వ్యవసాయ యాంత్రీక‘రణం’

ABN , First Publish Date - 2022-06-27T06:53:10+05:30 IST

కూలీల కొరతను అధిగమించేందుకు... పెట్టుబడులు తగ్గించుకునేందుకు రైతులు ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణవైపు మొగ్గుచూపుతున్నారు. నారమడులు వేయడం మొదలు కోతల సమయం వరకు మందులను పిచికారీ చేసేందుకు అన్నదాతలు ఆధునిక యంత్రాలను వినియోగిస్తున్నారు.

వ్యవసాయ యాంత్రీక‘రణం’
అంబాజీపేటలో రైతులకు పవర్‌ టిల్లర్లు అందిస్తున్న ప్రజాప్రతినిధులు (పాత చిత్రం)

  • ఐదుగురు గ్రూపుగా ఏర్పడితేనే యంత్రాల మంజూరు 
  • రైతుల మధ్య అభిప్రాయ భేదాలు
  • వ్యక్తిగతంగా మంజూరు చేయాలని వినతి

అంబాజీపేట, జూన్‌ 26: కూలీల కొరతను అధిగమించేందుకు... పెట్టుబడులు తగ్గించుకునేందుకు రైతులు ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణవైపు మొగ్గుచూపుతున్నారు. నారమడులు వేయడం మొదలు కోతల సమయం వరకు మందులను పిచికారీ చేసేందుకు అన్నదాతలు ఆధునిక యంత్రాలను వినియోగిస్తున్నారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ యంత్రాలు, పనిముట్లను వ్యక్తిగతంగా అందించేవారు. ప్రసుత్త ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు ట్రాక్టర్లు, పవర్‌టిల్లర్లు, కోత యంత్రాలను రాయితీపై ఇస్తోంది. అయితే వీటిని పది మంది గ్రూపుగా ఏర్పడితేనే మంజూరు చేస్తోంది. తీరా తీసుకున్నాక ఒకరు వినియోగించేటప్పుడు వాహనం, యంత్రంలో ఏదైనా రిపేరు వస్తే ఆ భారం అందరిపైనా పడుతోంది. అలాంటప్పుడు రైతుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతున్నాయి. 

పి.గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట, పి.గన్నవరం, మామిడికుదురు మండలాలకు సంబంధించి 2021-22 ఆర్థిక సంవత్సరానికి హార్వెస్టర్లు, పవర్‌ టిల్లర్లు, ట్రాక్టర్లను గ్రూపులకు మంజూరు చేశారు. మూడు మండలాలకు 136 పవర్‌ టిల్లర్లు మంజూరయ్యాయి. పవర్‌ టిల్లర్‌ ధర రూ.1.86 లక్షలు కాగా ప్రభుత్వం రూ.1.16 లక్షలు రాయితీ ఇస్తోంది. అంబాజీపేటకు 2, గన్నవరానికి 2 హార్వెస్టర్లు మంజూరు చేశారు. హార్వెస్టర్‌ ధర రూ.26 లక్షలు కాగా రూ.8.80 లక్షలు రాయుతీ ఇచ్చింది. అంబాజీపేటకు 2, పి.గన్నవరానికి 5, మామిడికుదురుకు 3 ట్రాక్టర్లు మంజూరు చేశారు. ట్రాక్టరు ధర రూ.7.50 లక్షలు కాగా రూ.2.90 లక్షలు రాయితీ అందిస్తోంది.

రైతు భరోసా కేంద్రంలో రైతులు గ్రూపుగా ఏర్పడితే యంత్రాలను మంజూరు చేస్తున్నారు. ఒక్కో ఆర్బీకేలో ఐదుగురు సభ్యులుగా వున్న వారికే ఇవి ఇస్తుండడంతో మిగిలిన రైతులకు యంత్రాల కోసం తిప్పలు తప్పట్లేదు. యంత్రాలను అద్దెకు తెచ్చుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. అద్దెకు తెచ్చుకున్న యంత్రాలకు సుమారు రూ.వెయ్యికి పైగా చెల్లించాల్సి వస్తోంది. ఈ కారణంగా ప్రభుత్వం చిన్న చిన్న యంత్రాలనైనా ప్రతీ రైతులకు వ్యక్తిగతంగా మంజూరు చేయడం ద్వారా రైతులకు ఖర్చులు తగ్గుతాయని అభిప్రాయపడుతున్నారు. 


పనులు సాగడం లేదు

సానబోయిన రామకృష్ణ, రైతు, గంగలకుర్రు

ట్రాక్టర్లు, పవర్‌టిల్లర్‌ లేనిదే పంట సాగు చెయ్యలేకపోతన్నాం. ఒక పంట తరువాత మరో పంట వెయ్యాలన్నా, దుక్కి, కలుపు దున్నుకోవాలన్నా యంత్రాలు అవసరం. మందులు పిచికారీ సైతం తలకు మించిన భారమవుతోంది. చిన్న యంత్రాలకు రూ.500 నుంచి రూ.1,000 చెల్లించాల్సి వస్తోంది. ఇక కూలీలకు అంతకు మించి అవుతున్నాయి. చివరగా పంట దిగుబడి అటు, ఇటు అయితే పెట్టిన ఖర్చంతా వృధా అవుతుంది. ప్రభుత్వం రైతులకు వ్యక్తిగతంగా గతంలో మాదిరిగా రాయితీ ధరలపై యంత్రాలను మంజూరు చేయాలి.


ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

ఎస్‌జేవీ రామ్మోహనరావు, ఏడీఏ, పి.గన్నవరం

వ్యవసాయ సమావేశాలు, పంటల సందర్శన సమయాల్లో రైతులు సమస్యలను మా దృష్టికీ తీసుకువస్తున్నారు. యంత్ర సేవా పథకంలో మార్పులు చేయాలని ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. వ్యవసాయ సలహా మండలి సమావేశం ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాం. గ్రూపు సభ్యుల్లో సఖ్యత కొరవడినప్పుడు రైతుల మధ్య విభేదాలు మొదలవుతున్నట్టు తెలుస్తోంది. వ్యవసాయం చేసుకునే వారికి వ్యక్తిగతంగా రాయితీపై యంత్రాలను అందించే విధంగా ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి పథకాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-06-27T06:53:10+05:30 IST