మాకొద్దీ ముఖ హాజరు.. ప్రభుత్వానిది కక్ష సాధింపేనని ఆరోపణలు!

ABN , First Publish Date - 2022-08-18T17:42:25+05:30 IST

ఉపాధ్యాయుల ముఖ హాజరు(face attendance)పై వివాదం కొనసాగుతోంది. బుధవారం రెండో రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు హాజరు యాప్‌ను వినియోగించకుండా నిరసన తెలిపారు. యాప్‌ను వినియోగించి తీరాల్సిందేనని పాఠశాల

మాకొద్దీ ముఖ హాజరు.. ప్రభుత్వానిది కక్ష సాధింపేనని ఆరోపణలు!

యాప్ వాడకుండా ఉపాధ్యాయుల నిరసనలు

పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు బేఖాతరు

సొంత ఫోన్లలో వద్దని అధికారులకు వినతులు

ప్రభుత్వానిది కక్ష సాధింపేనని ఆరోపణలు

కీప్యాడ్ ఫోన్లు వాడాలని గ్రూపుల్లో ప్రచారం

రెండో రోజూ సరిగ్గా పనిచేయని సర్వర్

ఎంత ప్రయత్నించినా ఎర్రర్ మెసేజ్‌లతో సరి

బుధవారమూ మాన్యువల్‌గా నే హాజరు


అమరావతి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల ముఖ హాజరు(face attendance)పై వివాదం కొనసాగుతోంది. బుధవారం రెండో రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు హాజరు యాప్‌ను వినియోగించకుండా నిరసన తెలిపారు. యాప్‌ను వినియోగించి తీరాల్సిందేనని పాఠశాల విద్యాశాఖ(School Education Department) హెచ్చరిస్తున్నా ఖాతరు చేయడం లేదు. చాలా మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నా అందులో హాజరు వేయలేదు. మరికొందరు హాజరు నమోదుకు ప్రయత్నించినా సర్వర్‌ సక్రమంగా పనిచేయలేదు. ఉదయం 8.30 నుంచి 9గంటల మధ్య ఎన్నిసార్లు ప్రయత్నించినా అనేకచోట్ల ఎర్రర్‌ మెసేజ్‌లే వచ్చాయి. దీంతో టీచర్లు(teachers) మాన్యువల్‌ విధానంలోనే హాజరు నమోదు చేసుకున్నారు. మరోవైపు పాఠశాలలకు సెల్‌ఫోన్లు తీసుకురాలేమని, ప్రభుత్వం పరికరాలు ఇచ్చేవవరకూ ముఖ హాజరు నమోదు చేయబోమని రాష్ట్రవ్యాప్తంగా ఎంఈవోలు, డీఈవోలకు ఉపాధ్యాయులు వినతిపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని కూడా ఉద్యమంలా చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. ఫలితంగా 1.7లక్షల మంది టీచర్లకు గాను బుధవారం కూడా వేలల్లోనే ఆన్‌లైన్‌ హాజరు పడింది. దీనిపై పాఠశాల విద్యాశాఖ అధికారికంగా సమాచారం విడుదల చేయడం లేదు. 


అంగీకరిస్తే అంతే... 

సొంత ఫోన్లలో హాజరు విషయంలో ఒక్కసారి అంగీకారం తెలిపితే ఇక్కట్లు కొని తెచ్చుకున్నట్లేనని టీచర్లు భావిస్తున్నారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి అంగీకరించకూడదని సంఘాలన్నీ నిర్ణయించాయి. ఒకప్పుడు పాఠశాలలో ఫోన్‌ వాడితే చర్యలు తప్పవన్న ప్రభుత్వం... ఇప్పుడు సెల్‌ఫోన్‌ లేకుండా రావొద్దనడం ఎంతవరకు సమంజసమని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు స్మార్ట్‌ఫోన్లకు బదులుగా కీప్యాడ్‌ ఫోన్లు వాడాలని సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం సాగుతోంది. ఇకనుంచి కీప్యాడ్‌ ఫోన్లు మాత్రమే వినియోగిస్తామని అధికారులకు తేల్చిచెప్పాలని టీచర్ల గ్రూపుల్లో నేతలు ప్రచారం చేస్తున్నారు. 


టీచర్లపై దుష్ప్రచారం

సోషల్‌ మీడియాలో ఓ వర్గం తమపై దుష్ప్రచారం చేస్తోందని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ తీరుతో టీచర్లు సక్రమంగా పనిచేయట్లేదనే భావన ప్రజల్లోకి వెళ్తోందని, న్యాయమైన డిమాండ్లు అడిగినా గొంతెమ్మ కోర్కెలు అంటూ ప్రచారం చేస్తున్నారని, సమయం విషయంలో వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టీచర్లు సమయానికి రాకుండానే పాఠశాలలు, తరగతులు, పాఠ్య ప్రణాళికలు, విద్యార్థుల ఆన్‌లైన్‌ హాజరు, మరుగుదొడ్ల ఫొటోలు, మధ్యాహ్న భోజనం ఫొటోలు తీయడం అమలవుతున్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. యాప్‌ల వాడకం మొదలయ్యాక ఆలస్యం అనే మాటకే తావు లేకుండా పోయిందంటున్నారు. ఎప్పుడైనా ఒకసారి ఐదు, పది నిమిషాలు ఆలస్యమైనా ఆబ్సెంట్‌ వేస్తామంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఇదే విధానం అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ అమలు చేస్తారా అని నిలదీస్తున్నారు. 


టీచర్ల డేటాపై నిఘా? 

వ్యక్తిగత ఫోన్లలో ముఖ హాజరు యాప్‌ను వాడాలంటే మెసేజ్‌లు, గ్యాలరీ, లోకేషన్‌ అన్నీ పర్మిషన్లు ఇవ్వాలి. వీటి ఆధారంగా వ్యక్తిగత డేటాపై నిఘా పెడతారేమోననే ఆందోళన టీచర్లలో వ్యక్తమవుతోంది. ఇదే విషయమై జరిగిన చర్చల్లో డేటా తీసుకోబోమని స్పష్టం చేసిన ఉన్నతాధికారులు.... ‘మీరంతా ఎక్కడ, ఏం చేస్తున్నారో మాకు తెలుసు’ అని వ్యాఖ్యానించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోందని టీచర్లు అంటున్నారు. 


ఎమ్మెల్సీల మౌనం 

ముఖ హాజరు విషయంలో ఇంత రచ్చ జరుగుతున్నా ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలు మౌనం వహిస్తున్నారు. కత్తి నరసింహారెడ్డి మినహా మిగిలివారెవరూ దీనిపై స్పందించలేదు. ఇప్పటికే ఈ ఎమ్మెల్సీల పనితీరుపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన సమయాల్లో ముందుండి పోరాడాల్సిన ఎమ్మెల్సీలు చూస్తూ ఉండిపోతున్నారనే ఆరోపణలున్నాయి. వ్యక్తిగత ప్రయోజనాలకే యాత్రలు చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధి లేదని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల బస్సు యాత్రను కొన్ని సంఘాలు ఇప్పటికే విమర్శించాయి. 


వ్యతిరేకిస్తున్నాం: ఫ్యాప్టో 

అనంతపురం విద్య, ఆగస్టు 17: టీచర్ల వ్యక్తిగత సమాచార భద్రతకు ముప్పు తెచ్చే యాప్‌ హాజరును వ్యతిరేకిస్తున్నామని ఫ్యాప్టో నాయకుల పేర్కొన్నారు. టీచర్లు ఎవరూ యాప్‌ను వినియోగించవద్దని కోరారు. యాప్‌ హాజరును వ్యతిరేకిస్తూ బుధవారం అనంతపురం డీఈవో శామ్యూల్‌ను నేతలు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు నరసింహులు, సూర్యుడు తదితరులు మాట్లాడుతూ, టీచర్ల వ్యక్తిగత సమాచరానికి భద్రత ఇవ్వలేని యాప్‌లో హాజరు వేయలేమని స్పష్టం చేశారు. ప్రభుత్వమే పరికరాలను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కోడానికి ఫ్యాప్టో సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమలో నాయకులు వెంకటరత్నం, రమణయ్య, రవీంద్ర, లింగమయ్య, సిరాజుద్దీన్‌, జార్జ్‌, లింగమూర్తి, కోటేశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు.


టీచర్లపై అణచివేత వైఖరి: ఏపీటీఎఫ్‌ 

అమరావతి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులపై అణచివేత వైఖరి అవలంబిస్తోందని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య(ఏపీటీఎఫ్‌) ఆరోపించింది. మరే శాఖలోనూ లేని ముఖ హాజరు విధానం టీచర్లకు మాత్రమే అమలు చేయడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించింది. పీఆర్‌సీ, సీపీఎస్‌ ఉద్యమాల్లో క్రియాశీలంగా వ్యవహరించిన నాటినుంచి టీచర్లపై వేధింపులు పెరిగాయని ఆరోపించింది. సీపీఎస్‌ రద్దు, పాఠశాలల విలీనంతో సహా పలు డిమాండ్లపై చేపట్టిన వంద రోజుల ఉద్యమంలో భాగంగా బుధవారం విజయవాడలోని ధర్నాచౌక్‌లో ఏపీటీఎఫ్‌ నిరసన చేపట్టింది. టీడీపీ నేతలు మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌, ఎమ్మెల్సీ అశోక్‌బాబు సంఘీభావం తెలిపారు. యాప్‌ను వాడొద్దని పిలుపునిచ్చామని, అవసరమైతే ఒకరోజు మొత్తం యాప్‌లు వాడకుండా నిరసన తెలుపుతామని ఏపీటీఎఫ్‌ అధ్యక్షురాలు సీహెచ్‌.మంజుల హెచ్చరించారు. ఉద్యమాలను అణచివేసేందుకు, టీచర్లకు బెదిరించేందుకు ముఖ హాజరు విధానం తెచ్చారని ప్రధాన కార్యదర్శి కె.భానుమూర్తి ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని, యాప్‌ను వాడబోమని స్పష్టంచేశారు. ఏపీడీఆర్‌ ప్రధాన కార్యదర్శి వి.హనుమంతురావు, ఏపీటీఎఫ్‌ పూర్వ ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాద్‌, నేతలు షేక్‌ జిలానీ, వై.నేతాంజనేయప్రసాద్‌, బి.రఘుబాబు, ఎ.శేఖర్‌బాబు, పీడీ సోషలిజం, బి.రెడ్డిదొర, రాజారత్నం పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-18T17:42:25+05:30 IST