నిరుపయోగంగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం

Sep 27 2021 @ 00:03AM

  • శిథిలావస్థలో భవనం, హౌజ్‌లు 
  • ప్రజాధనం వృథా.. పట్టించుకోని అధికారులు
  • హస్నాబాద్‌ చెరువు కింద ఉన్న చేప పిల్లల పెంపకం కేంద్రం

కొడంగల్‌రూరల్‌: మండల పరిధిలోని హస్నాబాద్‌ పెద్ద చెరువు వద్ద నిర్మించిన చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం నిరుపయోగంగా మారింది. 1988లో రూ.4లక్షల వ్యయంతో నిర్మించిన చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం అధికారుల పర్యవేక్షణ లోపంతో శిథిలావస్థకు చేరింది. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి అప్పట్లో ప్రభుత్వం హస్నాబాద్‌ పెద్ద చెరువు వద్ద చేపల ఉత్పత్తి కేంద్రం కోసం నిర్మించిన హౌజ్‌లు కప్పలకు నిలయంగా మారాయి. చేప పిల్లల ఉత్పత్తికి 6 హౌజ్‌లను నిర్మించారు. నీటి సరఫరా కోసం రెండు ట్యాంకులనూ ఏర్పాటు చేశారు. నీటి ఎద్దడి ఏర్పడితే చేపపిల్లల పెంపకంలో సమస్యలు తలెత్తకుండా బోరును వేసి మోటారు సైతం బిగించారు. తరువాత వాటి నిర్వహణను గాలికి వదిలేయడంతో హౌజ్‌ల చుట్టూ ముళ్ల చెట్లు పేరుకుపోయాయి. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి చేప పిల్లల ఉత్పత్తికి నిర్మించిన హౌజ్‌లను వినియోగంలోకి తేవాలని మత్స్యకారులు కోరుతున్నారు.

Follow Us on: