‘బుగ్గన’ వేలేసుకునేలా?

ABN , First Publish Date - 2021-05-21T05:28:20+05:30 IST

కరోనా విపత్కర వేళ.. జిల్లావాసులు రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. వ్యవసాయాధారితమైన సిక్కోలుకు.. ప్రధానంగా సాగునీటి రంగానికి ప్రాధాన్యమివ్వలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు విడుదల చేయలేదంటూ ‘బుగ్గన’ వేలేసుకుని పెదవి విరుస్తున్నారు.

‘బుగ్గన’ వేలేసుకునేలా?

- బడ్జెట్‌లో జిల్లావాసులకు నిరాశే!

-  సిక్కోలుకు కానరాని ప్రత్యేక కేటాయింపులు 

- జూలై నాటికి వంశధార ప్రాజెక్టు పూర్తి

- మిగిలినవన్నీ 2022లోనే 

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

కరోనా విపత్కర వేళ.. జిల్లావాసులు రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. వ్యవసాయాధారితమైన సిక్కోలుకు.. ప్రధానంగా సాగునీటి రంగానికి ప్రాధాన్యమివ్వలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు విడుదల చేయలేదంటూ ‘బుగ్గన’ వేలేసుకుని పెదవి విరుస్తున్నారు. జిల్లాకేంద్రంలో నెలకొన్న సమస్యలు... రోడ్లు, భవనాలు... ఇతరత్రా రంగాలకు కేటాయింపులు లేకపోవడంపై అన్నివర్గాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జూలై నాటికి వంశధార ప్రాజెక్టు పూర్తిచేస్తామని బడ్జెట్‌లో వెల్లడించినా.. దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో తొమ్మిది మండలాల్లో 45వేల ఎకరాలకు సాగునీరందించేందుకుగానూ నిర్మిస్తున్న బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు  పనులు 86శాతం పూర్తయ్యాయని బడ్జెట్‌లో పేర్కొన్నారు. మిగిలిన 14 శాతం పనులు ఈ ఏడాది జూలై నాటికి పూర్తవుతాయని అంచనా వేశారు. కానీ, ప్రాజెక్టు వారీగా ఎంత నిధులు కేటాయించారన్నది స్పష్టం చేయలేదని జిల్లావాసులు వాపోతున్నారు.  


 వచ్చే ఏడాదే...

జిల్లాలో అత్యంత కీలకమైన నదుల అనుసంధాన ప్రక్రియ.. ఇతర ప్రాజెక్టులు కూడా వచ్చే ఏడాది పూర్తయ్యే అవకాశముందని ప్రభుత్వం ప్రకటించింది. వంశధార-నాగావళి నదుల  అనుసంధానం పనులు ఎంతశాతం పూర్తయ్యాయి... ఇంకా ఎంతశాతం చేయాల్సి ఉంది.. నిధులు ఏమేర ఖర్చు చేయాలన్నదీ స్పష్టం కాలేదు. మహేంద్రతనయ నదిపై నిర్మిస్తున్న ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పరిస్థితిపై ప్రస్తావన లేదు. సర్దార్‌ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజీ ప్రాజెక్టు-గజపతినగరం బ్రాంచ్‌ కాలువ, ఇటు మడ్డువలసలో గొర్లె శ్రీరాములునాయుడు రిజర్వాయర్‌ ప్రాజెక్టు- రెండో దశ... ఇవన్నీ ఎంతశాతం పనులు అన్నది తెలియరాలేదు. కాకపోతే రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులతో పాటు  జిల్లాలో ఉన్న నదుల అనుసంధానం, ఆఫ్‌షోర్‌, మడ్డువలస ఫేజ్‌ 2..  2021-22లో పూర్తవుతాయని బడ్జెట్‌లో పొందుపరిచారు. వీటికి ఎంతమేర నిధులు ఖర్చు చేశారన్నదీ వెల్లడి కాలేదు. అలాగే వచ్చే ఏడాదిలోగా త్వరితగతిన పూర్తి చేసేందుకు కూడా కేటాయింపులు ఇందులో చూపలేదు. మొత్తంమీద.. సాగునీటి రంగానికి కేటాయింపులు చూపించారు కానీ.. విడిగా చూపలేదు. 


 బుడగట్లపాలెంలో ఫిషింగ్‌ హార్బర్‌.....

రెండోదశలో భాగంగా రాష్ట్రంలో నాలుగు ఫిషింగ్‌ హార్బర్‌లను రూ.1365.35 కోట్లతో నిర్మించేందుకు చర్యలు తీసుకున్నట్లు బడ్జెట్‌లో పొందుపరిచారు. ఇందులో జిల్లాకు సంబంధించి బుడగట్లపాలెంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడవుతోంది. వేర్వేరుగా నిధులు కేటాయింపు ఎంత... ఫిషింగ్‌హార్బర్‌ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి... ఎప్పట్లో పూర్తవుతుందన్నదీ వెల్లడి కాలేదు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్ని సాధించే దిశగా హార్బర్‌లను నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇలా నిధుల కేటాయింపుపై స్పష్టత లేకపోవడంతో రాష్ట్ర బడ్జెట్‌పై జిల్లావాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


ఉక్కు  ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం : డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఉక్కును నిలబెట్టేందుకు ఐదు మార్గాలను కేంద్రానికి సూచిస్తూ తీర్మానం చేశామని వివరించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజల తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశామన్నారు. 2021-22 బడ్జెట్‌ అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను తెలియజేస్తుందని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించకపోయినా ఫర్వాలేదని... దిగజారుడు రాజకీయాలకు పాల్పడవద్దని టీడీపీ నాయకులను ఉద్దేశించి ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 


కిడ్నీ ఆస్పత్రికి నిధుల కేటాయింపు : మంత్రి సీదిరి అప్పలరాజు హర్షం  

పలాస: పలాసలో నిర్మిస్తున్న 200 పడకల కిడ్నీ ఆసుపత్రి, పరిశోధన కేంద్రానికి బడ్జెట్‌లో  రూ.50 కోట్లు కేటాయించడంపై మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే అదనంగా నిధులు కేటాయించడంతో ఈ ఆసుపత్రి నిర్మాణానికి రూ.100 కోట్లు కేటాయింపులు జరిగాయని తెలిపారు. దీంతో అన్ని హంగులతో ఆసుపత్రి నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. అలాగే రేగులపాడు వద్ద నిర్మిస్తున్న ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌కు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఇచ్చి నిధుల కేటాయించడంపై మంత్రి అప్పలరాజు హర్షం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-05-21T05:28:20+05:30 IST