వాడి పడేసే కవర్లు బంద్‌!

ABN , First Publish Date - 2021-10-17T04:39:52+05:30 IST

పర్యావరణానికి విఘాతం కలిగించే ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల వినియోగంపై మున్సిపాలిటీలో కొత్త నిబంధనలు ప్రకటించారు.

వాడి పడేసే కవర్లు బంద్‌!
ప్లాస్టిక్‌ కవర్‌లో కూరగాయలను తీసుకెళ్తున్న ఓ వ్యక్తి

ప్లాస్టిక్‌పై సమరం ప్రకటించిన మున్సిపాలిటీ

75 మైక్రాన్లలోపు కవర్లపై నిషేధం

మెదక్‌ మున్సిపాలిటీ, అక్టోబరు 16 : పర్యావరణానికి విఘాతం కలిగించే ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల వినియోగంపై మున్సిపాలిటీలో కొత్త నిబంధనలు ప్రకటించారు. 50 మైక్రాన్ల క్యారీ బ్యాగులను గతంలోనే నిషేధించగా ప్రస్తుతం 75 మైక్రాన్లలోపు మందం ఉన్న వాడిపడేసే కవర్లపై పూర్తి నిషేధం విధిస్తూ పర్యావరణ, అటవీ, వాతావరణ కేంద్ర మంత్రిత్వశాఖ ఇటీవలే జీఎ్‌సఆర్‌/571 జీవోను విడుదల చేసింది. 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన కవర్లను వాడినా.. అమ్మినా జరిమానా తప్పదని స్పష్టం చేసింది. 

టాస్క్‌ఫోర్స్‌ కమిటీల ఏర్పాటు

వాడిపడేసే కవర్లపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. మెదక్‌లో మున్సిపల్‌ కమిషనర్‌, హెల్త్‌ ఆఫీసర్‌, శానిటరీ సూపర్‌వైజర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, పోలీస్‌ కానిస్టేబుల్‌తో పాటు ఇద్దరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో  కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నెల 22 నుంచి వారం పాటు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి నిషేధించిన ప్లాస్టిక్‌ కవర్లను వినియోగిస్తున్న వారికి జరిమానాలు విధించనున్నారు. అనంతరం నెలకోసారి ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, దుకాణ సముదాయాల్లో తనిఖీలు నిర్వహించనున్నారు. 

చెత్త వేస్తే జరిమానా తప్పదు

మున్సిపాలిటీల్లో వాణిజ్య ప్రాంతాలను చెత్త రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోనున్నారు. ఈ నెల 31 నుంచి వాణిజ్య ప్రాంతాల్లో రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధించనున్నారు. రోజుకు 100 కిలోలకు పైగా వ్యర్థాలను ఉత్పత్తి చేసే వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌హాళ్లు, కూరగాయల మార్కెట్లు ఇకపై ఆన్‌సైట్‌ కంపోస్టింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. లేదంటే నవంబరు 10 నుంచి జరిమానాలు విధించనున్నారు. నవంబరు 28 నుంచి గుర్తించిన కాలనీలను చెత్తరహిత ప్రాంతాలుగా ప్రకటించి చెత్త పడేస్తే జరిమానా విధించనున్నటు కమిషనర్‌ శ్రీహరి తెలిపారు. 

తెరపైకి కొత్తగా ఆన్‌సైట్‌ కంపోస్టింగ్‌

ప్రధాన పట్టణాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌హాళ్ల నుంచి తడి, పొడి చెత్తను పారిశుధ్య కార్మికులు సేకరిస్తుంటారు. వాణిజ్య సముదాయాల నుంచి సేకరించిన చెత్త అంతేస్థాయిలో ఉండడంతో మున్సిపాలిటీకి పెనుభారంగా మారింది. చెత్తను వేరుచేసి వర్మీకంపోస్టు తయారు చేసేందుకు ఖర్చు అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో మున్సిపల్‌ యంత్రాంగం వాణిజ్య సముదాయాలు ఎవరికి వారే ఆన్‌సెట్‌ కంపోస్టింగ్‌ తయారు చేసుకోవాలని ఆదేశాలు జారీచేయబోతుంది. నవంబరు 10 తర్వాత ఆన్‌సెట్‌ కంపోస్టింగ్‌ చేసుకోని హోటళ్లపై భారీగా జరిమానా విధించనున్నారు. ఇదే విధానం త్వరలోనే గేటెడ్‌ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్ల వద్ద అమలుచేసేందుకు మున్సిపల్‌శాఖ ఆదేశాలు జారీచేసింది. 

Updated Date - 2021-10-17T04:39:52+05:30 IST