఏ మాత్రం నమ్మశక్యంగా లేదని, ఐపీసీ 76, ఐపీసీ 300(3)కింద వారు మినహాయింపు పొందలేరని కమిషన్‌ స్పష్టం చేసింది. పది మంది పోలీసు అధికారులపై ఐసీపీ 302, 201, 34 సెక్షన్ల కింద హత్యానేరం   కేసులు నమోదు చేయాలని స్పష్టం చేసింది. నిందితుల గుర్తింపు, అరెస్టు సమయాల్లో పోలీసులు అనేక రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన హక్కులను ఉల్లంఘించారని తేల్చింది. నిందితులను ఎందుకు అరెస్టు చేస్తున్నారో వారి కుటుంబ సభ్యులకు చెప్పలేదని, వారెంట్‌ ఇవ్వలేదని, న్యాయ సాయం అందించలేదని ప్రస్తావించింది.


పోలీసు కస్టడీకి నిందితులను ఇవ్వడంలో జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ కూడా పలు ఉల్లంఘనలకు పాల్పడ్డారని, వైద్య పరీక్షలు కూడా సరైన రీతిలో జరగలేదని వివరించింది. దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులు జొల్లు శివ, జొల్లు నవీన్‌, చింతకుంట చెన్నకేశవులు, మహ్మద్‌ ఆరి్‌ఫలు పోలీసు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు జరపడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్‌ చైర్మన్‌గా, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రేఖా సొందుర్‌ బల్టోడా, సీబీఐ మాజీ డైరెక్టర్‌ డీఆర్‌ కార్తికేయన్‌ సభ్యులుగా 2019 డిసెంబరు 12న సుప్రీంకోర్టు దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్‌ సుప్రీంకోర్టుకు 383 పేజీల నివేదికను సమర్పించింది. దాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు బహిర్గతం చేసింది. ఆత్మరక్షణ కోసమో లేదా నిందితులను తిరిగి అరెస్టు చేయడం కోసమో పోలీసులు కాల్పులు జరినట్లు అనిపించడం లేదని, నిందితులను ఉంచామని చెబుతున్న గెస్ట్‌హౌస్‌ నుంచి ఎన్‌కౌంటర్‌ జరిగిన చటాన్‌పల్లి వరకు పోలీసుల కథనం మొత్తం కట్టుకథ అని రికార్డులు స్పష్టం చేస్తున్నాయని తెలిపింది. 


తమ కళ్లలో మట్టిని కొట్టి నిందితులు పారిపోడానికి ప్రయత్నించారని పోలీసులు చెబుతున్నారని, కానీ ఈ విషయాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి గానీ, మెజిస్ట్రేట్‌ నమోదు చేసిన వాంగ్మూలంలో గానీ పోలీసులు ఎక్కడా చెప్పలేదని గుర్తు చేసింది. అంత మంది సాయుధ పోలీసులు ఉన్నప్పుడు అలా మట్టికొట్టడం సాధ్యం కాదని, పైగా తాము పరిశీలించిన వీడియోల ప్రకారం అక్కడ కింద పచ్చిగడ్డి ఉందని, కాబట్టి అందులో నుంచి మట్టిని తీయడం అసాధ్యమని స్పష్టం చేసింది. ఒకేసారి అంతమంది పోలీసుల కళ్లలో కొట్టడానికి సరిపడా మట్టిని అక్కడ ఎత్తడం కుదరదని తెలిపింది. ఇద్దరు పోలీసులను నిందితులు గాయపరిచారని, వారికి ఆస్పత్రిలో చికిత్స జరిగినట్లు పోలీసులు చెబుతున్నదంతా అబద్ధమని స్పష్టం చేసింది. ‘‘ఆయుధాలు లాక్కొని పరిగెడుతూ పోలీసులపై కాల్పులు జరిపారన్న వాదన కూడా నమ్మలేం. పారిపోతూ కాల్పులు జరపడం అసాధ్యం. ఆయుధాల వినియోగంపై నిందితులకు అవగాహన కూడా లేదు. ఒకవేళ వినియోగించడం తెలిసినా వారి దృష్టి మొత్తం పారిపోవడం పైనే ఉంటుంది’’ అని పేర్కొంది. నిందితులపైకి 41 రౌండ్ల ఫైరింగ్‌ చేశామని పోలీసులు చెబుతున్నారని, ఖాళీ అయిన తూటాలను రికవరీ చేయకపోడం కూడా పోలీసుల కథనంపై అనుమానాలు పెంచుతున్నాయని తెలిపింది. పోలీసుల వద్ద నుంచి ఆయుధాలను లాక్కోవడం, పారిపోవడానికి ప్రయత్నించడం, పోలీసులపై దాడి చేయడం, కాల్పులు జరపడం వంటి నేరాలకు నిందితులు పాల్పడలేదని కమిషన్‌ తేల్చిచెప్పింది. నిందితుల్లో ఆరిఫ్‌ మినహా మిగతా ముగ్గురు మైనర్లని తెలిపింది.


గెస్ట్‌హౌస్‌ లీజు తప్పుడు కథ

పోలీసు కస్టడీలోకి తీసుకున్న నిందితులను ఉంచడానికి శంకర్‌పల్లి వద్ద గెస్ట్‌ హౌజ్‌ను లీజుకు తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నది అబద్ధమని కమిషన్‌ స్పష్టం చేసింది. సాధారణంగా గెస్ట్‌ హౌజ్‌ను బయటివాళ్లకు లీజుకు ఇవ్వబోమని, పోలీసు వచ్చి మూడు రోజులకు రెంటల్‌ రిసీట్‌ ఇవ్వాలని అడిగితే ఇచ్చానని గెస్ట్‌ హౌజ్‌ మేనేజర్‌ చెప్పారని  నివేదిక పేర్కొంది. ‘‘గెస్ట్‌ హౌజ్‌లో నిందితులను  అధికారి వెంకటరెడ్డి విచారించినట్లు చెబుతున్న కథనాలను కూడా ఆమోదించలేం.  విచారణ జరిపినట్లుగా నమ్మించడానికి విచారణ నివేదికలను ప్రవేశపెట్టారు. రాజశేఖర్‌, అబ్దుల్‌ రౌఫ్‌ అనే ఇద్దరు పంచనామా సాక్షుల సమక్షంలో నిందితులు నేరాన్ని అంగీకరించారని చెబుతున్నారు. కేవలం నిందితులు, పంచనామా సాక్ష్యుల మధ్య పరిచయం చేశామని మరోచోట ఇంకో అధికారి సురేందర్‌ చెప్పారు. దాంతో వారి సాక్ష్యాల ప్రామాణికతను తీవ్రంగా అనుమానించాల్సి ఉంటుంది. నిందితుల నేరాంగీకార వాంగ్మూలంలో పేర్కొన్న అనేక అంశాలు పంచనామా సాక్షులు కమిషన్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో లేవు. అసలు పంచనామా సాక్షులు లేనట్లు అర్థమవుతోంది. అసలు గెస్ట్‌ హౌజులో 2019  డిసెంబరు 5, 6 తేదీల్లో నిందితులు వాంగ్మూలమేమీ ఇవ్వలేదు. అలాంటప్పుడు సంఘటన స్థలం వద్దనున్న వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లాల్సిన అవసరమే లేదు. సంఘటన స్థలానికి కొద్ది దూరంలో ఉన్న పొదల్లో దిశ వస్తువులను దాచినట్లు ఒక వాంగ్మూలంలో పేర్కొన్నారు. రెండో వాంగ్మూలంలో సంఘటన స్థలం వద్ద పెద్ద విద్యుత్తు స్తంభం వద్ద దాచామని చెప్పినట్లు పేర్కొన్నారు.


 దిశ వస్తువులను పొదల వద్ద గుర్తించామని విలేకరుల సమావేశంలో సజ్జనార్‌ ప్రకటించారు. బాధితురాలి దేహాన్ని దహనం చేసిన తర్వాత వస్తువులను దాచడానికి మరో 500 మీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ క్షేత్రానికి  వెళ్లారన్నది నమ్మశక్యంగా లేదు’’ అని కమిషన్‌ స్పష్టం చేసింది. ఆ వస్తువులపై నిందితుల వేలిముద్రలు లేవని, వాటిని ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపించ లేదని పేర్కొంది. ‘‘గెస్ట్‌ హౌజ్‌ నుంచి చటాన్‌పల్లి వరకు వెళ్లడానికి గంటన్నర సమయం పడుతుంది. ఉదయం 3 గంటలకు బస్‌లో బయలుదేరామని పోలీసులు చెబుతున్నారు. 4.30 గంటలకు చేరుకోవాలి. 5 గంటలకు చేరుకున్నామని చెబుతున్నారు. తెల్లవారలేదు కాబట్టి 5.30 గంటల వరకు బస్‌లోనే ఉండాలని సురేందర్‌ సూచించినట్లు పోలీసులు చెప్పారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డు మీద కాకుండా సర్వీస్‌ రోడ్డుపై ఎందుకు ప్రయాణించారో వివరించలేక పోయారు. దారిలో తొండుపల్లి టోల్‌గేట్‌ వద్ద సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఆ వీడియో ఫూటేజీ ఇవ్వలేదు. మరి అంతటి కీలకమైన సాక్ష్యాన్ని ఎందుకు సేకరించలేదో పోలీసులు చెప్పలేకపోయారు’’ అని నివేదిక వ్యాఖ్యానించింది. 


ఆద్యంతం అనుమానాలు

నిందితుల గుర్తింపు నుంచి ఎన్‌కౌంటర్‌ జరిగే వరకు అనేక విషయాల్లో కమిషన్‌ అనుమానాలను వ్యక్తం చేసింది. ‘‘అరెస్టు చేసిన సమయం, కోర్టులో ప్రవేశపెట్టడం, వైద్య పరీక్షలు నిర్వహణలోనూ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేశారు. లారీ యాజమాని శ్రీనివా్‌సరెడ్డి పరస్పర విరుద్ధ వాంగ్మూలాలు ఇచ్చారు. ఉదయం 3 గంటలకు అరెస్టులు జరిగాయని కుటుంబ సభ్యులు చెబుతుంటే పోలీసులు మధ్యాహ్నం అరెస్టు చేశామంటున్నారు. స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారమివ్వలేదు. లారీ యాజమానే నిందితులను స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు కేస్‌ డైరీలో పేర్కొని ఉండడం ఆశ్చర్యకరంగా ఉంది’’ అని కమిషన్‌ వ్యాఖ్యానించింది. నిందితులను షాద్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో విచారించిన సమయం విషయంలోనూ వ్యత్యాసాలు ఉన్నాయని తెలిపింది. పోలీసు స్టేషన్‌లోనే వైద్య పరీక్షలు జరిపించినట్లు పోలీసులు చెబుతున్నారని, కేసు డైరీలో మాత్రం స్థానిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొని ఉందని తేల్చింది.


కమిషన్‌ ఎందుకు?

రెండున్నరేళ్ల కిందటి సంఘటన ఇది. 2019 నవంబరు 27   రాత్రి హైదరాబాద్‌ శివారులో బెంగళూరు హైవే మీద రోడ్డు పక్కన లారీ ఆపి మద్యం తాగుతున్న నలుగురు యువకులు అక్కడ బైక్‌ పార్క్‌ చేసిన మహిళా వెటర్నరీ డాక్టర్‌ను కిడ్పాప్‌ చేసి, అత్యాచారానికి పాల్పడి, పెట్రోల్‌ పోసి కాల్చిచంపిన సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. ముఖ్యంగా తనను నలుగురు వేధిస్తున్నారని ఆ 27 ఏళ్ల యువతి చెల్లెలితో ఫోన్లో మాట్లాడిన సంభాషణల ఆడియో దేశవ్యాప్తంగా మధ్యతరగతి ప్రజలను తీవ్ర అభద్రతా భావనకు గురి చేసింది. పోలీసులు సకాలంలో స్పందించక పోవడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. మూడో రోజు అదే జాతీయ రహదారి కల్వర్ట్‌ కింద అగ్నికి ఆహుతైన స్థితిలో వెటర్నరీ డాక్టర్‌ మృతదేహం లభించింది. తర్వాత పోలీసులు వేగంగా స్పందించి, సీసీ టీవీ ఫూటేజీ ఆధారంగా నలుగురు నిందితులను పట్టుకున్నారు. విచారణ నిమిత్తం వారిని డిసెంబరు 6న తెల్లవారుజామున కల్వర్ట్‌ దగ్గరకు తీసుకెళ్లినపుడు ఎదురు కాల్పుల్లో వారు చనిపోయారని పోలీసులు ప్రకటించారు. దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌ పట్ల దేశవ్యాప్త హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టు మాత్రం జి.ఎస్‌.మణి, ప్రదీప్‌, ఎంఎల్‌ శర్మ, ముఖేశ్‌ అనే నలుగురు న్యాయవాదులు వేసిన పిటిషన్‌ ఆధారంగా వీటిని చట్ట విరుద్ధ హత్యలుగా అనుమానించి, ఎన్‌కౌంటర్‌పై విచారణకు డిసెంబరు 12న ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది. 



Updated Date - 2022-05-21T09:17:45+05:30 IST