Advertisement

ఏమార్చి.. రికార్డులు మార్చి

Jan 14 2021 @ 00:24AM
వాల్తేరు క్లబ్‌ భూములకు సంబంధించి రికార్డులు పరిశీలిస్తున్న సిట్‌ చైర్మన్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌, సభ్యురాలు అనురాధ (ఫైల్‌)

జీవీఎంసీలో బయటపడిన బాగోతం

వాల్తేరు క్లబ్‌ భూముల విచారణలో బహిర్గతం

టౌన్‌ సర్వే రికార్డులో లీజుదారుల పేర్లు!

ట్యాంపరింగ్‌ జరిగినట్టు గుర్తించిన సిట్‌

రికార్డుల్లో కొట్టివేతలు, దిద్దుళ్లు

ఎవరు దిద్దారు?, ఎందుకు దిద్దారు?...

కమిషనర్‌ సంతకంతో కూడిన నివేదిక సమర్పించాలని ఆదేశం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): తీగ లాగితే డొంకంతా కదులుతోంది. విశాఖపట్నంలో విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూముల రికార్డులను ట్యాంపరింగ్‌ చేసే ప్రక్రియ కొన్ని దశాబ్దాలుగా చాప కింద నీరులా సాగుతోంది. ఇలా మధురవాడ, కొమ్మాది, భీమిలి ప్రాంతాల్లో దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూముల రికార్డులను మార్చేయగా... ఈ విషయాన్ని 2017 ప్రథమార్థంలో అప్పటి కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ సృజన వెలికితీశారు. ఇప్పుడు గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఆధీనంలో వుండే టౌన్‌ సర్వే రికార్డుల్లో కూడా లోపాలు బయటపడ్డాయి.


ఎవరిపైనా చర్యలు లేవు

నాడు రికార్డుల ట్యాంపరింగ్‌పై విచారణ ప్రారంభించాక భీమిలి తహసీల్దార్‌ బీటీవీ రామారావును జైలుకు పంపారు. ఇందులో ఇంకా అనేక మంది పాత్ర వున్నట్టు వెల్లడైంది. అయితే ఉద్యోగులతో ఇవన్నీ చేయించింది రాజకీయ నాయకులని తెలియడంతో గత ప్రభుత్వం దీనిపై విచారణకు ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ (సిట్‌) ఏర్పాటుచేసింది. మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధుల పేరుతో సాగిన భూ దందాల్లో ఉత్తరాంధ్ర నాయకుల ప్రమేయం, ఐఏఎస్‌ అధికారుల సహకారం వుందని సిట్‌ నివేదిక సమర్పించింది. ఆ తరువాత కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం మరో సిట్‌ను వేసింది. దీనికి మాజీ ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ను అధ్యక్షునిగా పెట్టి, మరో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిణి అనురాధ, రిటైర్డ్‌ జిల్లా జడ్జి భాస్కరరావును సభ్యులుగా వేశారు. వీరు కూడా 14 నెలులగా విచారణ చేస్తున్నారు. నివేదిక సిద్ధం చేశారు. నేడో, రేపో ప్రభుత్వానికి సమర్పిస్తామని నెల రోజుల నుంచి చెబుతున్నారు.


ఆఖరి నిమిషంలో వాల్తేరు క్లబ్‌పై విచారణ

వాల్తేరు క్లబ్‌కు చెందిన భూములపై అధికార పార్టీకి చెందిన నేతల కన్ను పడడంతో దానిని చేజిక్కించుకోవడానికి వ్యూహాత్మకంగా ఓ వ్యక్తితో అవి ప్రభుత్వ భూములని సిట్‌కు ఫిర్యాదు చేయించారు. దాని ఆధారంగా ఇటు వాల్తేరు క్లబ్‌ ప్రతినిధులను, అటు ఆ భూమిని లీజుకు ఇచ్చిన అసలు వారసులను తమ ముందు ఆధారాలతో హాజరు కావాలని సిట్‌ నోటీసులు ఇచ్చింది. మరో వైపు జిల్లా కలెక్టర్‌ నుంచి నివేదిక కోరింది. ఇంకో వైపు టౌన్‌ సర్వే రికార్డుల్లో వాల్తేరు క్లబ్‌ భూముల గురించి ఏముందో తమ ముందు పెట్టాలని జీవీఎంసీ ఎస్టేట్‌ ఆఫీసర్‌ను ఆదేశించింది. ఈ విచారణలో మరో బాగోతం బయటకు వచ్చింది. నాడు మండల తహసీల్దార్లు 1-బి రికార్డులను దిద్దేసి ట్యాంపరింగ్‌ చేసినట్టుగానే...జీవీఎంసీ టౌన్‌ సర్వే విభాగం సిబ్బంది కూడా రికార్డులను దిద్దేశారని సిట్‌ సభ్యులు గుర్తించారు. ఇన్‌చార్జి ఎస్టేట్‌ అధికారి మహాపాత్రో, సర్వేయర్‌ తీసుకువచ్చిన రికార్డుల్లో సిరిపురంలోని టౌన్‌ సర్వే నంబర్లు 1012, 1016, 1018, 1021 తదితర వాటిల్లో కొన్ని భూములు 1922 నాటికే ‘వాల్తేరు క్లబ్‌’ పేరుతో వుండడాన్ని గుర్తించారు. రికార్డులో అక్కడక్కడా కొట్టివేతలు, దిద్దుబాట్లు వున్నట్టు గమనించారు. వీటిపై సిట్‌ అధికారులు జీవీఎంసీ ఎస్టేట్‌ అధికారిని ప్రశ్నించారు. ఎవరు దిద్దారు?, ఎందుకు దిద్దారు?, దానికి సంబంధించిన పత్రాలు ఏమిటి? తదితర వివరాలతో జీవీఎంసీ కమిషనర్‌ సంతకం చేసిన నివేదికను సమర్పించాలని ఆదేశించారు. దాంతో టౌన్‌ సర్వే విభాగం అధికారులకు నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. 


ఇవన్నీ లోపాలే...!

18వ శతాబ్దం చివరి దశలో పేర్ల కుటుంబం నుంచి వాల్తేరు క్లబ్‌ కోసం 31 ఎకరాలను లీజుకు తీసుకున్నారు. దీనికి సంబంధించి 1900లో లీజు అగ్రిమెంటు జరిగినట్టు చెబుతున్నారు. లీజు కాలం 99 సంవత్సరాలు. భూములు లీజుకు ఇచ్చినా ప్రభుత్వ రికార్డుల్లో యజమాని పేరే వుంటుంది తప్ప లీజుదారుడి పేరు ఉండదు. కానీ జీవీఎంసీ 1922లో సర్వే చేసినప్పుడు ఆ రికార్డుల్లో భూ యజమాని పేరు తీసేసి వాల్తేరు క్లబ్‌ పేరును చేర్చారు. అంటే వారి పేరు మీదకు హక్కులు మారిపోయినట్టు రికార్డు సృష్టించారు. ఆ రెండు పార్టీల మధ్య ఎటువంటి లావాదేవీలు జరగకుండానే పేరు మార్చేశారు. ఇప్పుడు సిట్‌ విచారణతో రికార్డు దిద్దారనే విషయం, అందులో భూ యజమానులుగా వాల్తేరు క్లబ్‌ వుందనే విషయం బయటకు పొక్కింది. ఇలా...ఇంకెన్ని భూముల రికార్డులను దిద్దారో తెలియదు. అయితే రికార్డుల్లో ఎక్కడికక్కడే దిద్దుబాట్లు వున్నట్టు సిట్‌ సభ్యులు గుర్తించారు. అందుకే వాటికి సంబంధించిన వివరాలు అందజేయాలని ఆదేశించారు.


ఇదీ విధానం...!

భూ రికార్డుల్లో పేర్లు ఏమైనా మార్చాలంటే ఒకటి...మ్యుటేషన్‌ జరగాలి. లేదంటే...జీవీఎంసీ  లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు భూమి ఫలానా అంటూ రిపోర్టు ఇస్తే, దానిని ఏసీపీ ధ్రువీకరించాలి. అప్పుడు ఎస్టేట్‌ విభాగంలో రికార్డులు మారుస్తారు. అయితే చాలాకాలంగా ఎవరు పడితే వారు రికార్డులను మార్చేస్తున్నారని గుర్తించి, సత్యనారాయణ కమిషనర్‌గా వున్నప్పుడు ఏసీపీలకు ధ్రువీకరించే అధికారం తీసేశారు. కమిషనర్‌ మాత్రమే అలాంటి మార్పులు చేయాలని నిబంధన పెట్టారు. అయితే వాల్తేరు క్లబ్‌కు సంబంధించిన భూములు ఎప్పుడో దిద్దేసినట్టు తెలుస్తోంది. అది ఎవరి హయాంలో జరిగిందో తెలియాలంటే...శాస్త్రీయమైన విచారణ జరగాలి. రెవెన్యూ రికార్డులను పూర్తిగా వెరిఫై చేసినట్టు జీవీఎంసీ టౌన్‌ సర్వే రికార్డులను కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది.


అవసరమైతే ఫోరెన్సిక్‌ పరీక్షలు చేయిస్తాం: సృజన, కమిషనర్‌, జీవీఎంసీ

టౌన్‌ సర్వే రికార్డుల్లో దిద్దుబాట్లు వున్న విషయం ఇంకా నాకు తెలియదు. సెలవులో ఉన్నాను. ఒకవేళ అలాంటి పొరపాట్లు జరిగితే...వాటిని ఎవరు చేశారో, ఎన్నాళ్ల క్రితం చేశారో తెలుసుకోవడానికి అవసరమైతే ఫోరెన్సిక్‌ పరీక్షలు చేయిస్తాం.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.