ltrScrptTheme3

వరి విత్తనాలకు అందని రాయితీ

Oct 22 2021 @ 23:56PM
ఏపీసీడ్స్‌లో పంపిణీకి సిద్ధంగా వరి విత్తనాలు

శ్రీకాళహస్తి, అక్టోబరు 22: ఎవరో చేసిన పాపం వేలాది మంది వరి రైతుల పాలిట శాపంగా మారింది. రాష్ట్రంలో జిల్లాకు మాత్రమే వరి విత్తన రాయితీ వర్తింపజేయక పోవడమే ఇందుకు కారణం. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు ఇతర రాష్ట్రాల విత్తనాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీటి సాగుతో అంతంతమాత్రంగా దిగుబడులు రావడంతో అన్నదాతలు నష్టాల బారినపడుతున్నారు. ప్రభుత్వం వరి విత్తన రాయితీ అమలు చేయక పోవడంతో, విత్తనోత్పత్తి తగ్గించేందుకు ఏపీసీడ్స్‌ నిర్ణయించింది. 

  వరి విత్తన కొనుగోలులో ఆయా రకాల మేరకు ప్రభుత్వం కిలోకు రూ.5 నుంచి రూ.10 వరకు రాయితీ అందిస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధానం అమలవుతున్నా, గత ప్రభుత్వాలు జిల్లాను వరి రాయితీ జాబితాలో చేర్చక పోవడం సమస్యగా మారింది. దీంతో కొన్నేళ్లుగా జిల్లా రైతులు రాయితీ వరి విత్తనాలు పొందలేని పరిస్థితి ఏర్పడింది. శ్రీకాళహస్తిలోని ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ(ఏపీసీడ్స్‌) వరి సాగులో అనుభవమున్న రైతులు, సారవంతమైన భూములను తొలుత ఎంపిక చేసుకుంటుంది. మూల విత్తనాలను ఆయా రైతులకు పంపిణీ చేస్తుంది. అనంతరం సంబంధిత రైతుల నుంచి వరి దిగుబడులను కొనుగోలు చేసి, నాణ్యమైన వరి విత్తనాలను సాధారణ రైతులకు అందుబాటులోకి తెస్తుంది. వీటి ద్వారా మంచి దిగుబడులు రావడంతో ఏపీసీడ్స్‌ విత్తనాలను మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. అయితే ప్రభుత్వం నుంచి వరి విత్తన రాయితీ అందక పోవడంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతోంది. ఈ కారణంగా బహిరంగ మార్కెట్‌ ధరతో పోల్చితే ఏపీసీడ్స్‌ విత్తనాల ధర అధికంగా ఉండటంతో అన్నదాతలు ప్రైవేటు దుకాణాల వైపు మొగ్గుచూపుతున్నారు. 


విస్తీర్ణం పేరుతో వివక్ష... 

వరి రాయితీ అమలు జాబితాలో జిల్లా పేరు లేకపోవడానికి సాగు విస్తీర్ణమే కారణమని ప్రభుత్వం చెబుతోంది. సాధారణంగా 50వేల హెక్టార్ల కంటే అధికంగా సాగు చేస్తేనే రాయితీ వర్తిస్తుందనీ, అంతకన్నా తక్కువుంటే కుదరదని స్పష్టం చేస్తోంది. కానీ, జిల్లాలో 60వేల హెక్టార్లకు పైగా వరి పంట సాగవుతోంది. తూర్పుమండలాలు పూర్తిగా వరిసాగుపైనే ఆధారపడ్డాయి. 35 వేల చెరువులు, 47వేల బోర్ల కింద పంట సాగవుతోంది. ఖరీఫ్‌, రబీ సీజన్‌ వారీగా 400 మెట్రిక్‌ టన్నుల వరి దిగుబడులు వస్తున్నా, ప్రభుత్వ రాయితీ అందడం లేదు. 


జిల్లా నేతలు విన్నవిస్తున్నా.. 

వరి విత్తన రాయితీ విషయమై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పలుమార్లు వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులకు లిఖితపూర్వకంగా వినతులు అందజేశారు. ఎమ్మెల్యేలు మధు, ఆదిమూలం, రోజా ప్రభుత్వానికి లేఖలు రాసినా, బుట్టదాఖలయ్యాయి. రాష్ట్రంలో కేవలం జిల్లాకు మాత్రమే వరి విత్తన సబ్సిడీ వర్తింపజేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. పదిరోజుల కిందట నెల్లూరు జిల్లాలోనూ వరి విత్తన రాయితీని తొలగించారు. దీంతో అక్కడి ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, రెండురోజుల్లోనే రాయితీ అమలయ్యేలా చూశారు. అన్నీవెరసి బహిరంగ మార్కెట్లో జిల్లా రైతులు అధిక ధరకు వరి విత్తనాలు కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. అధికశాతం ప్రైవేటు దుకాణాల వద్ద ఏపీసీడ్స్‌ డీలర్లమంటూ పెద్దబోర్డులు దర్శనమిస్తున్నా, ఒక్క బస్తా కూడా ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన దాఖలాలు ఉండడం లేదు. 95 శాతం దుకాణాల్లో పొరుగురాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న వరి విత్తనాలే దర్శనమిస్తున్నాయి. అయితే వీటి సాగుతో దిగుబడులు అంతంతమాత్రంగా ఉండడంతో రైతులు నష్టాలబాటన పడుతున్నారు. 


రాయితీ అమలుతో ప్రయోజనాలు: సుబ్బయ్య, ఏపీసీడ్స్‌ జిల్లా మేనేజరు

 వరి రాయితీ అమలుతో జిల్లా రైతులకు ఎన్నో ప్రయోజనాలు సమకూరుతాయి. గత ఏడాది రాయితీ లేక రూ.6కోట్ల విలువైన విత్తనాలు గోడౌన్లలో మిగిలిపోయాయి. 2వేల టన్నుల ధాన్యం రైస్‌మిల్లర్లకు తరలించడంతో రూ.కోటికిపైగా నష్టం వాటిల్లింది. ఈ ఏడాది 70వేల క్వింటాళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించగా, 50వేల క్వింటాళ్లకుపైగా నిల్వలు ఉండిపోయాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా వచ్చే ఏడాది 35వేల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే ఉత్పత్తి చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.