బీజేపీ నేతలను ఉరికించండి

ABN , First Publish Date - 2021-12-18T07:39:43+05:30 IST

బీజేపీతో ఇక యుద్ధమేనని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఆ పార్టీతో అమీ తుమీ తేల్చుకుందామని టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు, నేతలకు స్పష్టం చేశారు.

బీజేపీ నేతలను ఉరికించండి

  • గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోండి
  • తెలంగాణ బిడ్డల పౌరుషాన్ని గుజరాత్‌ గులాములకు చూపించాలి
  • బీజేపీపై జనానికి అసహ్యం పుట్టేలా చేయాలి..
  •  కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలి
  • 20న అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు.. 
  • శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనం చేయాలి
  • ధాన్యాన్ని కేంద్రం ఎందుకు కొనదో చూద్దాం.. 
  • దళితబంధు లబ్ధిదార్ల ఎంపిక ఎమ్మెల్యేలకే
  • టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌


హైదరాబాద్‌, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): బీజేపీతో ఇక యుద్ధమేనని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఆ పార్టీతో అమీ తుమీ తేల్చుకుందామని టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు, నేతలకు స్పష్టం చేశారు. బీజేపీ నేతలను గ్రామాల్లోకి రానివ్వవద్దని, వచ్చినవారిని ఉరికించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బిడ్డల పౌరుషాన్ని గుజరాత్‌ గులాములకు చూపించాలన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం పనిచేయకుండా.. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేందుకే ప్రాధాన్యమిస్తోందని ఆరోపించారు. ‘‘కాశీ పర్యటనలో దేశానికి, నియోజకవర్గానికి బీజేపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి కానీ.. వేరే ఏదో మాట్లాడితే ఎలా?’’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి కేసీఆర్‌ ప్రశ్నించారు. హిందువులకు కూడా ఎంతోమంది దేవుళ్లు ఉంటారని, ఎవరి సంస్కృతులకు తగ్గట్టుగా వారి దేవుళ్లను కొలుస్తుంటారని తెలిపారు. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక కేంద్ర ప్రభుత్వానికి అప్పులు ఎక్కువయ్యాయని, గతంలో ఏ ప్రధాని హయాంలోనూ ఈ పరిస్థితి లేదని అన్నారు.


ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి, విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 20న అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ శవయాత్రలు నిర్వహించాలని, దిష్టిబొమ్మలను దహనం చేయాలని అన్నారు.  రైతు వేదికల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతులెత్తేసినందునేరాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనడంలేదన్న విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలని నేతలను ఆదేశించారు. దీంతోపాటు వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగుపై రైతుల్లో చైతన్యం కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గ్రామగ్రామాన కోటి సంతకాల సేకరణ చేపట్టాలన్నారు. బీజేపీ అంటేనే జనానికి అసహ్యం కలిగేలా చేయాలన్నారు. ఆహార భద్రత చట్టం లో ఉన్నదేంటి? కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదేంటని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు రూ.5 వేల కోట్లో, రూ.10 వేల కోట్లో నష్టాన్నైనా భరించాలి కదా! అని వ్యాఖ్యానించారు. 


మంత్రులంతా ఢిల్లీకి వెళ్లాలి..

మంత్రులంతా తమ కార్యక్రమాలను రద్దు చేసుకుని ఢిల్లీకి వెళ్లాలని, వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రిని కలవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కేంద్ర మంత్రులు సమయం ఇవ్వకపోయినా అక్కడే కూర్చుని తేల్చుకొని రావాలన్నారు. తాను కూడా వనపర్తి, జనగామ జిల్లాల పర్యటనను వాయిదా వేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. బీజేపీ వైఖరిని నిరసిస్తూ ఎప్పటికప్పుడు కార్యాచరణ రూపొందించి పంపిస్తామని, క్షేత్రస్థాయిలో దానిని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. 


ఎమ్మెల్యేలు జనంలోనే ఉండాలి..

ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉందని, పార్టీ ఎమ్మెల్యేలంతా ఇప్పటినుంచే జనంలో ఉండాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ప్రజలతోనే ఉండి ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరును వారికి అర్థమయ్యేలా వివరించాలన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట్ల స్థానిక ఎంపీ, ఎమ్మెల్సీ, కార్పొరేషన్‌ చైర్మన్‌ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజల్లో ఉండి పనిచేసే ఎమ్మెల్యేలను తాను మళ్లీ గెలిపించుకుంటానని భరోసా ఇచ్చారు. ప్రజలకు దూరంగా ఉంటే తాను కూడా చేయగలిగేదేమీ ఉండదన్నారు. ఎవరేం చేస్తున్నారో తాను తెలుసుకుంటూనే ఉంటానన్నారు. పాతవాళ్లు ఉండగా.. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 2018 ఎన్నికల్లోనూ కొంతమంది తాను చెప్పినా వినలేదని, అందుకే ఆరేడుగురికి టికెట్లు ఇవ్వలేదని తెలిపారు. ఇప్పుడు కూడా ముందే చెబుతున్నానని, తరువాత తనను ఏమీ అనొద్దని కేసీఆర్‌ నవ్వుతూ వ్యాఖ్యానించారు. సర్పంచ్‌ నుంచి ఎంపీ దాకా రాష్ట్రమంతా ఒకే పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. వచ్చేసారి కూడా అధికారం మళ్లీ మనదేనని, టీఆర్‌ఎ్‌సను ఎదుర్కొనే శక్తి రాష్ట్రంలో ఏ పార్టీకీ లేదని ధీమా వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను సమావేశంలో ముఖ్యమంత్రి అభినందించారు. నామినేటెడ్‌ పదవులు, పార్టీ పదవులన్నింటినీ భర్తీ చేస్తానని, ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. సమయాన్ని బట్టి అందరికీ పదవులు వస్తాయన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై వారం రోజుల్లో ప్రకటన ఉంటుందని తెలిపారు. జిల్లా కమిటీలకు అధ్యక్షుడిని నియమించాలా, లేక కన్వీనర్‌ను నియమించాలా.. అన్నదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యేలతో సీఎం ముఖాముఖి సమావేశమై.. వారి నియోజకవర్గాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 


విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టాలి..

దళితబంధుపై ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టాలని టీఆర్‌ఎస్‌ నేతలకు సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. హుజూరాబాద్‌తోపాటు నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో పూర్తిస్థాయులో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 100 చొప్పున కుటుంబాలకు అమలు చేసి తీరుతామన్నారు. దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకే అప్పగిస్తున్నామని, దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయని చెప్పారు. సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, నేతలు మాట్లాడుతూ.. రైతుబంధు తప్పనిసరిగా ఉండాల్సిందిగా రైతులు కోరుకుంటున్నట్లు చెప్పారు. దీనిపై సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘రైతుబంధు కావాలని రైతులు అంటున్నరు. వద్దని అధికారులు సూచిస్తున్నరు. మధ్యలో నేనెందుకు బద్‌నాం కావాలి? రైతుబంధును యథావిధిగా కొనసాగిద్దాం’’ అని అన్నారు. అయితే మిల్లర్లు, విత్తన కంపెనీలతో ఒప్పందం చేసుకున్న రైతులు మినహా.. మిగతా రైతులు యాసంగిలో వరి వేయకుండా వారికి ఎమ్మెల్యేలు అవగాహన కల్పించాలన్నారు


క్రాస్‌ ఓటింగ్‌పై కేసీఆర్‌ ఆరా

ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఓట్లు.. కాంగ్రెస్‌ అభ్యర్థి రాయల నాగేశ్వర్‌రావుకు భారీగా క్రాస్‌ కావడంపై సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. ఓట్లు ఎందుకు క్రాస్‌ అయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రాస్‌ ఓటింగ్‌పై ముఖ్యమంత్రికి మంత్రి పువ్వాడ అజయ్‌ నివేదిక సమర్పించారు. క్రాస్‌ ఓటింగ్‌ను ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ నివేదికలో జిల్లా నాయకత్వం విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నారు. ఖమ్మం నుంచి సీఎంను కలిసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు.. క్రాస్‌ ఓటింగ్‌కు సంబంధించి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిపై ఆయనకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. 

Updated Date - 2021-12-18T07:39:43+05:30 IST