నా కుమారుడికి మీ అండదండలు కావాలంటోన్న ఆర్‌. సుందర్‌రాజన్‌

Sep 16 2021 @ 18:18PM

విజయ్‌ సేతుపతి, తాప్సీ, రాధిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అనబెల్‌ అండ్ సేతుపతి’ చిత్రం ఈ నెల 17వ తేదీ డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రం గురించి దర్శకుడు దీపర్‌ సుందర్‌రాజన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని ఫాంటసీ కామెడీ చిత్రంగా తెరకెక్కించాం. ప్రతి ఒక్కరికీ నచ్చే, మెచ్చే సినిమా. దర్శకుడు ఏఎల్‌. విజయ్‌ దగ్గర దర్శకత్వ విభాగంలో శిక్షణ తీసుకున్నాను. మా డాడీ వద్ద నుంచి ఇతరులను ఎలా గౌరవించాలి, వారితో ఎలా మాట్లాడాలి వంటి అంశాలను నేర్చుకున్నాను. నా తొలి చిత్రం హాస్యభరితంగా తెరకెక్కించాను. అలాగనీ మున్ముందు హాస్యభరిత చిత్రాలనే చేయాలన్నకోరికలేదు. అదే సమయంలో నటించాలన్న ఆశ లేశ మాత్రం కూడా లేదు. నా దృష్టంతా ఫిల్మ్‌ మేకింగ్‌పైనే. వరుస చిత్రాలకు దర్శకత్వం వహించేందుకు ఇష్టపడతాను..’’ అన్నారు. ‘అనబెల్‌ అండ్ సేతుపతి’ ప్రతి ఒక్కరికీ నచ్చే చిత్రంలా ఉంటుందని దర్శకుడు దీపక్‌ సుందర్‌రాజన్‌ వివరించారు. 


దర్శకుడి తండ్రి, సీనియర్‌ దర్శకనటుడు ఆర్‌. సుందర్‌రాజన్‌ మాట్లాడుతూ. ‘‘నేను సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి 40 యేళ్లు. అప్పుడు నా చిత్రాలకు రివ్యూలు రాసిన విలేకరులు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. వారిని చూడటం చాలా సంతోషంగా ఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఏ విధంగా అండగా ఉన్నారో అలాగే, నా కుమారుడికి కూడా మీ అండదండలు కావాలని కోరుతున్నాను. ఈ చిత్రం ట్రైలర్‌ చాలా బాగా ఉంది. సినిమాను కూడా అద్భుతంగా తెరకెక్కించి ఉంటారని భావిస్తున్నాను’’ అని  చెప్పారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.