రైతులపై వివక్ష

ABN , First Publish Date - 2021-11-29T04:50:34+05:30 IST

రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.

రైతులపై వివక్ష
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి

సమస్యలు పట్టించుకోని పాలకులు 

మాజీ ఎమ్మెల్యే కందుల 

మార్కాపురం, నవంబరు 28: రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుల పక్షపాత ప్ర భుత్వం అని చెప్తున్న ఆ పార్టీ నాయకులు రైతు సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో  చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, కర్నూలు జి ల్లాలలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు.  ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి కేవలం చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలలో పంట నష్టపరిహారం అంచనాలు తయారు చే యమని ఆదేశాలివ్వడం సరికాదన్నారు. ప్రకాశం జిల్లా రైతులు ఏమి అన్యాయం చేశారని కందుల ప్రశ్నించారు. 

ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రకాశం జిల్లాలో పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం అందజేయాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి డిమాండ్‌ చేశారు. పక్కా గృహాలకు డబ్బులు కడితే రిజిస్ట్రేషన్‌ చేస్తామని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. కేవలం ఖాళీ అయిన ఖజానా నింపుకోవడానికి మాత్రమే ఈ తతంగం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.  డ్వాక్రా మహిళలతో డబ్బులు కట్టని వారిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నా రన్నారు. గ్రామీణ ప్రాంతాలలో డబ్బులు చెల్లించని వారికి ఇతర సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని భయపెడుతు న్నారని కందుల అన్నారు. 

ఎవరూ ఓటీఎస్‌ కోసం రూపాయి కూడా కట్టవద్దని కందుల నారాయణరెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే ఉచితంగా రిజిస్ట్రేషన్‌లు చేస్తుందని లబ్ధిదారులకు కందుల భరోసా ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వక్కలగడ్డ మల్లికార్జునరావు, టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, పట్టణ అధ్యక్షుడు డాక్టర్‌ షేక్‌ మౌలాలి, మస్తానయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-29T04:50:34+05:30 IST