సౌత్‌ వైసీపీలో అసమ్మతి

ABN , First Publish Date - 2021-03-02T06:06:59+05:30 IST

పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన వారిని తప్పించి తనకు డబ్బులు ఇచ్చిన వారికి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ కార్పొరేటర్‌ సీట్లు ఇప్పించుకున్నారని దళిత సంఘాల నేతలు ఆరోపించారు.

సౌత్‌ వైసీపీలో అసమ్మతి
అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న దళిత సంఘాలు

36వ వార్డులో అభ్యర్థినిపై మార్పుపై ఆగ్రహం

ఎమ్మెల్యే వాసుపల్లి టిక్కెట్లు అమ్ముకున్నారని కొప్పుల వెంకటరావు ఆరోపణలు

న్యాయం చేయకపోతే జీవీఎంసీ పరిధిలో వైసీపీకి తమ సత్తా ఏమిటో చూపిస్తామని దళిత సంఘాల హెచ్చరిక 


విశాఖపట్నం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి):


పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన వారిని తప్పించి తనకు డబ్బులు ఇచ్చిన వారికి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ కార్పొరేటర్‌ సీట్లు ఇప్పించుకున్నారని దళిత సంఘాల నేతలు ఆరోపించారు. జీవీఎంసీ పరిధిలోని 36వ వార్డు వైసీపీ అభ్యర్థిగా కొప్పుల స్వర్ణలతను తప్పించి మాసిపోగు మేరీజోన్స్‌ను ప్రకటించారు. దీంతో కొప్పుల స్వర్ణలత, ఆమె భర్త వెంకటరావుతోపాటు పలువురు దళిత సంఘాల నేతలు సోమవారం ఎల్‌ఐసీ భవనం సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరావు ఇతర దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్యే వాసుపల్లి తీరును ఎండగట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నందున తన భార్యకు గత ఏడాది మార్చిలో కార్పొరేటర్‌గా టిక్కెట్‌ కేటాయించడంతోపాటు బీఫారం కూడా అందజేశారన్నారు. అయితే టీడీపీ నుంచి గెలిచి ఇటీవల వైసీపీలో చేరిన వాసుపల్లి గణేష్‌కుమార్‌ గతంలో టిక్కెట్లు పొందిన వారి వద్ద నుంచి డబ్బులు డిమాండ్‌ చేశారని, తాము ఇవ్వకపోవడంతో రూ.40 లక్షలకు తమ టిక్కెట్‌ వేరొకరికి అమ్మేశారని ఆరోపించారు. తమ వార్డును మాసిపోగు మేరీజోన్స్‌కు ఇప్పించారని, వారు ఏడాది కిందట ఒంగోలు నుంచి వ్యాపారం కోసం నగరానికి వలస వచ్చారన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని డబ్బు కోసం ఇతరులకు సీట్లు ఇవ్వడం దారుణమన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, రెండు రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే ఇండిపెండెంట్‌గా పోటీలో కొనసాగుతానన్నారు. దళిత సంఘం నేత బొడ్డు కల్యాణరావు మాట్లాడుతూ స్థానికుడు, పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడుతున్న వెంకటరావుకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఒక్క 36వ వార్డులోనే కాకుండా జీవీఎంసీ పరిధిలోని అన్ని వార్డుల్లోనూ దళితుల సత్తా ఏమిటనేది వైసీపీ నేతలకు చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్‌ నాయకులు అప్పారావు, నరసింగరావు, రమణ, షేక్‌ మదీన్‌, సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-02T06:06:59+05:30 IST