ఇలాగైతే కష్టమే!

ABN , First Publish Date - 2021-10-27T05:11:46+05:30 IST

‘ముఖ్యమంత్రి ఆలోచనలకు ప్రాధాన్యమివ్వండి. అందరి సహకారంతో జిల్లా అభివృద్ధి చెందాలి’ అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) పేర్కొన్నారు. మంగళవారం జిలా ్లపరిషత్‌ సమావేశ మందిరంలో ఇన్‌చార్జి మంత్రి కొడాలి నాని, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ ఆధ్వర్యంలో జిల్లా సమీక్ష మండలి(డీఆర్‌సీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్వపక్షంలో విపక్షం మాదిరిగా ప్రజాప్రతినిధులు వ్యవహరించారు. వివిధ సమస్యలను ప్రస్తావించారు. సీఎం ఆశయాలు అమలు కావడం లేదంటూ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

ఇలాగైతే కష్టమే!
సమీక్షలో మాట్లాడుతున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొడాలి నాని

అధికారుల తీరుపై ప్రజాప్రతినిధుల అసంతృప్తి

డీఆర్సీ వేదికగా మండిపాటు

జగన్‌ ఆశయాలు అమలు కావడం లేదని ఎమ్మెల్యేల ఆవేదన

ముఖ్యమంత్రి ఆలోచనలకు ప్రాధాన్యమివ్వండి

జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొడాలి నాని ఆదేశం

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, అక్టోబరు 26)

‘ముఖ్యమంత్రి ఆలోచనలకు ప్రాధాన్యమివ్వండి. అందరి సహకారంతో జిల్లా అభివృద్ధి చెందాలి’ అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) పేర్కొన్నారు. మంగళవారం జిలా ్లపరిషత్‌ సమావేశ మందిరంలో ఇన్‌చార్జి మంత్రి కొడాలి నాని, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ ఆధ్వర్యంలో జిల్లా సమీక్ష మండలి(డీఆర్‌సీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్వపక్షంలో విపక్షం మాదిరిగా ప్రజాప్రతినిధులు వ్యవహరించారు. వివిధ సమస్యలను ప్రస్తావించారు. సీఎం ఆశయాలు అమలు కావడం లేదంటూ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన వివిధ సమస్యలు.. కొన్ని పనులు పూర్తి కాకపోవడం వాస్తవమన్నారు. ‘ముఖ్యమంత్రి జగన్‌ అత్యధికంగా సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్‌క్లినిక్‌లకు ప్రాధాన్యమిచ్చారు. ఆ భవనాలు సకాలంలో పూర్తిచేయాలి. ఎమ్మెల్యేలు సచివాలయాలను తనిఖీలు చేస్తుండాలి. లేకుంటే సచివాలయాల సిబ్బంది, వలంటీర్లతోనే పాలన సాగిపోతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించాలి. ఎమ్మెల్యేలు ఎక్కువగా బాధ్యత తీసుకోవాలి. గృహనిర్మాణాలపై కొన్ని ఇబ్బందులు వాస్తవమే. ఇప్పుడా పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా పనులు జరుగుతాయి. జాయింట్‌ కలెక్టర్ల ఆధ్వర్యంలో సమీక్షలు నిర్వహించి గృహనిర్మాణాలు వేగవంతం చేయాలి’ అని మంత్రి నాని ఆదేశించారు. 

- ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. పేదలందరికీ ఇళ్లు ఉండాలన్న సీఎం లక్ష్యాన్ని నెరవేర్చే బాధ్యత అధికారులదేనన్నారు. శ్రీకాకుళం-ఆమదాలవలస నాలుగు వరుసల రోడ్డుకి తాను ఆర్‌అండ్‌బీ మంత్రిగా ఉన్నప్పుడు ఆమోదించామని.. ఇంతవరకు పనులు ఎందుకు ప్రారంభించలేదని అధికారులను ప్రశ్నించారు. 

- స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలపై అధికారులకే క్లారిటీ లేదని... పరిస్థితి ఇలానే ఉంటే ఇళ్లు ఎప్పటికీ పూర్తికావని నిట్టూర్చారు. కొలతల కారణంగా లబ్ధిదారులను అధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నారు. సీఎం ఆలోచనను అమలు చేయని అధికారులు అవసరం లేదని.. ఈ వ్యవహారంలో తనకు బాధ కలుగుతోందని విచారం వ్యక్తం చేస్తున్నారు.

- ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ మాట్లాడుతూ జిల్లా హౌసింగ్‌ పీడీ ఇచ్చిన నివేదిక అంతా తప్పు అని.. ఇప్పటికీ టెక్కలి నియోజకవర్గంలోని జగనన్న ఇళ్ల కాలనీల్లో కనీస సౌకర్యాలు  ఏర్పాటు చేయలేదని తెలిపారు. సంతబొమ్మాళి తహసీల్దార్‌ లబ్ధిదారులకు పొజిషన్‌ పట్టాలు కూడా ఇవ్వడంలేదని పేర్కొన్నారు. కనీసం మోడల్‌ హౌస్‌ కూడా నిర్మించలేదని... హౌసింగ్‌ స్కీం ఫెయిల్‌ అయితే తాము భరించలేమని చెప్పారు. బిల్లులు సక్రమంగా ఇవ్వడం లేదని.. ఇంకా రెండున్నరేళ్లలో ఎన్నికల నాటికి రోడ్లపైకి ఎలా వెళ్లగలమని అధికారులను ప్రశ్నించారు. అలాగే ఒడిశా ధాన్యాన్ని నివారించి మిల్లర్లకు చేరకుంటే.. రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని  ప్రస్తావించారు. 

- మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ జిల్లాకు 174 డిజిటల్‌ గ్రంథాయాలు మంజూరైతే..  టెక్కలి డివిజన్‌కు ఎందుకు ఇవ్వలేదని... ప్రజలకేం సమాధానం చెబుతామని.. అధికారులు తమకు ఓట్లు వేయించగలరా? అని ప్రశ్నించారు. 

- రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో క్షేత్రసహాయకుల పోస్టులు ఎందుకు భర్తీ చేయట్లేదని ప్రశ్నించారు. డ్వామా పీడీ జిల్లాకు వచ్చి చాన్నాళ్లు అవుతోందని... ఆయనను బదిలీ చేయాలని సమావేశంలోనే ప్రస్తావించడం కొసమెరుపు. 

- పాలకొండ ఎమ్మెల్యే వి.కళావతి మాట్లాడుతూ మార్కెఫెడ్‌ బాధ్యత తీసుకోవట్లేదని.. రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా కావట్లేదన్నారు. ఈ-క్రాప్‌లో పంటలు గుర్తించకపోవడంతో పాలకొండ నియోజకవర్గంలో మొక్కజొన్న పంటకు పరిహారం లభించలేదని వెల్లడించారు. పశువులు అకారణంగా మరణిస్తున్నాయని.. పశువైద్యాధికారి సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదన్నారు. 

- ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ న్యూక్లియర్‌ పవర్‌ప్లాంట్‌ నిర్మాణానికి సంబంధించిన భూములు, రైతుల వివరాలపై రీసర్వే చేయాలన్నారు. టీడీపీ హయాంలో ఆక్రమణదారులకు కూడా పరిహారం వెళ్లిందని వివరించారు. 

- జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ మాట్లాడుతూ ఉద్దానం కిడ్నీ సమస్య ప్రపంచంలోనే అత్యధికమన్నారు. కానీ అక్కడ సరైన నెఫ్రాలజిస్టు, మత్తువైద్యుడు, ఇతర వైద్యులను ఎందుకు నియమించడంలేదని అధికారులను ప్రశ్నించారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, మరికొద్దిమంది ప్రజాప్రతినిధులు మాత్రమే సమస్యలు ప్రస్తావించారు. 

- కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌ మాట్లాడుతూ గృహనిర్మాణాలు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒడిశా ధాన్యాన్ని అడ్డుకునేందుకు పోలీసు, రెవెన్యూ, సివిల్‌సప్లయ్స్‌ అధికారులతో నిఘా పటిష్టం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-27T05:11:46+05:30 IST