పశ్చిమాన ప్రబలుతున్న అసంతృప్తి

ABN , First Publish Date - 2022-01-27T08:23:17+05:30 IST

కొత్త జిల్లాల ప్రకటనతో పశ్చిమాన అసంతృప్తి ప్రబలుతోంది. పుంగనూరు అసెంబ్లీ సెగ్మెంట్‌ మినహా రాజంపేట లోక్‌సభ నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లా పేరిట రాయచోటి కేంద్రంగా ఏర్పాటు చేయడం పట్ల మదనపల్లెలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

పశ్చిమాన ప్రబలుతున్న అసంతృప్తి
జిల్లా కేంద్రం కోసం మదనపల్లెలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మాజీ ఎమ్మెల్యేల, ప్రజాసంఘాల నాయకుల ఐక్యత

కొత్త జిల్లాల ప్రకటనతో మదనపల్లెలో ఆందోళన

ఉన్నత విద్యా, వైద్య సంస్థలు ఒక్కటీ లేని వైనం

డివిజన్ల ఏర్పాటులోనూ కొందరికి అసౌకర్యం

వర్శిటీల్లో స్థానిక కోటా కోల్పోతామన్న భయం

బాలాజీ జిల్లా పేరు పట్ల కూడా అభ్యంతరాలు


తిరుపతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): కొత్త జిల్లాల ప్రకటనతో పశ్చిమాన అసంతృప్తి ప్రబలుతోంది. పుంగనూరు అసెంబ్లీ సెగ్మెంట్‌ మినహా రాజంపేట లోక్‌సభ నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లా పేరిట రాయచోటి కేంద్రంగా ఏర్పాటు చేయడం పట్ల మదనపల్లెలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్త జిల్లా అంటూ ఏర్పడితే దానికి మదనపల్లె కేంద్రంగా వుండాలన్న డిమాండ్‌తో చాలాకాలంగా మదనపల్లెలో ఉద్యమం నడుస్తోంది. ఇపుడు ప్రభుత్వం రాయచోటి పాలనా కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటించడంతో మదనపల్లె జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన మొదలైంది. ఇది క్రమేపీ తంబళ్లపల్లె, పీలేరు సెగ్మెంట్లకు కూడా ప్రబలే పరిస్థితి కనిపిస్తోంది. దానికి తోడు ప్రతిపాదిత కొత్త జిల్లాలో అటు ప్రభుత్వ, ఇటు పైవేటు రంగంలో కూడా చెప్పుకోదగ్గ ఉన్నత విద్యా, వైద్య సంస్థలు లేకపోవడం వెలితిగా మారింది. మదనపల్లెలో పేరుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి వున్నా స్థాయి రీత్యా ఏరియా ఆస్పత్రికి మించి సదుపాయాలేమీ లేవు. యూనివర్శిటీలన్నీ తిరుపతిలో వుండడం, కొత్త జిల్లా వలన వాటిలో తమకు స్థానిక కోటా వుంటుందో వుండదో తెలియక పశ్చిమ ప్రాంతవాసులు ఆందోళనకు గురవుతున్నారు. తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం పుణ్యక్షేత్రాలను గొప్పగా చెప్పుకునే పరిస్థితి నుంచీ ఇపుడు వాటితో సంబంధం లేని స్థితికి చేరడం సెంటిమెంటల్‌గా ఈ ప్రాంతవాసుల్ని బాధిస్తోంది.


తిరుపతికి బాలాజీ పేరు పట్ల అభ్యంతరాలు

తిరుపతి కేంద్రంగా ఏర్పాటవుతున్న కొత్త జిల్లాకు బాలాజీ జిల్లాగా పేరు పెట్టడం స్థానికులకు అభ్యంతరకరంగా మారింది. బాలాజీ అన్నది శ్రీవారి పేరే అయినప్పటికీ ఉత్తర భారతీయులు మాత్రమే ఆ పేరిట దేవుని పిలిచి కొలుస్తారని, స్థానికంగా వెంకటేశ్వరస్వామి పేరే బహుళ ప్రచారంలో వుండి జనం దైనందిన జీవితంలో పెనవేసుకుపోయిందని గుర్తు చేస్తున్నారు. కాబట్టి తిరుపతి కేంద్రంగా ఏర్పడుతున్న కొత్త జిల్లాకు వెంకటేశ్వర జిల్లా లేదా శ్రీవారి జిల్లాగా పేరు మార్చాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఈ విషయంలో జనసేన నుంచీ తొలి డిమాండ్‌ వినిపిస్తోంది. తిరుపతి నియోజకవర్గ జనసేన ఇంఛార్జి కిరణ్‌ రాయల్‌ ఓ ప్రకటనలో ఈ మేరకు డిమాండ్‌ చేశారు.అలాగే నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గాలి భానుప్రకాష్‌  కోరారు.నగరి నియోజకవర్గం భౌగోళికంగా బాలాజీ జిల్లా సరిహద్దులో ఉందని, తుడా పరిధిలో ఉన్న నగరిని చిత్తూరు జిల్లాలో కలపడం ఏంటని ప్రశ్నించారు. నగరి నియోజకవర్గ ప్రజలకు నిత్యం తిరుపతి కేంద్రంగా రవాణా, ఉద్యోగ, వ్యాపారకార్యకలాపాలున్నాయని గుర్తు చేశారు. నియోజకవర్గం నుంచి తిరుపతి సమీపంలోనే ఉందని, అదే చిత్తూరు సుమారు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు.


డివిజన్ల ఏర్పాటులోనూ అసంతృప్తులు

కొత్త జిల్లాలతో పాటు ఏర్పాటవుతున్న కొత్త రెవిన్యూ డివిజన్ల విషయంలో కొన్ని మండలాలకు బాగా సదుపాయంగా వున్నా మొత్తం మీద అసంతృప్తే వ్యక్తమవుతోంది. ఉదాహరణకు తిరుపతికి చాలా చేరువగా వున్న రామచంద్రాపురం, చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాలెం మండలాలు ఇప్పటి వరకూ చిత్తూరు, మదనపల్లె డివిజన్ల పరిధిలో వున్నాయి. ఇకపై ఈ మండలాల ప్రజలకు తిరుపతి డివిజన్‌ కేంద్రం కానుండడంతో వారి రాకపోకలకు సౌకర్యవంతంగా వుంటుందని చెప్పాలి. అయితే మదనపల్లెకు చేరువగా వున్న రొంపిచెర్ల మండలాన్ని ఎక్కడో వున్న పలమనేరు డివిజన్‌ పరిధిలో చేర్చడంతో ప్రజలకు అసౌకర్యం కలిగించనుంది.అలాగే గుర్రంకొండ, కలకడ మండలాలకు రాయచోటి డివిజన్‌ కేంద్రం మదనపల్లె కంటే బాగా చేరువ కావడంతో ఈ మండలాల వాసులకు సదుపాయంగానే వుండనుంది. అదే సమయంలో పీలేరు, కేవీపల్లె మండలాలను రాయచోటి డివిజన్‌కు చేర్చడం పట్ల ఆ మండలాల్లో అసంతృప్తి రగులుతోంది. దూరం ఒకటే అయినప్పుడు ఎప్పటి నుంచో కొనసాగుతున్న మదనపల్లె డివిజన్‌లోనే కొనసాగించాలన్న డిమాండ్‌ ఆ మండలాల నుంచీ వినిపిస్తోంది. ఇక నాయుడుపేట డివిజన్‌ విషయంలో కూడా తూర్పు మండలాల్లో తీవ్ర అసంతృప్తి ప్రబలుతోంది. నాయుడుపేట జనాభా 50 వేలు కాగా శ్రీకాళహస్తిలో రెట్టింపు జనాభా వుంది. నాయుడుపేటతో పోలిస్తే శ్రీకాళహస్తి చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా ఘనమైన నేపఽథ్యముంది. యాభై ఏళ్ళుగా మున్సిపల్‌ పట్టణం. అలాంటిది శ్రీకాళహస్తి మండలాన్ని కూడా నాయుడుపేట డివిజన్‌లో చేర్చడం తూర్పు మండలాలవాసులకు అసంతృప్తి కలిగిస్తోంది. నాయుడుపేట బదులు శ్రీకాళహస్తిని డివిజన్‌ కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండ్‌ ఆ ప్రాంతం నుంచీ వినిపిస్తోంది.అలాగే పారిశ్రామికవాడగా ఎదుగుతున్న సత్యవేడు నియోజకవర్గాన్ని తిరుపతి రెవెన్యూ డివిజన్‌లోనే కొనసాగించాలని సీపీఎం ఇన్‌చార్జి దాసరి జనార్దన్‌ డిమాండ్‌ చేశారు.నియోజకవర్గాన్ని రెండుగా చీల్చి సత్యవేడు, వరదయ్యపాలెం, బీఎన్‌ కండ్రిగ, కేవీబీ పురం మండలాలను నాయుడుపేట డివిజన్‌లో కలిపి మిగిలిన నాగలాపురం, పిచ్చాటూరు, నారాయణవనం మండలాలను తిరుపతి డివిజన్‌లో కొనసాగించడం వల్ల పాలనా పరంగా ఇబ్బందులు తలెత్తుతాయన్నారు.ఉన్నతాధికారులు తక్షణం స్పందించి నియోజకవర్గం మొత్తాన్ని ఒకే రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. 


అందరి వేళ్ళూ పెద్దిరెడ్డి వైపే!

కొత్త జిల్లాల ఏర్పాటులో సమతుల్యత లోపించిందన్న విమర్శల నేపధ్యంలో అందరి వేళ్ళూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైపే మళ్ళుతున్నాయి. ప్రస్తుత జిల్లాలో తమ కుటుంబ రాజకీయ ప్రాబల్యం తగ్గకుండా వుండాలన్న తలంపుతోనే కొత్త జిల్లాల ఏర్పాటును పెద్దిరెడ్డి కుటుంబం ప్రభావితం చేసిందన్న ప్రచారం జరుగుతోంది. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో భాగమైన పుంగనూరు సెగ్మెంట్‌ను మాత్రం విడదీసి చిత్తూరు జిల్లాలో కలపడం దీనికి ఊతమిస్తోంది. నగరి, జీడీనెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, చిత్తూరు సెగ్మెంట్లతో కూడిన కొత్త జిల్లాలో పుంగనూరు చేరడంతో ఆ జిల్లాపై పెద్దిరెడ్డికి పూర్తి పట్టు దక్కనుంది. అదే సమయంలో తనయుడు మిధున్‌ రాజంపేట ఎంపీగా, తమ్ముడు ద్వారకనాధరెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా వున్నందున రాజంపేట జిల్లాలోనూ ఆయన కుటుంబ ప్రాబల్యం కొనసాగనుంది. ఇక పీలేరు సెగ్మెంట్‌లో రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే తీరులో వాల్మీకిపురం, కలికిరి మండలాలను మదనపల్లె డివిజన్‌లో కొనసాగిస్తూ, మిగిలిన పీలేరు, కంభంవారిపల్లె, కలకడ, గుర్రంకొండ మండలాలను రాయచోటి డివిజన్‌లో చేర్చడం పట్ల కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.


పలు ఘనతలు ఇక గతించిన వైభవమే!

ఇప్పటి వరకూ 66 మండలాలతో రాష్ట్రంలోని పెద్ద జిల్లాల్లో ఒకటైన చిత్తూరు జిల్లాకు ఇకనుంచీ ఆ ఘనత వుండదు. భవిష్యత్తులో చిత్తూరు జిల్లాలో కేవలం 33 జిల్లాలు మాత్రమే వుంటాయి. అంటే సగం మండలాలను కోల్పోయినట్టవుతోంది. మరోవైపు 31 మండలాలు, ఐదు మున్సిపాలిటీలతో దేశంలోనే పెద్ద రెవిన్యూ డివిజన్‌గా పేరొందిన మదనపల్లె కూడా ఆ ఖ్యాతిని కోల్పోనుంది. మదనపల్లె డివిజన్‌లో ఇకపై కేవలం 11 మండలాలు మ్తాత్రమే కొనసాగనున్నాయి.

Updated Date - 2022-01-27T08:23:17+05:30 IST