‘దిశ’ తప్పుతోంది..!

ABN , First Publish Date - 2022-05-16T06:23:06+05:30 IST

ఆపదలో ఉన్న మహిళల సమాచారం తెలుసుకుని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దిశ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌ ఇన్‌స్టాలింగ్‌, అవగాహన కల్పించే బాధ్యతను పోలీసులకు అప్పగించింది. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, యాప్‌ ఇన్‌స్టాలింగ్‌లో పోలీసులు అనుసరిస్తున్న తీరుతెన్నులపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.

‘దిశ’ తప్పుతోంది..!
అనకాపల్లి నూకాంబిక ఆలయం ఆవరణలో మహిళలతో దిశ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయిస్తున్న పోలీసులు (ఫైల్‌)

మహిళ కనిపించడమే తరువాయి ఆపేస్తున్న పోలీసులు

బడి, గుడి, రహదారి ఎక్కడైనా లేని మినహాయింపు

విషయం తెలియక భయపడుతున్న మహిళలు, యువతులు

ఫోన్‌లో యాప్‌ నిర్ధారణ అయ్యేవరకూ విడిచిపెట్టని వైనం

కాలయాపన, ఇబ్బందిగా భావిస్తున్న మహిళలు


అనకాపల్లి రూరల్‌, మే 15: ఇంటి దగ్గరుంటే మహిళా పోలీసు.. రోడ్డెక్కితే ట్రాఫిక్‌ పోలీసు.. గుడికెళ్తే అక్కడా సివిల్‌ పోలీసు.. ప్రదేశం ఏదైనా మహిళ కనిపించడమే తరువాయి ఆపేస్తున్నారు. సెల్‌  ఫోన్‌ తీసుకుని దిశ యాప్‌ ఉందో? లేదో? చెక్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో వారి అభిప్రాయాన్ని పక్కన పడేస్తున్నారు. యాప్‌ ఉంది మహోప్రభో.. అని కొంత మంది విన్నవించినా నిర్ధారించుకున్న తరువాతనే వదులుతున్నారు. ఇక, మొదట్లో విషయం తెలియక పోలీసులు అడ్డగించగానే భయబ్రాంతులకు లోనవుతున్నారు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా, పోలీసులు అమలు చేసే తీరుతో తమ దిశ తప్పుతోందని మహిళలు, యువతులు గగ్గోలు పెడుతున్నారు.


ఆపదలో ఉన్న మహిళల సమాచారం తెలుసుకుని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దిశ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌ ఇన్‌స్టాలింగ్‌, అవగాహన కల్పించే బాధ్యతను పోలీసులకు అప్పగించింది. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, యాప్‌ ఇన్‌స్టాలింగ్‌లో పోలీసులు అనుసరిస్తున్న తీరుతెన్నులపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇల్లు, బడి, గుడి.. ఇలా ప్రదేశంతో సంబంధం లేకుండా, రేయింబవళ్లు తేడా తెలియకుండా సెల్‌ఫోన్లలో దిశ యాప్‌ చెక్‌ చేసి లేకపోతే ఇన్‌స్టాల్‌ చేస్తున్నారు. రహదారులపై మహిళలు కనిపించడమే తరువాయి.. వారికి అడ్డంగా వెళ్లి ఫోన్‌ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో స్కూటీలపై ప్రయాణించే మహిళలను, కుటుంబ సమేతంగా బైక్‌, కార్లు వెళ్లే వారిని, ఆటోల్లో రాకపోకలు సాగించే మహిళలను సైతం ట్రాఫిక్‌, పోలీసులు నిలిపివేసి సెల్‌ఫోన్‌లు చెక్‌ చేస్తుండడంతో, విషయం తెలియక ముందు వారంతా ఏదో తప్పు చేశామనే భావంతో భయబ్రాంతులకు లోనవుతున్నారు. తీరిగ్గా దిశ యాప్‌ గురించి పోలీసులు చెప్పాక, కొంత మంది తమ ఫోన్‌లో యాప్‌ ఇన్‌స్టాలింగ్‌ చేసుకున్నామని చెప్పినా నిర్ధారించుకోవడం కోసం సెల్‌ఫోన్‌ చెక్‌ చేస్తుండడంతో ఇబ్బందిగా భావిస్తున్నారు. అలాగే తమ విలువైన సమయం వృథా అవుతున్నదని వాపోతున్నారు. అత్యవసర పనులపై వెళ్తున్నామని చెబుతున్నా ఫోన్‌ చూపించేవరకు కొంతమంది పోలీసు సిబ్బంది విడిచిపెట్టడం లేదని మహిళలు మండిపడుతున్నారు.

సాధారంగా పురుషుల కంటే మహిళలకు భక్తిభావం ఎక్కువుగా ఉంటుంది. నిత్యజీవితంలో ఎంత బిజీగా ఉన్నా ఆలయాలకు వెళ్లి ప్రశాంతంగా గడపాలని, దేవుని అనుగ్రహం పొందాలని వారు ప్రాధేయపడతారు. చివరికి అక్కడా సివిల్‌ పోలీసులు ప్రత్యక్షమైపోయి, ఫోన్‌లు తీసుకుని దిశ యాప్‌ చెక్‌ చేస్తుండడంతో వారు తీవ్ర అసహనానికి  గురువుతున్నారు. యాప్‌ చెక్‌ చేసుకోవడానికి, ఇన్‌స్టాల్‌ చేయడానికి ఇదే సమయమా? అని కొంత మంది పెదవి విరుస్తున్నారు.


యాప్‌ ఇన్‌స్టాలింగ్‌కు ఎన్నో మార్గాలు ఉన్నా...

గ్రామ/వార్డు సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థతో ప్రజల వద్దకే పరిపాలన తీసుకు వెళ్లామని ప్రభుత్వం చెబుతోంది. ప్రతి రెండు వేల ఇళ్లకూ ఓ సచివాలయం ఏర్పాటు చేసి 11 మంది కార్యదర్శులను నియమించింది. అలాగే , 50 లేదా 100 ఇళ్లకు ఓ వలంటీర్‌ను ఏర్పాటు చేసింది. ఇక ప్రతి సచివాలయంలోనూ మహిళా సంరక్షణ కార్యదర్శిని నియమించింది. వీరంతా వారి పరిధిలో ఉన్న ఇళ్లకు వెళ్లి ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వినియోగిస్తున్న మహిళలను, యువతులను గుర్తించి దిశ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయడం అవగాహన కల్పిస్తే సరిపోతుంది. అంతేకాకుండా వివిధ సేవలు పొందేందుకు ప్రతి యువతి, మహిళలు సచివాలయాల మెట్టు ఎక్కాల్సిందే. ఆ సమయంలోనైనా సచివాలయ సిబ్బంది యాప్‌ ఉందో లేదో తెలిసుకుని ఇన్‌స్టాల్‌ చేయించొచ్చు. పైగా ఇంటర్‌, డిగ్రీ, పీజీ కళాశాలలో చదువుతున్న విద్యార్థినుల వద్దకు వెళ్లి యాప్‌ ఇన్‌స్టాల్‌, దాని ఆవశ్యకతను వివరించవచ్చు. ఇన్ని మార్గాలు ఉన్నప్పటికీ బడులు, గుడులు, రహదారులను పోలీసులు వేదికగా ఎంచుకుని మహిళ, యువతలను నిలిపివేసి ఫోన్‌లు తీసుకుని ఇన్‌స్టాల్‌ చేయడంతో కాలయాపనగా మహిళలు, యువతులు చెబుతున్నారు. ఇకపోతే విషయం తెలియక పోలీసులను ఆపగానే భయపడుతున్నామని కొంత మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. రహదారులపై ప్రయాణిస్తున్న మహిళలను నిలిపివేసి యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయించి సమయాన్ని వృథా చేసేకంటే, అందుబాటులో ఉన్న సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో ఈ ప్రక్రియ పూర్తిచేయాలని, ఆ దిశగా అధికారులు, ప్రజాప్రతిధులు చర్యలు తీసుకోవాలని మహిళలు, యవతులు కోరుతున్నారు.

    

Updated Date - 2022-05-16T06:23:06+05:30 IST