వ్యాధులు ముసిరే.. సేవలు కొసరే..!

ABN , First Publish Date - 2022-08-13T05:07:44+05:30 IST

జిల్లాలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. పల్లె, పట్టణం అన్ని తేడా లేకుండా అన్నిచోట్లా జ్వరాల తీవ్ర కనిపిస్తోంది. గత పది రోజులుగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే రోగుల్లో సగం మంది జ్వరపీడితులే ఉంటున్నారు. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న వారు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తున్నారు. డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా భయం వెంటాడుతుంటడంతో కాస్తంత బాగా లేకపోయినా ఆస్పత్రులకు జనం పరుగులు పెడుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వ వైద్యం పడకేసింది.

వ్యాధులు ముసిరే..   సేవలు కొసరే..!
ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న జ్వర పీడితులు

 జిల్లాలో విజృంభిస్తున్న సీజనల్‌ వ్యాధులు 

జ్వరపీడితులతో ఆస్పత్రులు కిటకిట

భారమైన ప్రైవేటు వైద్యం

ప్రభుత్వాస్పత్రుల్లో నిలువెల్లా నిర్లక్ష్యం

అనేకచోట్ల వైద్యులు, సిబ్బంది కొరత

సరిపడా బెడ్లు లేక అవస్థలు

కొన్ని పీహెచ్‌సీల్లో మందులూ కరువు

పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్‌లకు

వెళ్లాల్సిన దుస్థితి 

అల్లాడుతున్న పేదలు 


ఒంగోలు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) :


జిల్లాను వ్యాధులు మురుసురుతున్నాయి. విష జ్వరాలు, డెంగ్యూ విజృంభిస్తున్నాయి. టైఫాడ్‌ కేసులు కూడా అధికంగా నమోదవుతున్నాయి. ఇదేసమయంలో కరోనా కూడా పాజిటివ్‌లు కూడా మళ్లీ వెలుగు చూస్తున్నాయి. దీంతో ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ప్రైవేటు వైద్యం భారమవడంతో ప్రభుత్వ వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. అయితే అక్కడ వారికి సరైన సేవలు అందడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. కొన్నిచోట్ల అవసరం మేరకు ఉన్నప్పటికీ వారు సకాలంలో విధులకు హాజరు కావడం లేదు. మరికొన్ని చోట్ల సరిపడా బెడ్లు కరువయ్యాయి. ల్యాబ్‌లు పనిచేయపోవడంతో రక్త పరీక్షలకు ప్రైవేటుకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. కొన్నిప్రాంతాల్లో మందుల కొరత కూడా తీవ్రంగా ఉండటంతో వైద్యులు బయటకు రాస్తున్నారు. ఇటు పరీక్షలు, ఇటు మందులకు అధికమొత్తం వెచ్చించాల్సి వస్తుండటం పేదలకు భారంగా మారింది. శుక్రవారం జిల్లావ్యాప్తంగా ‘ఆంధ్రజ్యోతి’ బృందం నిర్వహించిన ప్రభుత్వ వైద్యశాలల విజిట్‌లో ఇలాంటి అనేక విషయాలు వెలుగు చూశాయి.   


 జిల్లాలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. పల్లె, పట్టణం అన్ని తేడా లేకుండా అన్నిచోట్లా జ్వరాల తీవ్ర కనిపిస్తోంది. గత పది రోజులుగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే రోగుల్లో సగం మంది జ్వరపీడితులే ఉంటున్నారు. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న వారు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తున్నారు. డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా భయం వెంటాడుతుంటడంతో కాస్తంత బాగా లేకపోయినా ఆస్పత్రులకు జనం పరుగులు పెడుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వ వైద్యం పడకేసింది. కొన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో సరిపడా వైద్యులు, సిబ్బంది లేకపోవడం సమస్యగా మారింది. ఒక వేళ ఉన్నా సకాలంలో వచ్చి రోగులను చూసే పరిస్థితి లేని దుస్థితి నెలకొంది. మరికొన్ని చోట్ల జ్వరపీడితుల సంఖ్య భారీగా పెరిగి ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు బెడ్లు లేక అవస్థ పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలల్లో శుక్రవారం ఆంధ్రజ్యోతి బృందం  నిర్వహించిన విజిట్‌లో ఇవి బహిర్గతమయ్యాయి. సీజనల్‌ వ్యాధులు ఉధృతి, రోగులకు వైద్యం అందని దుస్థితి పలుచోట్ల  కనిపించింది. గతంతో పోల్చితే జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో సీజనల్‌ వ్యాధులు ఉధృతి అధికంగా ఉంది. 

ఈ ఏడాది ఇప్పటికే 75వేలు దాటిన జ్వరం కేసులు

అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 2020లో 1.70 లక్షలు, 2021లో 1.54 లక్షలు మంది జ్వరంతో ఆస్పత్రులకు రాగా ఈ ఏడాది జూలై ఆఖరు వరకే 75వేల మందికి పైగా వచ్చారు. వీరిలో విష జ్వరం బాధితులు 2020లో 22.541మంది, 2021లో 24,518, మంది చికిత్స పొందగా ఈ ఏడాది జూలై ఆఖరు వరకు 5641 మంది ఉన్నారు. టైఫాయిడ్‌ బాధితులు 2020లో 854 మంది, 2021లో 754 మంది ఉండగా ఈ ఏడాది జూలై ఆఖరు వరకు 387 మంది ఉన్నారు. కాగా గత వారం పది రోజుల నుంచి ఈ తరహా రోగాల బారిన అధిక సంఖ్యలో పడుతున్నారు. వర్షాకాలం ఇంకా ముందు ఉండగా వర్షాలు పెరిగాక సీజనల్‌ వ్యాధులు ఉధృతి మరింత అధికమ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 


ప్రభుత్వ వైద్యశాలల్లో అన్నీ సమస్యలే!

ప్రస్తుతం సీజనల్‌ వ్యాధుల ఉధృతి, ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలిస్తే అత్యధిక ప్రాంతాల్లో రోజువారీ వచ్చే రోగులలో సగం మంది జ్వరపీడీతులు ఉంటున్నారు. వారిలో అత్యధిక మందికి ప్రభుత్వ వైద్యం అంతంతమాత్రంగానే అందుతోంది. శుక్రవారం ఆంధ్రజ్యోతి బృందం పరిశీలనలో ఈ విషయం స్పష్టమైంది. గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు 260 మంది వైద్యం కోసం రాగా వారిలో 25 మంది జ్వరపీడితులే ఉన్నారు. అక్కడ రోగులకు అవసరమైన స్థాయిలో పడకలు లేక ఒక్కో బెడ్‌పై ఇద్దరు, ముగ్గురికి చికిత్స చేస్తున్నారు. గది  లేక ఎక్స్‌రే వాడడం లేదు. 


కంభంలో సెలైన్‌ బాటిల్‌ కూడా లేని వైనం

కంభంలో సెలైన్‌ బాటిల్స్‌ కూడా ఆస్పత్రిలో లేక బయటి నుంచి తెప్పించుకొని వాడుతున్నారు. కొమరోలులో ఎక్స్‌రే, ఈసీజీ పనిచేయకపోవడంతోపాటు మందులకు కూడా కొరత ఉండటంతో రోగులను గిద్దలూరు పంపుతున్నారు. టంగుటూరులో 24 గంటల ఆస్పత్రి అయినా శుక్రవారం ఉదయం డ్యూటీ డాక్టర్‌ సెలవులో ఉండటంతో వచ్చిన వంద మందికి పైగా రోగులకు ఫార్మాసిస్టు మందులు ఇవ్వడం కనిపించింది. వారిలో అత్యధికులు జ్వరపీడితులు ఉన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు రావాల్సిన డాక్టర్‌ కూడా సకాలంలో రాలేదు. కొండపిలో బెడ్ల కొరత అధికంగా ఉండగా ఒక్క పూట వైద్యం మాత్రమే అందుతోంది. ఎర్రగొండపాలెం ఏరియా వైద్యశాలకు వచ్చేవారిలో గత పదిరోజులుగా రోజుకు 30నుంచి 40 మంది జ్వరపీడితులు ఉంటున్నారు. దూపాడు పీహెచ్‌సీకి వచ్చిన 31 మందిలో 12 మంది జ్వరబాధితులు ఉన్నారు. ముండ్లమూరు పీహెచ్‌సీ రోగులతో కిటకిటలాడింది. ఉదయం 11 గంటలకే అక్కడ 66 మంది వైద్యం కోసం వచ్చారు. తర్లుబాడు పీహెచ్‌సీలో ఉన్న ఇద్దరు డాక్టర్లు విధులకు హాజరుకాకపోవడంతో వైద్యం కోసం వచ్చిన రోగులు ఇంటి బాటపట్టారు. మార్కాపురం వైద్యశాలలో రోగులు బారులు తీరి కనిపించారు. కనిగిరి ఏరియా వైద్యశాలలో బెడ్లు నిండిపోయాయి. అయితే అక్కడ ప్రాథమిక చికిత్స మినహా పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. రాచర్ల మండలం అనుమలవీడులో 24 గంటల వైద్యశాల అయినా కేవలం రెండు గంటలు మాత్రమే డాక్టర్లు డ్యూటీ చేసి వెళ్లిపోయారు. కొత్తపట్నంలో ఉదయం 9గంటలకు కూడా వైద్యులు రాలేదు. మద్దిపాడులో రోగుల  రద్దీ అధికంగా కనిపించింది. దోర్నాల వైద్యశాల కిటకిటలాడింది. అటవీ సమీప గ్రామాల్లో జ్వరాల తీవ్రత అధికంగా ఉండటంతో అక్కడ రోగులు ఎక్కువగా ఉన్నారు. దర్శి ప్రాంతంలోని ప్రభుత్వ వైద్యశాలల్లో సౌకర్యాల కొరత తీవ్రంగా ఉండటంతో పేదలకు వైద్యం సరిగా అందడం లేదు. 


రిమ్స్‌లో పరిస్థితి అధ్వానం 

జిల్లా కేంద్రంలో ఉన్న పెద్దాస్పత్రి రిమ్స్‌ పరిస్థితి ఆధ్వానంగా ఉంది. అక్కడ  రోగులకు అంతంతమాత్రంగానే సేవలు అందుతున్నాయి. సిబ్బంది, వైద్యులు సకాలంలో విధులకు హాజరుకాని పరిస్థితి నెలకొంది. అక్కడకు వచ్చిన రోగుల్లోనూ అత్యధికులు జ్వరపీడితులే ఉన్నారు. ఇప్పటికే సీజనల్‌ వ్యాధులు ఉధృతి పెరగ్గా రానున్న మూడు, నాలుగు మాసాలు మరింత దారుణంగా ఉండనున్నాయి. జిల్లాలో సాధారణంగా సెప్టెంబరు నుంచి నవంబరు వరకు అధికంగా వర్షాలు కురుస్తాయి. ఆ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధులు మరింత ప్రబలే అవకాశం ఉంది. అందుకు పారిశుధ్య పరిస్థితులు ప్రధాన కారణమవుతున్నాయి. తక్షణం యంత్రాంగం దృష్టి సారించి పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు, ప్రభుత్వ వైద్యశాలల్లో పరిస్థితి మెరుగునకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 





Updated Date - 2022-08-13T05:07:44+05:30 IST