అలా చేస్తే భారత్‌ను అగౌరవపరిచినట్టే..

ABN , First Publish Date - 2021-01-25T09:34:04+05:30 IST

పటిష్టమైన టీమిండియాతో పోటీపడేందుకు ఇంగ్లండ్‌ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగాలని ఆ దేశ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ సూచించాడు. అలా జరగకపోతే భారత జట్టును అగౌరవపరిచినట్టేనని తెలిపాడు...

అలా చేస్తే భారత్‌ను అగౌరవపరిచినట్టే..

న్యూఢిల్లీ: పటిష్టమైన టీమిండియాతో పోటీపడేందుకు ఇంగ్లండ్‌ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగాలని ఆ దేశ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ సూచించాడు. అలా జరగకపోతే భారత జట్టును అగౌరవపరిచినట్టేనని తెలిపాడు. ప్లేయర్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీ ప్రకారం తొలి రెండు టెస్టులకు బెయిర్‌స్టో, ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రాన్‌, పేసర్‌ మార్క్‌ వుడ్‌లకు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) విశ్రాంతినిచ్చింది. ‘భారత్‌తో జరిగే తొలి టెస్టు కోసం ఇంగ్లండ్‌ ఎలాంటి జట్టుతో బరిలోకి దిగుతుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే భారత్‌ను వారి దేశంలోనే ఓడించడమంటే ఆసీస్‌ గడ్డపై ఆసీ్‌సను చిత్తు చేసినట్టుగానే భావించాలి. ఉత్తమ జట్టుతో ఆడకపోతే అది ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌నే కాకుండా బీసీసీఐని కూడా అగౌరవపరిచినట్టవుతుంది. బెయిర్‌స్టోతో పాటు తుది జట్టులో బ్రాడ్‌, అండర్సన్‌ ఉండాల్సిందే. భారత్‌తో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని స్టార్‌ క్రికెటర్లు భావిస్తుంటారు. తద్వారా వారికి ఐపీఎల్‌లో చోటు దక్కుతుంది. అక్కడ వారి అర్హతకు తగినట్టుగా డబ్బు సంపాదించగలుగుతారు. ఏ ఆటగాడికైనా డబ్బు అవసరమే కదా’ అని పీటర్సన్‌ ట్వీట్‌ చేశాడు.


పునరాలోచించాలి: నాసిర్‌

బెయిర్‌స్టోకు విశ్రాంతినివ్వడంపై ఇంగ్లండ్‌ బోర్డు పునరాలోచించాలని మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌ అన్నాడు. ‘స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగిన వారిలో బెయిర్‌స్టో ఒకడు. ఈ విషయంలో ఈసీబీ ఆలోచించాలి’ అని నాసిర్‌ అభిప్రాయపడ్డాడు.


Updated Date - 2021-01-25T09:34:04+05:30 IST